Renigunta: రేణిగుంటలో టీడీపీ ప్రభంజనం.. జే. చిత్రకు చారిత్రాత్మక విజయం!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి జే. చిత్ర 3,870 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అభినందించారు.
Renigunta: రేణిగుంటలో టీడీపీ ప్రభంజనం.. జే. చిత్రకు చారిత్రాత్మక విజయం!
రేణిగుంట: రేణిగుంట పట్టణంలో తెలుగుదేశం పార్టీ విజయభేరి మోగించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి జే. చిత్ర మంచం గుర్తుపై పోటీ చేసి 3,870 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొత్తం 11,661 ఓట్లకు గానూ 6,527 ఓట్లు పోలవగా, ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించి రేణిగుంట ఎన్నికల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. భారీ మెజార్టీతో సాధించిన ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఫలితాలు వెలువడిన వెంటనే పట్టణవ్యాప్తంగా విజయోత్సవాలు అంబరాన్నంటాయి.
విజయం వెనుక మహబూబ్ బాషా కృషి
ఈ ఘన విజయం వెనుక రేణిగుంట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా అందించిన సహాయ సహకారాలు, ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన కృషి కీలకమని అభ్యర్థి జే. చిత్రతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. ప్రచార వ్యూహాల సమన్వయం, నాయకులు, కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకురావడం, ఇంటింటి ప్రచారంలో పార్టీ శ్రేణులను ముందుకు నడిపించడంలో మహబూబ్ బాషా చొరవ చూపారని తెలిపారు. అందరి సమష్టి కృషి, ప్రజల మద్దతుతోనే ఇంతటి భారీ విజయం సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు.
మహబూబ్ బాషాకు ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలు
రేణిగుంటలో టీడీపీ అభ్యర్థి జే. చిత్ర సాధించిన భారీ విజయంపై శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యేకంగా స్పందించారు. పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషాకు ఫోన్ చేసి ఘన విజయంపై అభినందనలు తెలియజేశారు. అలాగే సర్పంచ్‌గా విజయం సాధించిన జే. చిత్రకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తల కృషిని అభినందించారు.
పట్టణమంతా విజయోత్సవాల సందడి
ఎన్నికల ఫలితాలతో టీడీపీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాణసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ, జై తెలుగుదేశం నినాదాలతో పట్టణంలో విజయోత్సవాలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రేణిగుంటలో నమోదైన ఈ భారీ మెజార్టీ స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.