weather update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు

Weather Alert: తెలంగాణ రాష్ట్రంలో రానున్న కొద్దిరోజులు భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్ 24 నుంచి 27 వరకు వర్ష సూచన ఉండగా, ఆ తర్వాత చలి తీవ్రత ఒక్కసారిగా పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు లేదా చినుకులు పడే సూచనలు ఉన్నాయి.

ఈ ఆకస్మిక వాతావరణ మార్పుల నేపథ్యంలో ఉదయాన్నే దట్టమైన పొగమంచు కమ్మేసే అవకాశం ఉంది. పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించక దృశ్యమానత తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి తెల్లవారుజాము, ఉదయం వేళల్లో రహదారులపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఫాగ్ లైట్లు వాడుతూ నెమ్మదిగా ప్రయాణించాలని అధికారులు సూచించారు.

వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోనుంది. నవంబర్ 29 నుంచి తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజాము వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు వెచ్చని దుస్తులు ధరిస్తూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులు కోరారు.

Tags: