Kothagudem: ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి రూ.3 కోట్లతో రహదారుల నిర్మాణం!

లక్ష్మీదేవిపల్లి: మారుమూల ఏజెన్సీ గ్రామాల సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో రూ.3 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు.

బావోజి తండా పంచాయతీ పరిధిలోని రేగళ్ల ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి కొత్తూరు వరకు రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు, రేగళ్ల పంచాయతీ పరిధిలో రేగళ్ల ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి బొల్లం అయోధ్య ఇంటి వరకు మరో రూ.కోటితో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. అలాగే లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని ఆర్లగండి నుంచి లక్ష్మీపురం గ్రామం వరకు రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంత ప్రజలు తనపై ఉంచిన నమ్మకం, చూపుతున్న ఆదరణే తనకు అసలైన బలమని పేర్కొన్నారు. గిరిజన, గిరిజనేతర పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. దశాబ్దాలుగా ఎర్రజెండాను, కమ్యూనిస్టు పార్టీని ఆదరిస్తున్న ఏజెన్సీ ప్రజల రుణం అభివృద్ధి పనుల ద్వారా తీర్చుకుంటామని తెలిపారు.

గిరిజన గూడేలు, తండాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి, రహదారి సౌకర్యం కల్పించడం ద్వారా మారుమూల గ్రామాల ప్రజల రవాణా కష్టాలను తొలగించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, వివిధ శాఖల అధికారులు శంకర్, రఘురామయ్య, శివలాల్, ప్రవీణ్, పలువురు ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: