Thummala Nageswara Rao: పంటల మార్పిడికి మాస్టర్ ప్లాన్: 13 లక్షల ఎకరాల్లో కొత్త పంటలు.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు!
Thummala Nageswara Rao: తెలంగాణలో వరి, పత్తి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించేందుకు ప్రభుత్వం 13 లక్షల ఎకరాల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.
Thummala Nageswara Rao: పంటల మార్పిడికి మాస్టర్ ప్లాన్: 13 లక్షల ఎకరాల్లో కొత్త పంటలు.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు!
Thummala Nageswara Rao: తెలంగాణ వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సాంప్రదాయ వరి, పత్తి పంటలకు బదులుగా మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రైతు కమిషన్ అందించిన నివేదికపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
రానున్న మూడేళ్లలో సుమారు 13 లక్షల ఎకరాల్లో పంట మార్పిడి చేపట్టేలా ప్రభుత్వం భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ముఖ్యంగా ఉద్యాన పంటలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు (మిల్లెట్స్), మరియు ఆయిల్‌సీడ్స్ సాగుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాదిలోనే లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులకు సూచించారు.
నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోతున్న నేపథ్యంలో, కేంద్ర విత్తన చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. బాధితులకు అందే పరిహారం విషయంలో స్పష్టత ఉండాలని, నకిలీ విత్తనాల అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో యూరియా సరఫరాలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే యూరియాలో 90 శాతం వాటాను తెలంగాణకే కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
మార్కెట్ అవసరాలను బట్టి ఏ పంటలు వేస్తే రైతులకు లాభం కలుగుతుందో క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు.