Kokapet: కోకాపేట భూముల వేలానికి బిడ్డర్లు నో.. రెండోసారి వేలం రద్దు!

Kokapet: కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్‌లో భూముల వేలానికి ఆశించిన స్థాయిలో స్పందన కరవైంది. మొత్తం 4.59 ఎకరాల విస్తీర్ణంలోని ఈ భూమికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) శుక్రవారం వేలం నిర్వహించింది. కనీస ధర (అప్‌సెట్ ధర)ను ఎకరాకు రూ.120 కోట్లుగా నిర్ధరించగా, ఒక్క బిడ్డు కూడా దాఖలు కాకపోవడంతో అధికారులు వేలాన్ని రద్దు చేశారు.

ఇదే భూమికి గత సెప్టెంబర్‌లోనూ హెచ్‌ఎండీఏ వేలం నిర్వహించింది. ఆ సమయంలో ఎకరాకు రూ.120 కోట్ల ధరతో కేవలం ఒకే బిడ్డు దాఖలైంది. నిబంధనల ప్రకారం పోటీ లేనందున అప్పట్లోనూ అధికారులు వేలాన్ని రద్దు చేశారు. తాజా వేలంలోనూ ఏ ఒక్క సంస్థ ముందుకు రాకపోవడంతో నియోపోలిస్ భూముల విక్రయ ప్రక్రియకు మరోసారి బ్రేక్ పడింది.

ఒకప్పుడు రికార్డు స్థాయి ధరలు పలికిన కోకాపేట నియోపోలిస్ భూముల వేలానికి ఈసారి బిడ్లు దాఖలు కాకపోవడం, స్థిరాస్తి సంస్థల నుంచి పోటీ లేకపోవడంపై హెచ్‌ఎండీఏ అధికారులు సమీక్షిస్తున్నారు. మార్కెట్ పరిస్థితులు, కనీస ధర నిర్ణయం వంటి అంశాలపై విశ్లేషిస్తూ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Tags: