Kondagattu: మౌలిక సదుపాయాలు భేష్ కొండగట్టు ఏర్పాట్లపై భక్తుల హర్షం!
Kondagattu: జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మరియు ఎస్పీ అశోక్ కుమార్ కొండగట్టు అంజన్న క్షేత్రంలో హనుమాన్ జయంతి ఏర్పాట్లను అర్ధరాత్రి తనిఖీ చేశారు.
Kondagattu: మౌలిక సదుపాయాలు భేష్ కొండగట్టు ఏర్పాట్లపై భక్తుల హర్షం!
జగిత్యాల: కొండగట్టు చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల తీరును పరిశీలన, కొండగట్టు చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.
బుధవారం రాత్రి 11 గంటలకు క్షేత్ర స్థాయిలో కొండగట్టులో కొనసాగుతున్న హనుమాన్ జయంతి ఉత్సవాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి సందర్శించి భక్తులకు కల్పించిన సౌకర్యాలను ఉత్సవాలు జరుగుతున్న తీరును, దీక్షపరుల మాల విరమణ తీరును, కోనేరు పరిసరాలను, ఆలయ పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఏర్పాట్లను ప్రత్యక్షంగా మరియు ఆలయ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో వీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ..
ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారని అందుకు అనుగుణంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండేలా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
అదేవిధంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్న దృష్ట్యా పారిశుద్ధ్య నిర్వహణకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, సిబ్బంది తమ కేటాయించిన స్థానాల్లో తమ విధులు నిర్వహించాలని, పార్కింగ్ సదుపాయాలు సరిపడా ఉండేలా చూడాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని అధికారులకు సూచించారు. మాల విరమణ క్యూ లైన్లు, కేశఖండన లైన్లు, భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
వైద్య శిబిరాలు 24*7 సిద్ధంగా ఉండాలని, అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచాలని ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మరియు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ లు బుధవారం రాత్రి సుమారు నాలుగు గంటల పాటు ఆలయ పరిసరాల్లో జయంతి జరుగుతున్న తీరును భక్తులకు కల్పించిన సౌకర్యాలను క్షేత్రస్థాయిలో దగ్గరుండి పరిశీలించారు. ఈ జయంతి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగే విధంగా తగిన అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
హనుమాన్ జయంతి ఉత్సవాలకు హాజరవుతున్న భక్తులు జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్ల పట్ల మరియు కల్పించిన సదుపాయాల పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్, ఆలయ ఈవో అంజనా రెడ్డి, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డిపిఓ మదన్మోహన్ ,డి పి ఆర్ ఓ నరేష్, సంబంధిత శాఖల అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.