Kamareddy: 60 అడుగుల ఎత్తులో సబ్ కలెక్టర్ కిరణ్మయి రెస్క్యూ ఆపరేషన్!!

Kamareddy: కామారెడ్డి జిల్లా బూర్గుల్ గ్రామంలో ఆత్మహత్యకు యత్నించిన ఇంటర్ విద్యార్థినిని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ధైర్యంగా కాపాడారు.

Update: 2026-03-20 05:24 GMT

Kamareddy: 60 అడుగుల ఎత్తులో సబ్ కలెక్టర్ కిరణ్మయి రెస్క్యూ ఆపరేషన్!!

మహమ్మద్ నగర్ (కామారెడ్డి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఒక హైడ్రామా చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ ఎ. కిరణ్మయి చూపిన ధైర్యసాహసాలు ఆమె ప్రాణాలను కాపాడాయి.


మహమ్మద్ నగర్ మండలం బూర్గుల్ గ్రామానికి చెందిన మెట్టు స్రవంతి (17) అనే విద్యార్థిని ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసింది. గురువారం రాత్రి తల్లి చివాట్లు పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన స్రవంతి, గ్రామంలోని 60 అడుగుల ఎత్తు ఉన్న త్రాగునీటి ట్యాంక్ పైకి ఎక్కి హల్చల్ చేసింది. ఆమె కిందకు దూకేందుకు సిద్ధమవడంతో స్థానికులు భయాందోళనకు గురై వెంటనే అధికారులకు సమాచారం అందించారు.

రంగంలోకి సబ్ కలెక్టర్.. క్లిష్టమైన ఆపరేషన్!

సమాచారం అందుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ ఎ. కిరణ్మయి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి విషమిస్తోందని గమనించిన ఆమె, తన ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా స్వయంగా 60 అడుగుల ఎత్తు ఉన్న ట్యాంక్ పైకి ఎక్కారు. సుమారు రెండున్నర గంటల పాటు ట్యాంక్ పైనే ఉండి, విద్యార్థినికి నచ్చజెప్పారు. ఆమెతో ఆత్మీయంగా మాట్లాడుతూ, కౌన్సెలింగ్ ఇచ్చి చివరకు సురక్షితంగా కిందకు దిగేలా ఒప్పించారు.

సమష్టి కృషితో సురక్షితం:

ఈ ఆపరేషన్‌లో ఎల్లారెడ్డి అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు, గ్రామ సర్పంచ్ మరియు పెద్దలు సమన్వయంతో వ్యవహరించారు. కిందకు దిగిన విద్యార్థినిని ఆమె తల్లిదండ్రులు నాయక్ పోడు సాయిలు దంపతులకు అప్పగించారు. క్లిష్ట సమయంలో ఒక ఉన్నతాధికారి స్వయంగా రంగంలోకి దిగి ప్రాణాలను కాపాడటంపై గ్రామస్థులు సబ్ కలెక్టర్ కిరణ్మయిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Tags:    

Similar News