Life Insurance: ఒక్క రూపాయి కట్టక్కర్లేదు.. కుటుంబానికి రూ.5 లక్షల బీమా.. ఎలా దరఖాస్తు చేయాలంటే?
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని నవంబర్ 19న ప్రారంభిస్తోంది. కుటుంబంలో సంపాదించే 18 నుంచి 59 ఏళ్ల వ్యక్తికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పిస్తారు.
Indiramma Family Life Insurance Scheme
Life Insurance: తెలంగాణలోని కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని తీసుకొస్తోంది. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని బీమా నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఒకేసారి కుటుంబాల వివరాల నమోదు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కుటుంబంలో ఒక్కరికి రూ.5 లక్షల జీవిత బీమా
ఈ పథకం కింద ప్రతి కుటుంబంలో జీవనోపాధికి ప్రధాన ఆధారంగా ఉన్న ఒక వ్యక్తికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పిస్తారు. బీమా పొందిన వ్యక్తి మరణిస్తే ఆయన లేదా ఆమె పేర్కొన్న నామినీకి బీమా మొత్తం అందుతుంది. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది సంపాదిస్తుంటే.. ఎవరికి బీమా చేయించుకోవాలనేది కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చు. ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా పేర్కొనే అవకాశం కూడా ఉంది. అలా ఎంపిక చేసుకుంటే రూ.5 లక్షల మొత్తాన్ని వారికి ఏ నిష్పత్తిలో పంచాలనే వివరాలను దరఖాస్తు సమయంలోనే నమోదు చేయాలి. ఈ పథకానికి సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. లబ్ధిదారులు తమ జేబు నుంచి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎవరు అర్హులు? రేషన్ కార్డు లేకున్నా అవకాశం ఉందా?
ఈ పథకంలో బీమా పొందే వ్యక్తి వయసు 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండాలి. వయసును నిర్ధారించేందుకు ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. కులం, మతం, ఆదాయం ఆధారంగా వివక్ష లేకుండా కుటుంబాలకు బీమా కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రేషన్ కార్డు ఉన్న కుటుంబాల వివరాలను పౌరసరఫరాల శాఖ డేటా ఆధారంగా నమోదు చేస్తారు. అయితే రేషన్ కార్డు లేని కుటుంబాలు, ఆహార భద్రత కార్డు డేటాలో పేర్లు లేని వారు కూడా ప్రత్యేక దరఖాస్తు ద్వారా నమోదు చేసుకోవచ్చు. అలాంటి కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు కోడ్ కేటాయించే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇతర జిల్లాలకు చెందిన రేషన్ కార్డు ఉన్నవారు కూడా తాము ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతానికి సమీపంలోని శిబిరంలో పేర్లు నమోదు చేసుకోవచ్చు.
ఎక్కడ దరఖాస్తు చేయాలి? చివరి తేదీ ఎప్పుడు?
ఈ పథకంలో చేరేందుకు నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద, పట్టణాల్లో వార్డు కార్యాలయాల పరిధిలో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహిస్తారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో వార్డు అధికారులు నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల సహకారం కూడా తీసుకోనున్నారు. ప్రత్యేక యాప్, ఆన్లైన్ విధానం ద్వారా కూడా వివరాల నమోదు చేపట్టే ఏర్పాట్లు ఉన్నాయి. మీ ప్రాంతంలో శిబిరం ఎక్కడ నిర్వహిస్తున్నారో గ్రామ పంచాయతీ లేదా వార్డు కార్యాలయంలో తెలుసుకుని అక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు సమయంలో ఏ పత్రాలు తీసుకెళ్లాలి?
బీమా చేయించుకునే వ్యక్తి ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు, రేషన్ కార్డు ఉంటే దాని నంబర్, మొబైల్ ఫోన్ నంబర్ సిద్ధంగా ఉంచుకోవాలి. నామినీల పేర్లు, వారి ఆధార్ వివరాలు కూడా అవసరమవుతాయి. దరఖాస్తులో బీమా పొందే వ్యక్తి వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, నామినీలకు సంబంధించిన వివరాలను నమోదు చేస్తారు. ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా ఎంపిక చేస్తే బీమా మొత్తంలో ఎవరికెంత వాటా ఇవ్వాలన్నది స్పష్టంగా చెప్పాలి. నమోదు చేసిన వివరాలను అధికారులు కుటుంబ సభ్యులకు చదివి వినిపించి, సరిచూసిన తర్వాతే బీమా పొందే వ్యక్తి సంతకం తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే కార్మికులు, మత్స్యకారులు, గౌడలు, నేతన్నల కోసం అమల్లో ఉన్న బీమా పథకాలను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. 2026-27 బడ్జెట్లో ఈ పథకం కోసం రూ.4 వేల కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది.