త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. తెలంగాణ నుంచి ఆ ఇద్దరికి కేబినెట్ బెర్తులు?

Central Cabinet Expansion: కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలతో తెలంగాణ బీజేపీలో రాజకీయం వేడెక్కింది.

Update: 2026-06-25 04:29 GMT

త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. తెలంగాణ నుంచి ఆ ఇద్దరికి కేబినెట్ బెర్తులు?

Telangana BJP MPs: త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. దేశవ్యాప్తంగా సామాజిక, ప్రాంతీయ సమీకరణలను సమన్వయం చేస్తూ ప్రధాని మోదీ తన మంత్రిమండలిని పునర్వ్యవస్థీకరించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీల మధ్య మంత్రి పదవుల కోసం పోటీ ఒక్కసారిగా ఊపందుకుంది. మరో రెండు, మూడు రోజుల్లోనే కేబినెట్ విస్తరణ ఉండబోతోందన్న వార్తలతో ఆశావహులైన ఎంపీలు హుటాహుటిన ఢిల్లీ బాట పట్టారు. అధిష్టానం పెద్దల దృష్టిలో పడి ఎలాగైనా మంత్రి పీఠాన్ని దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ప్రస్తుతం ఉన్న సమీకరణాలు ఏంటి..?

తెలంగాణ నుంచి మొత్తం ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా, బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే, రాబోయే విస్తరణలో రాష్ట్రానికి ఎన్ని కొత్త పదవులు దక్కుతాయనే దానిపైనే సర్వత్రా చర్చ నడుస్తోంది. ఒకవేళ తెలంగాణకు అదనంగా రెండు పదవులు కేటాయిస్తే.. అందులో ఒకటి బీసీ సామాజిక వర్గానికి, మరొకటి మహిళా లేదా ఎస్టీ కోటాకు దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాల అంచనా. ఒకవేళ ఒకే ఒక్క పదవి ఇస్తే మాత్రం అది బీసీ వర్గానికి చెందిన నేతకే దక్కుతుందని భావిస్తున్నారు.

రేసులో నిలిచిన ఆ నలుగురు వీళ్లే

కేంద్ర కేబినెట్ రేసులో తెలంగాణ నుంచి ప్రధానంగా నలుగురు నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

ఈటల రాజేందర్.. గతంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందని ఆశించినా చివరి నిమిషంలో సమీకరణాలు మారాయి. ఆ సమయంలోనే అధిష్టానం పెద్దలు ఆయనకు కేంద్ర కేబినెట్‌లో తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో ఈసారి విస్తరణలో ఈటలకు పదవి ఖాయమనే ధీమాతో ఆయన వర్గం ఉంది.

డీకే అరుణ..మహబూబ్‌నగర్ ఎంపీగా విజయం సాధించిన డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని ఎన్నికల సమయంలోనే హామీ లభించినట్లు సమాచారం. అటు జాతీయ రాజకీయాల్లో ఉన్న అనుభవం, ఇటు మహిళా కోటా సమీకరణాలు తనకు అనుకూలంగా మారుతాయని ఆమె భావిస్తున్నారు.

గోడం నగేశ్.. ఆదిలాబాద్ నుంచి ఎన్నికైన ఏకైక ఆదివాసీ ఎంపీ కావడంతో, గిరిజన సామాజిక వర్గ కోటాలో తనకు మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం లభిస్తుందనే నమ్మకంతో నగేశ్ ఉన్నారు.

ధర్మపురి అర్వింద్.. నిజామాబాద్ ఎంపీగా రెండోసారి పట్టు నిలుపుకున్న అర్వింద్, బీసీ సామాజిక వర్గం తరఫున కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు.

మరోవైపు, ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా ఉన్న జి. కిషన్ రెడ్డి చుట్టూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈసారి మంత్రుల శాఖల మార్పు ఖాయంగా కనిపిస్తుండటంతో ఆయనకు మరింత ప్రాధాన్యత ఉన్న శాఖను కట్టబెట్టే అవకాశం ఉందని ఒక వర్గం అంటుంటే.. దక్షిణాదిలో పార్టీని మరింత బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా ఆయనను కేబినెట్ నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.

ఆయనకు జాతీయ ఉపాధ్యక్షుడు లేదా జనరల్ సెక్రెటరీ పదవిని ఇచ్చి, దక్షిణాది రాష్ట్రాల పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే భారీ బాధ్యతను ఢిల్లీ పెద్దలు అప్పగించే యోచనలో ఉన్నట్లు కమలనాథుల మధ్య అంతర్గత చర్చ నడుస్తోంది. మొత్తానికి ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ రాజకీయ సమీకరణాల్లో ఎవరికి అదృష్టం వరిస్తుంది, తెలంగాణ కోటాలో కొత్తగా కేంద్ర మంత్రి పీఠాన్ని అధిరోహించే ఆ నేత ఎవరు అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.

Tags:    

Similar News