Project Glasswing: ఏఐ నుండి రక్షణకు టెక్ దిగ్గజాల వ్యూహాత్మక అడుగు
Project Glasswing: క్లాడ్ మిథోస్ ఏఐ ద్వారా సాఫ్ట్‌వేర్ లోపాలను కనిపెట్టే సరికొత్త ప్రాజెక్ట్ గ్లాస్‌వింగ్.
Project Glasswing
AI Trends : సాఫ్ట్‌వేర్ ప్రపంచంలో ఇప్పుడు ఒకటే చర్చ.. మన డిజిటల్ వ్యవస్థలు ఎంతవరకు సురక్షితం? హ్యాకర్ల కంటే ముందే ఏఐ మన బలహీనతలను కనిపెట్టేస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానంగా ప్రపంచ టెక్ దిగ్గజాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా వంటి కంపెనీలు కలిసి ప్రాజెక్ట్ గ్లాస్‌వింగ్ అనే ఒక భారీ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశాయి.
ఏమిటీ ప్రాజెక్ట్ గ్లాస్‌వింగ్?
సాధారణంగా ఏఐ మోడల్స్ కోడింగ్ రాయడానికి మాత్రమే అనుకుంటాం. కానీ, ఆంత్రోపిక్ శిక్షణ ఇచ్చిన క్లాడ్ మిథోస్ అనే కొత్త ఫ్రాంటియర్ మోడల్ ఒక భయంకరమైన వాస్తవాన్ని బయటపెట్టింది. అత్యంత తెలివైన హ్యాకర్లు కూడా కనిపెట్టలేని సాఫ్ట్‌వేర్ లోపాలను ఈ ఏఐ సెకన్లలో గుర్తిస్తోంది. ఈ శక్తి దుర్మార్గుల చేతికి చిక్కితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలవచ్చు. అందుకే, ఆ ప్రమాదాన్ని అడ్డుకోవడానికి ఈ ప్రాజెక్ట్ పుట్టింది.
సాఫ్ట్‌వేర్ లోపాల సింహస్వప్నం
ఇంకా బహిరంగంగా విడుదల కాని ఈ మిథోస్ ప్రివ్యూ మోడల్ ఇప్పటికే ఆశ్చర్యకరమైన పనులు చేస్తోంది.ప్రస్తుతం మనం వాడుతున్న ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్స్ , వెబ్ బ్రౌజర్లలోని వేలాది తీవ్రమైన భద్రతా లోపాలను ఇది అప్పుడే పట్టేసింది. సాఫ్ట్‌వేర్ లోపాలను కనిపెట్టడంలో అత్యున్నత స్థాయి మానవ నిపుణులను మినహాయిస్తే, మిగతా అందరినీ ఈ ఏఐ అధిగమించింది. ఏఐ మరింత అభివృద్ధి చెందితే, రక్షణ సంస్థల నియంత్రణ దాటిపోయే ప్రమాదం ఉంది. అందుకేముందస్తు రక్షణ ముఖ్యం అని టెక్ కంపెనీలు భావిస్తున్నాయి.
భారీ యాక్షన్ ప్లాన్
ఈ ప్రాజెక్ట్ కోసం ఆంత్రోపిక్ సంస్థ ఏకంగా రూ. 830 కోట్లు విలువైన క్రెడిట్లను కేటాయిస్తోంది. అమెజాన్, సిస్కో, క్రౌడ్‌స్ట్రైక్, జేపీ మోర్గాన్ వంటి 12 ప్రారంభ కంపెనీలు ఈ ఏఐ మోడల్‌ను ఉపయోగించి తమ భద్రతా వ్యవస్థలను పటిష్టం చేసుకుంటాయి.మరో 40కి పైగా అంతర్జాతీయ సంస్థలకు ఈ ఏఐ యాక్సెస్ ఇచ్చి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కీలక సాఫ్ట్‌వేర్ వ్యవస్థలను స్కాన్ చేస్తారు. ఓపెన్-సోర్స్ భద్రతా సంస్థలకు నేరుగా $4 మిలియన్ల విరాళాలు అందజేస్తున్నారు.
దీని ప్రభావం ఏమిటంటే?
సైబర్ రక్షకులు పైచేయి సాధించాలంటే సాంప్రదాయ పద్ధతులు సరిపోవని ఈ ప్రాజెక్ట్ చెబుతోంది. రాబోయే కొద్ది నెలల్లోనే ఏఐ మరింత శక్తివంతం కాబోతోంది. అది హ్యాకర్ల చేతిలో ఆయుధంగా మారకముందే, మన బ్యాంకింగ్, జాతీయ భద్రత, ప్రజా రవాణా వ్యవస్థలను రక్షించుకోవడానికి ప్రాజెక్ట్ గ్లాస్‌వింగ్ ఒక పునాది రాయి కానుంది.