VitalID Technology: ఇక పాస్‌వర్డ్‌ల గొడవే లేదు.. హార్ట్ బీట్, శ్వాసతోనే ఫోన్ అన్‌లాక్..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్ భయ్యో..

VitalID Technology: డిజిటల్ ప్రపంచంలో సైబర్ దాడుల భయం పెరిగిపోతున్న వేళ, వినియోగదారుల భద్రత కోసం శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు.

Update: 2026-04-03 11:12 GMT

VitalID Technology: ఇక పాస్‌వర్డ్‌ల గొడవే లేదు.. హార్ట్ బీట్, శ్వాసతోనే ఫోన్ అన్‌లాక్..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్ భయ్యో..

VitalID Technology: డిజిటల్ ప్రపంచంలో సైబర్ దాడుల భయం పెరిగిపోతున్న వేళ, వినియోగదారుల భద్రత కోసం శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. ఇకపై మీ సోషల్ మీడియా ఖాతాలు లేదా బ్యాంకింగ్ యాప్‌ల కోసం కష్టపడి పాస్‌వర్డ్‌లు గుర్తుంచుకోవాల్సిన పనిలేదు. మీ గుండె కొట్టుకునే వేగం, శ్వాస ప్రక్రియ ఆధారంగా పనిచేసే ఈ సరికొత్త విధానం భద్రతను మరో స్థాయికి తీసుకెళ్లనుంది.

VitalID Technology: సాధారణంగా మనం స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ అన్‌లాక్ చేయడానికి వేలిముద్రలు లేదా ముఖ గుర్తింపును వాడుతుంటాం. అయితే, వీటిని కూడా హ్యాక్ చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి పరిష్కారంగా న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయ పరిశోధకులు సంయుక్తంగా 'వైటల్-ఐడీ' అనే విధానాన్ని రూపొందించారు. ఇది మనిషి శరీరంలోని ఎముకల నిర్మాణం, గుండె చప్పుడు ద్వారా ఉత్పన్నమయ్యే అతి సూక్ష్మమైన ప్రకంపనలను గుర్తించి పని చేస్తుంది.

శరీర ప్రకంపనలే గుర్తింపు కార్డులు..

ప్రతి మనిషి శ్వాస తీసుకున్నప్పుడు, గుండె కొట్టుకున్నప్పుడు శరీరంలో కొన్ని సునిశితమైన కదలికలు ఏర్పడతాయి. ఈ ప్రకంపనలు మెడ భాగం నుంచి తల వరకు ప్రయాణిస్తాయి. ప్రతి వ్యక్తి ఎముకల అమరిక, కండరాల కణజాలం భిన్నంగా ఉండటం వల్ల, ఈ ప్రకంపనల నమూనా కూడా వేలిముద్రల వలె ప్రత్యేకం (యూనిక్)గా ఉంటుంది. దీనిని కాపీ చేయడం లేదా అనుకరించడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ సహజ సిద్ధమైన శారీరక సంకేతాలనే వైటల్-ఐడీ తన లాగిన్ ప్రక్రియకు ఆధారంగా చేసుకుంటుంది.

అదనపు పరికరాల అవసరం లేదు..

ఈ సాంకేతికతలో ఉన్న మరో అద్భుతమైన విషయం ఏమిటంటే, దీని కోసం వినియోగదారులు కొత్తగా ఎటువంటి హార్డ్‌వేర్ కొనాల్సిన అవసరం లేదు. ప్రస్తుత మార్కెట్లో ఉన్న వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌లు, ఇతర ధరించగలిగే పరికరాల్లో ఇప్పటికే ఉన్న సెన్సార్ల ద్వారానే ఈ ప్రకంపనలను పసిగట్టవచ్చు. ఇది పూర్తిగా సాఫ్ట్‌వేర్ ఆధారిత సాంకేతికత కావడంతో, భవిష్యత్తులో మన స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లలో కూడా సులభంగా అనుసంధానం చేయవచ్చు.

హ్యాకింగ్‌కు తావులేని భద్రత..

సుమారు 52 మందిపై పది నెలల పాటు జరిపిన పరిశోధనల్లో ఈ సాంకేతికత 95 శాతం ఖచ్చితత్వంతో పనిచేస్తుందని రుజువైంది. ఎవరైనా మీ శ్వాస తీరును నకిలీగా అనుకరించినా, మీ ఎముకల ద్వారా వచ్చే అంతర్గత ప్రకంపనలను మాత్రం ఏ రకంగానూ కాపీ చేయలేరు. ప్రస్తుతం ఈ ఆవిష్కరణకు పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేశారు. త్వరలోనే ఇది వినియోగంలోకి వస్తే, పాస్‌వర్డ్‌ల తలనొప్పి లేని సురక్షితమైన డిజిటల్ ప్రపంచాన్ని మనం చూడవచ్చు.

Tags:    

Similar News