Virtual Reality: మెటా కీలక నిర్ణయం.. ఇకపై ఆసేవలకు గుడ్‌బై.. ఎప్పటినుంచంటే?

Virtual Reality: మెటా తన మెటావర్స్ వ్యూహంలో కీలక మార్పు చేసింది. హోరైజన్ వరల్డ్స్ వీఆర్ వెర్షన్‌ను పూర్తిగా నిలిపివేస్తూ, కేవలం మొబైల్ ప్లాట్‌ఫారంపై దృష్టి పెట్టింది. భారీ నష్టాల మధ్య తీసుకున్న ఈ నిర్ణయం టెక్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. 2026 జూన్ నాటికి వీఆర్ సేవలు పూర్తిగా ముగియనున్నాయి.

Update: 2026-03-19 09:20 GMT

Virtual Reality:మెటా కీలక నిర్ణయం.. ఇకపై ఆసేవలకు గుడ్‌బై.. ఎప్పటినుంచంటే?

Virtual Reality: సోషల్ మీడియా దిగ్గజం మెటా తన వర్చువల్ రియాలిటీ ప్లాట్‌ఫారమ్ 'హోరైజన్ వరల్డ్స్' కు సంబంధించిన వీఆర్ వెర్షన్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. భారీ నష్టాలు, మారుతున్న టెక్నాలజీ ప్రాధాన్యతల దృష్ట్యా, ఈ ప్లాట్‌ఫారమ్‌ను కేవలం మొబైల్ యాప్‌గా మార్చాలని నిర్ణయించింది. ఈ మార్పు జూన్ 15, 2026 నాటికి పూర్తిస్థాయిలో అమలులోకి రానుంది.

వీఆర్ నుంచి నిష్క్రమణ..

మెటా తన అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, హోరైజన్ వరల్డ్స్ ఇకపై రెండు వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌లుగా విడిపోనుంది. మార్చి 31 నాటికి క్వెస్ట్ స్టోర్ (Quest Store) నుంచి ఈ యాప్‌ను తొలగిస్తారు. అనంతరం జూన్ 15, 2026 నుంచి వీఆర్ పరికరాలలో ఇది పూర్తిగా పనిచేయదు. మెటా సెంట్రల్, ఈవెంట్స్ అరేనా వంటి ప్రధాన ఫీచర్లు కూడా వీఆర్ లో కనుమరుగు కానున్నాయి.

భారీ నష్టాలే కారణమా?

2021లో ఫేస్‌బుక్ పేరును మెటాగా మార్చినప్పుడు, మెటావర్స్ ద్వారా ప్రపంచాన్ని మార్చేస్తామని జుకర్‌బర్గ్ ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆశించిన స్థాయిలో యూజర్లు రాకపోవడం, రియాలిటీ ల్యాబ్స్ (Reality Labs) విభాగం 2020 నుంచి సుమారు $80 బిలియన్ల నష్టాన్ని చవిచూడటంతో కంపెనీ పునరాలోచనలో పడింది. ఈ ఏడాది జనవరిలోనే ఈ విభాగం నుంచి 1,000 మంది ఉద్యోగులను తొలగించడమే కాకుండా, మూడు గేమింగ్ స్టూడియోలను కూడా మూసివేసింది.

సూపర్ నేచురల్ యాప్‌కు కూడా కోత షురూ..

కేవలం హోరైజన్ వరల్డ్స్ మాత్రమే కాదు, మెటా గతంలో $400 మిలియన్లకు కొనుగోలు చేసిన ఫిట్‌నెస్ యాప్ 'సూపర్ నేచురల్' (Supernatural)ను కూడా 'మెయింటెనెన్స్ మోడ్'లోకి మార్చింది. అంటే ఇందులో ఇకపై కొత్త కంటెంట్ రాదు. వర్చువల్ రియాలిటీ కంటే మొబైల్ వినియోగదారులే ఎక్కువగా ఉన్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ఏఐ వైపు మెటా అడుగులు..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా నడుస్తోంది. దీనికి అనుగుణంగా మెటా తన వనరులను మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ (MSL) వైపు మళ్లిస్తోంది. మనుస్ ఏఐ, ప్లే ఏఐ వంటి స్టార్టప్‌లను కొనుగోలు చేస్తూ, భవిష్యత్తులో ఏఐ ఆధారిత ఉత్పత్తులపైనే దృష్టి సారించాలని మెటా నిశ్చయించుకుంది.

Tags:    

Similar News