Vaibhav vs Sachin: సచిన్ నుంచి వైభవ్ వరకు.. ఇద్దరి అరంగేట్రాల మధ్య ఎన్నో తేడాలు.. ఎవరు గ్రేట్!
Vaibhav vs Sachin: భారత క్రికెట్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు.
Vaibhav vs Sachin: సచిన్ నుంచి వైభవ్ వరకు.. ఇద్దరి అరంగేట్రాల మధ్య ఎన్నో తేడాలు.. ఎవరు గ్రేట్!
Vaibhav vs Sachin: భారత క్రికెట్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 15 సంవత్సరాల 99 రోజుల వయసులో భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు. దాంతో 37 ఏళ్లుగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యంత పిన్న వయసులో భారత తరఫున అరంగేట్రం చేసిన ఆటగాడి రికార్డును బద్దలు కొట్టాడు. అయితే సచిన్, వైభవ్ అరంగేట్రాల మధ్య కాలం, పరిస్థితులు, ఆటతీరు, సాంకేతికత పరంగా ఎన్నో విభిన్నతలు ఉన్నాయి.
అప్పుడు బ్యాటింగ్ అంటే ఓపిక, క్రమశిక్షణ:
1989లో కేవలం 16 సంవత్సరాల 205 రోజుల వయసులో సచిన్ టెండూల్కర్ పాకిస్థాన్‌పై టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆ రోజుల్లో బ్యాటింగ్ అంటే ఓపిక, క్రమశిక్షణ, బలమైన రక్షణాత్మక ఆటకు ప్రాధాన్యం ఉండేది. ముంబై క్రికెట్ సంప్రదాయానికి తగ్గట్టుగా సచిన్ తన టెక్నిక్, కవర్ డ్రైవ్‌లు, సహనంతో ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు. మరోవైపు వైభవ్ సూర్యవంశీ మాత్రం టీ20 తరం ఆటగాడు. దూకుడే అతడి బలం. బౌలర్లపై ఎదురుదాడి చేయడం, భారీ షాట్లు ఆడడం అతడి సహజ శైలి. అందుకే అతడి అంతర్జాతీయ అరంగేట్రం కూడా టీ20 ఫార్మాట్‌లోనే జరిగింది.
టెలివిజన్ ప్రసారాలు చాలా పరిమితం:
సచిన్ అరంగేట్రం జరిగినప్పుడు టెలివిజన్ ప్రసారాలు కూడా చాలా పరిమితంగా ఉండేవి. 1989లో కరాచీలో జరిగిన ఆ మ్యాచ్‌ను చాలామంది బ్లాక్ అండ్ వైట్ టీవీ ప్రసారాల ద్వారానే వీక్షించారు. కానీ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం పూర్తిగా భిన్నమైన ప్రపంచంలో జరిగింది. 4K కెమెరాలు, సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు అతడి ప్రతి కదలికను ప్రపంచానికి ప్రత్యక్షంగా చూపించాయి. దాంతో భారత జట్టులో చోటు దక్కిన నాటి నుంచే అతడు సోషల్ మీడియాలో భారీ చర్చకు కేంద్రబిందువుగా మారిపోయాడు.
ప్రపంచ పరిస్థితులు పూర్తి భిన్నం:
సచిన్ అరంగేట్రం చేసిన సమయంలో ప్రపంచ పరిస్థితులు కూడా పూర్తిగా భిన్నంగా ఉండేవి. అప్పటికి బెర్లిన్ గోడ ఇంకా కూలలేదు. సోవియట్ యూనియన్ ఉనికిలోనే ఉంది. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ఇంకా ప్రారంభం కాలేదు. కంప్యూటర్లలో ఫ్లాపీ డిస్క్‌ల యుగం నడుస్తోంది. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కృత్రిమ మేధస్సు, సోషల్ మీడియా, డిజిటల్ టెక్నాలజీ ఆధిపత్యం ఉన్న కాలంలో తన కెరీర్‌ను ప్రారంభిస్తున్నాడు. అయితే కాలం మారినా.. భారత క్రికెట్‌పై అభిమానుల ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
ఏ యువ ఆటగాడిపై అంచనాలు లేవు:
సచిన్ టెండూల్కర్ అరంగేట్రం తర్వాత భారత క్రికెట్‌లో ఏ యువ ఆటగాడిపై కూడా ఇంతటి అంచనాలు లేవు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ విషయంలో అది స్పష్టంగా కనిపిస్తోంది. ఇంగ్లండ్ చేరుకున్నప్పటి నుంచే అభిమానులు అతడితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. అతడి చుట్టూ ఉన్న వారితో కూడా ఫొటోలు తీసుకుంటున్నంత క్రేజ్ వైభవ్‌కు ఏర్పడింది. సోషల్ మీడియా యుగంలో ప్రతి అభిమాని ఒక డిజిటల్ రిపోర్టర్‌గా మారిపోవడంతో వైభవ్ చేసే ప్రతి చిన్న పని కూడా వైరల్ అవుతోంది.
వారసత్వాన్ని కొనసాగించే ప్లేయర్:
సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్‌కు ఒక కొత్త శకానికి నాంది పలికాడు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఆ వారసత్వాన్ని కొనసాగించే కొత్త తరం ప్రతినిధిగా కనిపిస్తున్నాడు. సచిన్ భారత క్రికెట్ ఎదుగుదలకు కారణమైతే.. వైభవ్ ఆ విజయగాథకు కొనసాగింపుగా నిలుస్తాడనే అంచనాలు ఉన్నాయి. అరంగేట్ర మ్యాచ్‌లో పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయినా అతడి ప్రతిభ, నిర్భయమైన ఆటతీరు భారత క్రికెట్‌కు మరో భవిష్యత్ సూపర్ స్టార్ దొరికాడనే ఆశలను మరింత బలపరిచాయి. ఇద్దరిలో ఎవరు గ్రేట్ అంటే.. సచిన్ అని టక్కున చెప్పేయొచ్చు. సచిన్ క్రికెట్ దిగ్గజంగా ఎదిగిన తీరు అమోఘం. వైభవ్ ఇప్పుడే అరంగేట్రం చేశాడు.