Ishan Kishan: ఆ రెండు బంతులే మా కొంప ముంచాయి.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న ఇషాన్ కిషన్!

Ishan Kishan: టీమిండియా ప్రదర్శనపై స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ స్పందిస్తూ.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్నాడు.

Update: 2026-07-05 09:12 GMT

Ishan Kishan: ఆ రెండు బంతులే మా కొంప ముంచాయి.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న ఇషాన్ కిషన్!

Ishan Kishan: శనివారం ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. టీమిండియా ప్రదర్శనపై స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ స్పందిస్తూ.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్నాడు. రెండు ఫ్రీ హిట్స్ మ్యాచ్‌లో తేడాను తీసుకొచ్చిందని తెలిపాడు. మిడిల్ ఓవర్లలో పరుగుల వేగం తగ్గిపోవడం కూడా మరో కారణం అని చెప్పాడు.

ఇంగ్లండ్ పరిస్థితులకు మరింత త్వరగా అలవాటు పడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. మరో 20 పరుగులు అదనంగా చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని ఇషాన్ అభిప్రాయపడ్డాడు. సిరీస్ తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో ఓటమితో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో వెనుకబడింది.

మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఇషాన్ కిషన్.. 'ఇంగ్లండ్ బౌలర్లకు తమ స్వదేశ పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. ఏ బౌలర్‌ను ఎప్పుడు ఉపయోగించాలో, ఎక్కడ బంతి వేయాలో వారికి స్పష్టంగా తెలుసు. మేము ఆ విషయంలో వెనకపడిపోయాం. అయితే మేమూ నేర్చుకుంటున్నాం. వారు మాపై ఎలా ప్రణాళికలు అమలు చేస్తున్నారో అర్థం చేసుకుని, జట్టుగా ఎక్కడ అదనంగా 20 పరుగులు సాధించవచ్చో విశ్లేషించుకుంటాం. బౌండరీల ద్వారా కావచ్చు, గ్యాప్‌లను ఉపయోగించడం ద్వారా కావచ్చు.. ఆ అదనపు పరుగులు ఎలా సాధించాలన్న దానిపై చర్చించి మరింత మెరుగవుతాం' అని చెప్పాడు.

భారత్ బ్యాటింగ్‌లో పవర్‌ప్లేలో 65/2తో బలమైన ఆరంభం లభించినప్పటికీ.. మిడిల్ ఓవర్లలో పరుగుల వేగం పూర్తిగా తగ్గిపోయింది. 7 నుంచి 10 ఓవర్ల మధ్య కేవలం 32 పరుగులు మాత్రమే చేయగా.. 14 నుంచి 17 ఓవర్ల మధ్య కూడా 23 పరుగులే వచ్చాయి. చివర్లో తిలక్ వర్మ వేగంగా ఆడటంతో భారత్ 190/7 స్కోరు చేయగలిగింది. అయితే ఆ స్కోరు కూడా విజయానికి సరిపోలేదు. మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్‌పై కూడా ఇషాన్ స్పందించాడు.

'16వ ఓవర్ ముందు వరకు మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. కానీ వరుస నోబాల్స్ కారణంగా వచ్చిన ఫ్రీ హిట్స్ జేకబ్ బెతెల్‌పై ఉన్న ఒత్తిడిని పూర్తిగా తగ్గించేశాయి. రెండు బంతుల్లో 12 పరుగులు రావడం టీ20ల్లో చాలా పెద్ద తేడా తీసుకొస్తుంది. మా బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారు. అయినా బెతెల్‌కు పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. అతడు ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నిర్మించుకున్నాడు. ఎవరిపై దాడి చేయాలో, ఎప్పుడు వేగం పెంచాలో బాగా అర్థం చేసుకున్నాడు' అని ప్రశంసించాడు.

ఇటీవల వరుస ఓటములపై కూడా ఇషాన్ కిషన్ స్పందించాడు. 'గెలవకపోతే మానసికంగా ప్రభావం ఉంటుంది. కానీ మా జట్టులో ఉన్న ఆటగాళ్లంతా అనుభవజ్ఞులే. మేము మంచి క్రికెట్ ఆడుతున్నామని నమ్ముతున్నాం. ప్రతి మ్యాచ్ తర్వాత ఎక్కడ మెరుగుపడాలో విశ్లేషించుకుని జట్టుగా ముందుకు సాగుతున్నాం. కలిసి నేర్చుకుంటూ మరింత బలంగా తిరిగి వస్తాం' అని ధీమా వ్యక్తం చేశాడు.

ఇటీవల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రపంచ నంబర్-1 బ్యాటర్‌గా అవతరించిన ఇషాన్ కిషన్.. వ్యక్తిగత విజయాల కంటే నిరంతర అభివృద్ధిపైనే తన దృష్టి ఉంటుందని చెప్పాడు. 'ప్రతి రోజు మెరుగైన ఆటగాడిగా మారడమే నా లక్ష్యం. ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించను. దేశం కోసం ఆడే అవకాశం వచ్చినప్పుడు జట్టు విజయానికి ఎలా ఉపయోగపడాలనే దానిపైనే దృష్టి పెడతాను. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది' అని పేర్కొన్నాడు.

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై కూడా ఇషాన్ కిషన్ ప్రశంసలు కురిపించాడు. 'గత రెండేళ్లుగా వైభవ్ అసాధారణంగా ఆడుతున్నాడు. అతడిలో ఉన్న ప్రతిభ, జట్టుకు తీసుకురాగల ఎక్స్-ఫ్యాక్టర్ స్పష్టంగా కనిపిస్తాయి. సీనియర్ ఆటగాళ్లుగా అతడికి అండగా నిలవడం మా బాధ్యత. ఎలాంటి అనవసర ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి. ఈ వయసులో అతడు సాధించిన విజయాలు అసాధారణం. అతడి ప్రయాణంలో మేమంతా పూర్తి మద్దతుగా ఉంటాం' అని ఇషాన్ తెలిపాడు.

Tags:    

Similar News