Vaibhav Sooryavanshi: ‘A’ సింబల్ సెలబ్రేషన్ వెనుక అసలు సీక్రెట్ ఇదే.. గుండెలు పిండేసిన వైభవ్!
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు.
Vaibhav Sooryavanshi: ‘A’ సింబల్ సెలబ్రేషన్ వెనుక అసలు సీక్రెట్ ఇదే.. గుండెలు పిండేసిన వైభవ్!
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. మంగళవారం జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌పై కేవలం 38 బంతుల్లో 93 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ తన బ్యాటింగ్‌తోనే కాదు.. ప్రత్యేకమైన ‘A’ సింబల్ సెలబ్రేషన్‌తో కూడా అందరి దృష్టిని ఆకర్షించాడు. హాఫ్ సెంచరీ అనంతరం తన చేతి వేళ్లతో ‘A’ సింబల్ చూపించి సంబరాలు చేసుకున్నాడు. దీంతో ‘A’ సింబల్ సెలబ్రేషన్ వెనుక అసలు సీక్రెట్ ఏంటో అని అభిమానులు తెగ సెర్చ్ చేశారు. మ్యాచ్ అనంతరం ఈ సెలబ్రేషన్ వెనుక అసలు కారణాన్ని వైభవ్ వెల్లడించాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో వైభవ్ సూర్యవంశీ తన సెలబ్రేషన్ గురించి మాట్లాడాడు. ‘ఈ సెలబ్రేషన్‌ను నేను మా అమ్మకు అంకితం చేశాను. ఆమె పేరు “A” అక్షరంతో ప్రారంభమవుతుంది. అందుకే నేను ఆ సెలబ్రేషన్ చేశాను. కానీ ఈ విషయాన్ని అందరికీ చెప్పాలని అనుకోలేదు. చివరకు చెప్పక తప్పలేదు’ అని వైభవ్ తెలిపాడు. వైభవ్ తల్లి పేరు ఆర్తి సూర్యవంశీ. తన తల్లి పట్ల గౌరవం, ప్రేమతోనే ఈ ప్రత్యేక సెలబ్రేషన్ చేశానని చెప్పాడు.
ఇది వ్యక్తిగత విషయమా? అని అడగగా వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘దాన్ని పెద్ద వ్యక్తిగత విషయం అనలేను. కానీ అందరికీ చెప్పి పెద్ద విషయం చేయాలని అనుకోలేదు. ఎందుకంటే నేను ఈ సెలబ్రేషన్‌ను ఇంకా కొనసాగించాలని భావిస్తున్నాను. కానీ అవును.. అది మా అమ్మ కోసమే చేశాను’ అని చెప్పుకొచ్చాడు. చిన్న వయసులోనే వైభవ్ చూపించిన ఈ భావోద్వేగం అభిమానుల గుండెలను పిండేస్తోంది.
ఇదే సెలబ్రేషన్ గురించి మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్ సమయంలో కామెంటేటర్ మురళీ కార్తిక్ ప్రశ్నించగా.. వైభవ్ మొదట్లో సరదాగా సమాధానం ఇచ్చాడు. ‘ప్రతి మ్యాచ్‌లో కొత్తగా ఏదో ఒకటి చేస్తుంటాను. ముందుగా ప్లాన్ చేసుకోను. దీనికి ప్రత్యేక అర్థం ఏమీ లేదు. గత మ్యాచ్‌లో చేసిన సెలబ్రేషన్‌కు కూడా అర్థం లేదు. కొత్తగా ఏదైనా ట్రై చేస్తుంటాను అంతే’ అని తెలిపాడు. అయితే తర్వాత అసలు విషయాన్ని బయటపెట్టడంతో సోషల్ మీడియాలో వైభవ్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
లక్నోతో మ్యాచ్‌లో 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసే సమయంలో వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడాడు. ఆ సమయంలో యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడి రాజస్థాన్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. జైస్వాల్ లక్నో బౌలర్లపై ఎదురుదాడి చేయడంతో.. వైభవ్‌కు క్రీజులో సెట్ అయ్యే సమయం లభించింది. ఒకసారి కుదురుకున్న తర్వాత వైభవ్ పూర్తిగా గేర్ మార్చి.. బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారీ సిక్సర్లు, అద్భుత షాట్లతో మ్యాచ్‌ను రాజస్థాన్ వైపు తిప్పేశాడు. వైభవ్ 38 బంతుల్లో 93 పరుగులు చేయగా.. ధ్రువ్ జురెల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ కేవలం 19.1 ఓవర్లలోనే 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ప్లేఆఫ్స్ ఆశలను మరింత బలపరుచుకుంది.