Shami - BCCI: మహ్మద్ షమీని ఎందుకు ఎంపిక చేయలేదో చెప్పిన బీసీసీఐ!

Shami - BCCI: భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి మరోసారి జాతీయ జట్టులో చోటు దక్కలేదు.

Update: 2026-05-19 14:25 GMT

Shami - BCCI: మహ్మద్ షమీని ఎందుకు ఎంపిక చేయలేదో చెప్పిన బీసీసీఐ!

Shami - BCCI: భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి మరోసారి జాతీయ జట్టులో చోటు దక్కలేదు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌తో పాటు మూడు వన్డేల సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈరోజు ప్రకటించిన జట్లలో షమీ పేరు లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. గత ఏడాది మోకాలి గాయం నుంచి కోలుకుని దేశీయ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ.. 35 ఏళ్ల షమీకి మళ్లీ బీసీసీఐ సెలెక్టర్ల నుంచి పిలుపు రాలేదు. చివరిసారిగా 2025 మార్చిలో భారత్ తరఫున వన్డే మ్యాచ్ ఆడిన షమీ.. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో ఆడుతూ ఫామ్, ఫిట్‌నెస్‌ను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

ప్రస్తుతం ఐపీఎల్‌లో మహ్మద్ షమీ పర్వాలేదనిపిస్తునాడు. 12 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ రేట్ 8.81 ఉన్నప్పటికీ.. అతడి ప్రభావం కేవలం గణాంకాలకే పరిమితం కాదు. ఒత్తిడి సమయంలో కీలక వికెట్లు తీయడం, పవర్‌ప్లేలో ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి సృష్టించడం వంటి అంశాల్లో షమీ సిద్ధహస్తుడు. అయినప్పటికీ ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు అతడిని పరిగణనలోకి తీసుకోలేదు.

దీనిపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వివరణ ఇచ్చాడు. భారత జట్టు ఎంపిక అనంతరం మాట్లాడిన అగార్కర్.. ‘షమీ టీ20 క్రికెట్ ఆడటానికే సిద్ధంగా ఉన్నాడని మాకు సమాచారం వచ్చింది. అందుకే ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌ కోసం అతడి ఎంపికపై ఎలాంటి చర్చ జరగలేదు’ అని స్పష్టం చేశాడు. షమీ స్థానంలో జమ్మూ కశ్మీర్‌కు చెందిన యువ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అకీబ్ నబీ పేరును సెలక్షన్ కమిటీ పరిశీలించినట్లు వెల్లడించాడు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడంపైనా బీసీసీఐ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఇక టెస్టు జట్టులో మరో కీలక మార్పు కూడా చోటుచేసుకుంది. రిషభ్ పంత్ స్థానంలో కేఎల్ రాహుల్‌ను టెస్టు వైస్ కెప్టెన్‌గా నియమించారు. అయితే పంత్‌కు జట్టులో స్థానం మాత్రం అలానే ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగం కాకపోయినా.. ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న ఈ టెస్టు భారత్‌కు కీలకంగా మారింది. ముఖ్యంగా స్వదేశంలో స్పిన్‌కు అనుకూల పరిస్థితుల్లో భారత బ్యాటర్లు తడబడటం జట్టుకు పెద్ద సమస్యగా మారింది. గతంలో స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే భారత బ్యాటింగ్ యూనిట్ ఇప్పుడు ఇబ్బందులు పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అలాగే ఛటేశ్వర్ పుజారా తర్వాత స్థిరమైన నంబర్-3 బ్యాటర్‌ లేకపోవడం కూడా భారత జట్టుకు మరో సవాల్‌గా మారింది.

భారత టెస్ట్ జట్టు:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మనవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దుబే, ధ్రువ్ జురెల్.

Tags:    

Similar News