బ్యాటింగ్ అంటేనే బయపడుతున్నాడు.. అంతా అయిపొయింది.. తిలక్ వర్మపై సంచలన వ్యాఖ్యలు!
Tilak Varma: Kris Srikkanth slammed Tilak Varma’s poor batting form. తిలక్ వర్మ ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
బ్యాటింగ్ అంటేనే బయపడుతున్నాడు.. అంతా అయిపొయింది.. తిలక్ వర్మపై సంచలన వ్యాఖ్యలు!
Tilak Varma: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ పేలవ ప్రదర్శన చేస్తోంది. టీ20 ప్రపంచకప్ 2026 ఛాంపియన్‌గా భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అంతకుముందు ఐర్లాండ్ చేతిలో రెండు మ్యాచ్‌ల్లో ఓడి పరువు పోగొట్టుకుంది. ఇంగ్లండ్‌తో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పరాజయం పాలై సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమీక్ష సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారత జట్టు పేలవ ప్రదర్శనకు గల కారణాలను విశ్లేషించడంతో పాటు ఆటగాళ్ల ప్రదర్శనపై కూడా కోచ్, సెలెక్టర్లు చర్చించే అవకాశం ఉంది. మరోవైపు పలువురు భారత మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తిలక్ బ్యాటింగ్ అంటేనే బయపడుతున్నాడని, ఇప్పటికే అంతా అయిపొయిందని పేర్కొన్నాడు. స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ పరిస్థితి తిలక్ వర్మకు రావొద్దని ఫాన్స్ కూడా కోరుకుంటున్నారు.
తిలక్ వర్మ బ్యాటింగ్‌లో ఆత్మవిశ్వాసం కనిపించడం లేదని క్రిస్ శ్రీకాంత్ విమర్శించాడు. శ్రేయాస్ అయ్యర్ మైదానంలో లేని సమయంలో కెప్టెన్‌గా వ్యవహరించిన తిలక్.. ఎంతో ధైర్యంగా, స్వాగ్‌తో నడుచుకున్నాడని పేర్కొన్నాడు. అయితే బ్యాటింగ్‌కు వచ్చేసరికి మాత్రం పూర్తిగా భయపడుతున్నట్లు కనిపిస్తున్నాడన్నాడు.
‘తిలక్ గురించి ఇక చెప్పడానికి ఏమీ లేదు. ఇప్పుడు ప్రపంచమంతా అతడి గురించి చర్చిస్తోంది. కెప్టెన్‌గా వ్యవహరించినప్పుడు ఎంతో ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. సునీల్ గవాస్కర్ కూడా అంత స్వాగ్‌తో నడిచి ఉండడు. కానీ బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం అతడిలా ఇబ్బంది పడే బ్యాటర్ మరొకరు నాకు అస్సలు కనిపించడం లేదు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తిలక్ భయపడుతున్నట్లు కనిపిస్తున్నాడు' అని తన యూట్యూబ్ ఛానల్‌లో శ్రీకాంత్ వివరించాడు.
ఇటీవలి కాలంలో తిలక్ వర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. కీలక సమయంలో జట్టుకు అండగా నిలవాల్సిన అతడు వరుసగా విఫలమవుతుండటం టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆందోళన కలిగిస్తోంది. ఐర్లాండ్, ఇంగ్లండ్‌పై పూర్తిగా విఫలమయ్యాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో 55 పరుగులు చేశాడు. ఆపై అతడి బ్యాటింగ్ పూర్తిగా గాడి తప్పింది. ఇంగ్లండ్‌తో ఈరోజు జరిగే చివరి టీ20లో అవకాశం దక్కితే.. బ్యాట్‌తో విమర్శలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి తిలక్‌కు ఏర్పడింది.
ఈ మ్యాచ్‌లోనూ విఫలమైతే తర్వాత మనోడికి జట్టులో చోటు కూడా దక్కకపోవచ్చు. సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ వేదికగా ఐదవ టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న బ్రూక్ సేన.. చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు వరుస ఓటములతో ఆత్మవిశ్వాసం కోల్పోయిన భారత్.. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలనే పట్టుదలగా ఉంది.