Team India: ఒక కోచ్ అవుట్, పునరాలోచనలో మరొకరు.. లక్ష్మీపతి బాలాజీ ఎంట్రీ ఖాయమేనా?
వరుస టీ20 సిరీస్ పరాజయాలతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు అతడి సహాయక సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి పెరిగింది.
Team India Coaching Staff Shake-Up: Lakshmipathy Balaji Set for Entry
వరుస టీ20 సిరీస్ పరాజయాలతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు అతడి సహాయక సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ కోచింగ్ బృందం ప్రపంచకప్, ఆసియా కప్ అందించినా.. వరుస ఓటములతో తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముందుగా పనికూన ఐర్లాండ్ చేతిలో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో కోల్పోయిన భారత్.. ఆ తర్వాత ఇంగ్లండ్ గడ్డపై ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-4తో చేజార్చుకుంది. వరుసగా రెండు సిరీస్‌ల్లో ఒక్క విజయం కూడా సాధించకపోవడంతో జట్టు మేనేజ్‌మెంట్‌పై విమర్శలు వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో గంభీర్ కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఓ జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. గౌతమ్ గంభీర్ సహాయక కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తమ పదవుల్లో కొనసాగడంపై పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ అనంతరం వీరి కాంట్రాక్టులు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు తమ భవిష్యత్తుపై బీసీసీఐతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఏడాది పొడవునా భారత జట్టుతో కలిసి ప్రయాణించాల్సి రావడంపై టెన్ డస్కాటేకు ఇబ్బందులు ఉన్నాయట. ఇదే విషయాన్ని బీసీసీఐ బోర్డుకు అతడు తెలియజేసినట్లు సమాచారం. టెన్ డస్కాటే ఇప్పటికే ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీతో చర్చలు జరుపుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
మరోవైపు మోర్నీ మోర్కెల్ మాత్రం తన భవిష్యత్తుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇద్దరు కోచులతో సమస్యలను పరిష్కరించి కోచింగ్ స్టాఫ్‌లో కొనసాగించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలు సఫలం కాకపోతే.. ఇటీవల బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమితుడైన లక్ష్మీపతి బాలాజీని భారత జట్టుతో శ్రీలంక పర్యటనకు పంపాలని బీసీసీఐ చూస్తోందట. గంభీర్ 2024లో భారత జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో టెన్ డస్కాటే, మోర్కెల్‌ను తన సహాయక బృందంలోకి తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు వరుస పరాజయాలతో పాటు జట్టు ప్రదర్శనపై విమర్శలు పెరుగుతున్న సమయంలో వీరిద్దరి భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ తర్వాత కోచింగ్ స్టాఫ్ విషయంలో స్పష్టత వచ్చే అవకాశముంది.
మరోవైపు ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ పదవికి కూడా ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం. ఇటీవల భారత జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు పూర్తిగా పడిపోవడంపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉంది. గతంలో అభిషేక్ నాయర్‌తో పాటు టీ దిలీప్‌ను కూడా తొలగించాలని నిర్ణయించినప్పటికీ.. చివరి సమయంలో దిలీప్‌కు మరో అవకాశం దక్కింది. అయితే ప్రస్తుతం జట్టు ఫీల్డింగ్‌లో మెరుగుపడకపోవడంతో ఈసారి అతడిపై వేటు పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా కోచింగ్ స్టాఫ్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. టెన్ డస్కాటే, మోర్కెల్ కొనసాగుతారా?.. ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్‌పై బీసీసీఐ వేటు వేస్తుందా?.. లేక గంభీర్ సహాయక బృందంలో భారీ ప్రక్షాళన జరుగుతుందా? అన్నది త్వరలోనే తేలనుంది.