Team India Coach: ఇంగ్లండ్ గడ్డపై టీ20, వన్డే సిరీస్ ఓటమి.. టీమిండియా కోచ్ రాజీనామా!
Team India assistant coach Ryan ten Doeschate Resigns. భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.
Team India Coach: ఇంగ్లండ్ గడ్డపై టీ20, వన్డే సిరీస్ ఓటమి.. టీమిండియా కోచ్ రాజీనామా!
Team India Coach: ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో వరుస సిరీస్ పరాజయాల అనంతరం భారీ మార్పులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్దమైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. చివరకు అదే నిజమైందని సమాచారం. టెన్ డస్కాటే తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. యూకేలోనే బీసీసీఐకి తన నిర్ణయాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కోచింగ్ బృందంలో అతడు చేరనున్నాడట.
ర్యాన్ టెన్ డస్కాటే బీసీసీఐతో చేసుకున్న ఒప్పందం 2024 జులై నుంచి 2026 వరకు ఉంది. ఇటీవలే ఆ కాంట్రాక్ట్ ముగిసింది. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం అనంతరం రాహుల్ ద్రవిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పుడు ఆయనకు అత్యంత సన్నిహితుడు టెన్ డస్కాటేను సహాయక కోచ్‌గా నియమించారు. బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ భారత జట్టు కోచింగ్ బృందంలో ముఖ్య పాత్ర పోషించాడు. టెన్ డస్కాటే పదవీకాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్ మంచి విజయాలు సాధించింది. 2025 ఆసియా కప్‌ను కైవసం చేసుకోవడంతో పాటు 2026 ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది.
అయితే టెన్ డస్కాటే పదవీకాలంలో టెస్టు క్రికెట్‌లో మాత్రం భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కోల్పోవడంతో పాటు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో, దక్షిణాఫ్రికా చేతిలో 2-0తో సిరీస్‌లను చేజార్చుకుంది. దాంతో టెన్ డస్కాటే పని తీరుపై బీసీసీఐ అసంతృప్తితో ఉంది. అతడి పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించేందుకు ఆసక్తి చూపలేదట. అందుకే టెన్ డస్కాటే స్వయంగా తన రాజీనామాను బీసీసీఐకి అందజేశాడట. ఈ విషయాన్ని బీసీసీఐ త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ర్యాన్ టెన్ డస్కాటేకు ఎంతో కాలంగా మంచి అనుబంధం ఉంది. ఆటగాడిగా 2012, 2014లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన కేకేఆర్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2022లో ఫీల్డింగ్ కోచ్‌గా మళ్లీ ఫ్రాంచైజీలో చేరాడు. 2024 వరకు కోచింగ్ బృందంలో కొనసాగి.. హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్, మెంటర్ గౌతమ్ గంభీర్‌తో కలిసి మరో ఐపీఎల్ టైటిల్ విజయంలో భాగమయ్యాడు. ఇప్పుడు కేకేఆర్‌కు తిరిగి వెళ్లడం ద్వారా టెన్ డస్కాటే మరోసారి అభిషేక్ నాయర్‌తో కలిసి పనిచేయనున్నారు. గతంలో కేకేఆర్‌లో ఇద్దరికీ సహాయక కోచ్‌లుగా పనిచేసిన అనుభవం ఉంది. అనంతరం గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలోని భారత జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కూడా ఇద్దరూ కలిసి సేవలందించారు.