Shubman Gill: ఇక సాయి సుదర్శన్ బ్యాట్, చేతికి టేప్ వేస్తా.. జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Shubman Gill about Sai Sudharsan’s hand tape. సాయి సుదర్శన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్‌గా అవుట్ కావడంపై శుభ్‌మన్ గిల్ సరదాగా స్పందించాడు.
Shubman Gill: ఇక సాయి సుదర్శన్ బ్యాట్, చేతికి టేప్ వేస్తా.. జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Shubman Gill: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) అద్భుత విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) నిర్ధేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 18.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (104; 53 బంతుల్లో 15×4, 3×6) అద్భుత సెంచరీతో జీటీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సాయి సుదర్శన్ (58; 32 బంతుల్లో 8×4, 1×6) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ విజయంతో గుజరాత్ ఐపీఎల్ 2026 ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ అద్భుత విజయంపై గిల్ ఆనందం వ్యక్తం చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న గిల్.. జట్టు ప్రదర్శన, సాయి సుదర్శన్‌తో తన భాగస్వామ్యం, ఫైనల్‌పై ఉన్న అంచనాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'టాస్ సమయంలో కొంత గందరగోళం జరిగినా.. చివరికి విజయం సాధించడం సంతోషంగా ఉంది. సాయి సుదర్శన్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా బాగుంటుంది. మేమిద్దరం ఒకరి ఆటను మరొకరం బాగా అర్థం చేసుకుంటాం. మైదానంలో మా మధ్య కమ్యూనికేషన్ అద్భుతంగా ఉంటుంది. ఏ బౌలర్‌పై ఎవరు దాడి చేయాలో మేము ముందే నిర్ణయించుకుంటాం. అదే మా విజయ రహస్యం' అని శుభ్‌మన్ గిల్ చెప్పాడు. ఈ సీజన్ మొత్తం గిల్-సుదర్శన్ జోడీ గుజరాత్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
సాయి సుదర్శన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్‌గా అవుట్ కావడంపై గిల్ సరదాగా స్పందించాడు. 'ఇలాంటి అవుట్‌లు నేను ఎప్పుడూ చూడలేదు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఒకే విధంగా అవుట్ కావడం చాలా అరుదు. సోషల్ మీడియాలో సాయి చేతికి టేప్ కట్టుకున్న వీడియో చూశాను. వచ్చే మ్యాచ్‌లో నేనూ అలాగే చేయాల్సి వస్తుందేమో' అంటూ నవ్వులు పూయించాడు. తన బ్యాటింగ్ గురించి గిల్ మాట్లాడుతూ.. 'నాకు బంతిని బలంగా కొట్టాలనే ఆలోచన లేదు. గ్యాప్‌లు ఎక్కడున్నాయో, బౌలర్లు ఎక్కడ బంతి వేస్తున్నారో మాత్రమే గమనించాను. బంతిని సరిగ్గా మిడిల్ చేయగలిగాను. బ్యాటింగ్ బాగా సాగుతున్నప్పుడు మైదానంలో ఫీల్డర్లు ఉన్నారనే భావనే ఉండదు. చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించాలని అనుకున్నా. కానీ అవుట్ అయిన తీరు మాత్రం నిరాశ కలిగించింది' అని గిల్ తెలిపాడు.
జట్టు బౌలింగ్ విభాగంపై కూడా గిల్ ప్రశంసలు కురిపించాడు. 'మాకు 6-7 బౌలింగ్ ఆప్షన్లు ఉన్నాయి. సాయి సుదర్శన్‌కు ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. మా బౌలర్లు అద్భుతంగా బంతులు వేశారు. అలాగే బ్యాటింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఫైనల్‌లో అందరూ ఒకేసారి క్లిక్ కావడమే మిగిలింది” అని అన్నాడు. అహ్మదాబాద్‌లో జరగనున్న ఫైనల్ గురించి మాట్లాడుతూ.. 'సొంత మైదానంలో ఫైనల్ ఆడటం ప్రత్యేకమైన అనుభూతి. కానీ మేము మ్యాచ్‌ను మ్యాచ్ లాగానే చూడాలి. ఫైనల్ అనే ఒత్తిడిని పక్కన పెట్టి మంచి క్రికెట్ ఆడాలని జట్టుగా నిర్ణయించుకున్నాం. ఫలితం గురించి కాకుండా ప్రక్రియపై దృష్టి పెడితే ఉత్తమ ప్రదర్శన వస్తుంది” అని గిల్ చెప్పాడు. గుజరాత్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కోనుంది. ఈ సీజన్‌లో అద్భుతంగా రాణించిన గిల్ సేన.. టైటిల్ గెలిచి మరోసారి చరిత్ర సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది.