Rishabh Pant: అనుకున్నదే అయింది.. మొత్తానికి గుడ్ బై చెప్పేసిన రిషబ్ పంత్
Rishabh Pant: ఐపీఎల్ 2026 లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రిషబ్ పంత్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు.
Rishabh Pant: అనుకున్నదే అయింది.. మొత్తానికి గుడ్ బై చెప్పేసిన రిషబ్ పంత్
Lucknow Super Giants: ఐపీఎల్ క్రికెట్ ప్రపంచంలో ఒక భారీ కుదుపు. ఈ సీజన్ ముగింపు వేళ లక్నో సూపర్ జెయింట్స్ క్యాంప్ నుంచి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. లక్నో జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుత సీజన్‌లో జట్టు ఘోర వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ పంత్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం తక్షణమే ఆమోదించింది.
ఐపీఎల్ 2026 సీజన్ లక్నో సూపర్ జెయింట్స్‌కు ఒక పీడకలలా సాగింది. టోర్నీ ఆరంభం నుంచి వరుస పరాజయాలతో సతమతమైన లక్నో, చివరకు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంతో ఈ సీజన్‌ను ముగించింది. ఈ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ, కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు రిషబ్ పంత్ యాజమాన్యానికి స్వయంగా తెలియజేశాడు. పంత్ తీసుకున్న ఈ హఠాత్ నిర్ణయాన్ని గౌరవిస్తూ, అతనిని బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.
2025 మెగా వేలంలో ఏకంగా రూ. 27 కోట్ల రికార్డు ధర వెచ్చించి లక్నో జట్టు పంత్‌ను సొంతం చేసుకుంది. అయితే ఆయన నాయకత్వంలో గడిచిన రెండు సీజన్లలో లక్నో వరుసగా ఏడో స్థానం, ఆ తర్వాత ఇప్పుడు పదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రిషబ్ పంత్ కేవలం కెప్టెన్‌గానే కాకుండా, బ్యాటర్‌గా కూడా ఈ సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. మైదానంలో సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడే పంత్, ఈసారి లక్నో తరపున ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మొత్తం 14 మ్యాచ్‌లాడిన ఆయన 138.05 స్ట్రైక్ రేట్‌తో కేవలం 312 పరుగులు మాత్రమే చేయగలిగాడు. పంత్ ఫామ్ కోల్పోవడం కూడా జట్టు పరాజయాలపై తీవ్ర ప్రభావం చూపింది.
పంత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై లక్నో సూపర్ జెయింట్స్ క్రికెట్ డైరెక్టర్ టామ్ మూడీ స్పందిస్తూ స్పష్టత ఇచ్చాడు. రిషబ్ పంత్ స్వయంగా ఫ్రాంచైజీని సంప్రదించి కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని కోరాడు. ఆయన నిర్ణయాన్ని మేం గౌరవపూర్వకంగా అంగీకరించాం. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ఎవరికైనా అంత సులువు కాదు. కెప్టెన్‌గా డ్రెస్సింగ్ రూమ్‌లో రిషబ్ అందించిన సేవలకు మేం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం. ఇప్పుడు మా దృష్టి అంతా జట్టును పునర్నిర్మించి, రాబోయే సీజన్లలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే ఉంది అని టామ్ మూడీ పేర్కొన్నాడు.
రెండు సీజన్ల పాటు లక్నో జట్టును నడిపించిన పంత్ తప్పుకోవడంతో.. లక్నో తదుపరి కొత్త కెప్టెన్ ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే కొత్త కెప్టెన్ ఎవరనేది ఫ్రాంచైజీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రాబోయే సీజన్‌లో సరికొత్త వ్యూహాలతో, కొత్త లైనప్‌తో బరిలోకి దిగుతామని, త్వరలోనే కొత్త కెప్టెన్ వివరాలను వెల్లడిస్తామని యాజమాన్యం పేర్కొంది. మరి భారీ ఆశలతో రూ. 27 కోట్లు పెట్టి కొనుక్కున్న పంత్ కెప్టెన్సీకి ఎండ్ కార్డ్ పడటంతో, లక్నోను గట్టెక్కించే ఆ కొత్త లీడర్ ఎవరో చూడాలి.