Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ ఒంటరి పోరాటం.. ఒంటిచేత్తో జట్టును ఆదుకున్న టీమిండియా కెప్టెన్

Shreyas Iyer : ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 80 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.

Update: 2026-07-10 00:28 GMT

Shreyas Iyer

Shreyas Iyer : ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయినప్పటికీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అభిమానుల మనసు గెలుచుకుంది. ఈ డూ ఆర్ డై మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పిచ్‌లపై మిగతా భారత బ్యాటర్లంతా పరుగులు తీయడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతూ చేతులెత్తేసిన వేళ.. కెప్టెన్ అయ్యర్ మాత్రం మైదానంలో సింహంలా పోరాడాడు. కష్ట సమయాల్లో ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ ఎలా ఉండాలో చూపిస్తూ వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు. జట్టును ఘోర అవమానం నుంచి కాపాడి, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగుల గౌరవప్రదమైన స్కోరుకు చేర్చాడు.

బ్రిస్టల్ పిచ్‌పై ఇంగ్లాండ్ బౌలర్లు నిప్పులు చెరుగుతున్న సమయంలో శ్రేయస్ అయ్యర్ మాత్రం వేరే పిచ్‌పై ఆడుతున్నట్లుగా చాలా ఈజీగా షాట్లు బాదాడు. ఆయన కేవలం 49 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. శ్రేయస్ అయ్యర్ ఒక్కడే చేసిన పరుగులు, మిగతా భారత జట్టు మొత్తం కలిసి చేసిన పరుగుల కంటే ఎక్కువ. అయ్యర్ మినహా మిగతా బ్యాటర్లందరూ కలిసి చేసిన స్కోరు కేవలం 74 పరుగులు మాత్రమే కాగా, మరో 4 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి.

ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో శ్రేయస్ అయ్యర్ ఒకేసారి కింగ్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఒక చారిత్రాత్మక రికార్డును సమం చేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇంగ్లాండ్‌పై ఒక భారత కెప్టెన్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు ఇప్పటివరకు పూర్తిగా కోహ్లీ పేరిట మాత్రమే ఉండేది. గతంలో కోహ్లీ కూడా కెప్టెన్‌గా ఇంగ్లాండ్‌పై 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కూడా 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఈ ప్రతిష్టాత్మక రికార్డు జాబితాలో కోహ్లీ సరసన చేరాడు.

సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు మరోసారి ఇంగ్లాండ్ బౌలర్ల బౌన్స్ దాడికి ఘోరంగా మోకరిల్లారు. ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తన షార్ట్ పిచ్ బంతులతో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని (15 రన్స్) ఈ సిరీస్‌లో వరుసగా రెండోసారి అవుట్ చేసి పెవిలియన్ పంపాడు. మరో ఓపెనర్ ఈషాన్ కిషన్ (4) కూడా పవర్‌ప్లేలోనే జోష్ టంగ్ బౌలింగ్‌లో దొరికిపోయాడు. మంచి ఫామ్‌లో కనిపించిన అభిషేక్ శర్మ (16) సైతం ఆదిల్ రషీద్ వేసిన స్పిన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి నిరాశపరిచాడు.

భారీగా వికెట్లు పడుతున్న సమయంలో కెప్టెన్ అయ్యర్‌కు శివమ్ దూబే (22) కాసేపు మద్దతుగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు స్కోరును 100 దాటించారు. స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాడనే నమ్మకంతో దూబేను నెంబర్ 5 పొజిషన్‌కు ప్రమోట్ చేసినప్పటికీ, ఆయన పిచ్‌పై పరుగులు తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. చివరకు భారీ షాట్ ఆడబోయి విల్ జాక్స్ చేతికి చిక్కాడు. దూబే ఆడిన ఈ నెమ్మదైన ఇన్నింగ్స్ చూసిన అభిమానులు.. అతని కంటే వైస్ కెప్టెన్ తిలక్ వర్మ లోయర్ ఆర్డర్‌లో బెటర్ ఆప్షన్ అయి ఉండేవాడని అభిప్రాయపడ్డారు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ కూడా కేవలం 11 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.

Tags:    

Similar News