Jofra Archer: పిల్ల బచ్చల్లారా ఐపీఎల్ అనుకుంటున్నారా..? టీమిండియాకు ఆర్చర్ వార్నింగ్

ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఘోర పరాజయంపై ఇంగ్లీష్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఘాటుగా స్పందించాడు.

Update: 2026-07-09 05:29 GMT

Jofra Archer: పిల్ల బచ్చల్లారా ఐపీఎల్ అనుకుంటున్నారా..? టీమిండియాకు ఆర్చర్ వార్నింగ్

Indian Batters: క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ హాట్ టాపిక్‌గా మారింది. ఇంగ్లండ్ పర్యటనలో వరుస పరాజయాలతో తలపట్టుకున్న టీమిండియా గాయాలపై.. ఇంగ్లీష్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ తన వ్యాఖ్యలతో కారం చల్లాడు. ఇంగ్లండ్ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్ ఆడటమనేది మీ ఐపీఎల్‌లో ఆడినంత ఈజీ కాదు అంటూ ఆర్చర్ టీమిండియా బ్యాటర్లకు గట్టి క్లాస్ పీకాడు. నాటింగ్ హామ్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘనవిజయంలో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న అనంతరం ఆర్చర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

మీడియాతో మాట్లాడిన ఆర్చర్.. ఐపీఎల్ మైదానాలకు, ఇంగ్లండ్ పిచ్‌లకు ఉన్న తేడాలను ఎండగట్టాడు. భారత్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల్లో బౌండరీలు చాలా చిన్నవిగా ఉంటాయి, పిచ్‌లు కూడా పూర్తిగా బ్యాటింగ్‌కే అనుకూలిస్తాయి. అక్కడ బౌలర్లకు నరకమే. 200 పరుగులు చేసినా చేజ్ అయిపోతాయి. కానీ ఇంగ్లండ్ పిచ్‌లపై 200 రన్స్ చేయడం ఆషామాషీ కాదు. ఇక్కడ బంతి అదనపు బౌన్స్‌తో వస్తుంది. కేవలం గుడ్ లైన్ అండ్ లెంగ్త్‌తో క్రమశిక్షణగా బౌలింగ్ చేస్తేనే ఇక్కడ వికెట్లు దక్కుతాయి. సరైన ప్లాన్ లేకుండా నిర్లక్ష్యంగా ఆడితే ఇలాంటి ఘోర పరాజయాలే ఎదురవుతాయి అంటూ భారత బ్యాటింగ్ వైఫల్యాలను కడిగిపారేశాడు.

టీమిండియాపై విమర్శలు చేయడమే కాకుండా.. భారత 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి జోఫ్రా ఆర్చర్ ఓపెన్ చాలెంజ్ విసరడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ సిరీస్‌లో ఆర్చర్ వేసిన బౌలింగ్‌లో వైభవ్ కొన్ని అద్భుతమైన సిక్సర్లు బాదాడు. దీనిపై మీడియా ప్రశ్నించగా ఆర్చర్ నవ్వుతూ స్పందించాడు. వైభవ్ నా బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టిన మాట నిజమే. కానీ రాబోయే మ్యాచ్‌ల్లో అతడిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా అవుట్ చేయాలనే దానిపై నేను ఇప్పటికే ఒక పక్కా వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాను. రాబోయే మ్యాచ్‌ల్లో వైభవ్‌కు ఇదే నా సవాల్.. చూద్దాం ఏం జరుగుతుందో అంటూ గట్టి హెచ్చరికలే జారీ చేశాడు.

నాటింగ్ హామ్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 125 పరుగుల భారీ తేడాతో టీమిండియాపై విరుచుకుపడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లీష్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (70 రన్స్), ఆల్‌రౌండర్ సామ్ కరన్ (44 నాటౌట్) అద్భుతంగా రాణించారు. అనంతరం 202 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయింది. కేవలం 11.4 ఓవర్లలోనే 76 పరుగులకే చేతులెత్తేసింది.

భారత బ్యాటింగ్ లైనప్‌ను ఇంగ్లండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ ఇద్దరూ కలిసి ముక్కలు ముక్కలు చేశారు. ఆర్చర్ కేవలం 29 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టగా, మరో పేసర్ జోష్ టంగ్ 28 పరుగులకే 4 వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించాడు.

Tags:    

Similar News