Rohit Sharma: గ్రౌండ్ స్టాఫ్ సభ్యుడిని కొట్టిన రోహిత్ శర్మ!
Rohit Sharma accidentally hits a ground staff. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) ఓపెనర్ రోహిత్ శర్మ గాయంతో గత కొన్ని మ్యాచ్‌లలో ఆడలేదు.
Rohit Sharma
Rohit Sharma: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) ఓపెనర్ రోహిత్ శర్మ గాయంతో గత కొన్ని మ్యాచ్‌లలో ఆడలేదు. గత మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఆడుతాడని అనుకున్నా.. మైదానంలోకి దిగలేదు. మ్యాచ్ సమయంలో డగౌట్‌లో కూర్చుని ఉన్నాడు. ఐపీఎల్ 2026లో ముంబై ప్లేఆఫ్స్ ఆశలు సన్నగిల్లుతున్న సమయంలో రోహిత్ మళ్లీ జట్టులోకి రావడానికి నెట్స్‌లో కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో హిట్‌మ్యాన్ రోజు సాధన చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ చిన్న ప్రమాదం జరగగా.. రోహిత్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రాక్టీస్ సమయంలో రోహిత్ శర్మ కొట్టిన బంతి అనుకోకుండా గ్రౌండ్ స్టాఫ్ సభ్యుడు సిబాన్ బిశ్వాస్‌ను తాకింది. అయితే బౌలింగ్ కొనసాగించమని చెప్పినా.. హిట్‌మ్యాన్ మాత్రం వెంటనే అతని దగ్గరకు పరుగెత్తుకు వెళ్లాడు. అతని గాయాన్ని చూసి పరామర్శించాడు. తర్వాత ఐస్ ప్యాక్ తీసుకువచ్చి ఇవ్వడమే కాకుండా.. మందులు, స్ప్రే కూడా అందేలా చూసుకున్నాడు. ఈ ఘటనపై సిబాన్ బిశ్వాస్ మాట్లాడుతూ... 'నేను తాడు కడుతూ ఉండగా రోహిత్ సర్ కొట్టిన బంతి నా ఎడమ మోకాలికి తగిలింది. సర్ వెంటనే వచ్చి నా గాయం పరిస్థితిని అడిగారు. పర్లేదు సర్.. మీరు ఆటను కొనసాగించండని చెప్పా. మళ్లీ వచ్చి ఐస్ ప్యాక్ ఇచ్చారు' అని తెలిపాడు. గాయంతో బాధపడుతున్నప్పటికీ రోహిత్‌తో హ్యాండ్‌షేక్ పొందడం ఆనందంగా అనిపించిందని పేర్కొన్నాడు.
ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో నిలకడైన ప్రదర్శన ఇవ్వలేకపోతుంది. గత మూడు సీజన్లుగా జట్టు ఫామ్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2024లో చివరి స్థానంలో నిలవగా.. 2025లో క్వాలిఫయర్-2లో ఓడింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచులలో రెండు విజయాలు మాత్రమే అందుకుంది. ప్రస్తుతం 4 పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో ఉంది. మిగిలిన ఐదు మ్యాచులలో గెలిచినా.. ముంబై ప్లేఅఫ్ చేరదు. ఈ నేపథ్యంలో మాజీ న్యూజిలాండ్ క్రికెటర్ సైమన్ డౌల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'జట్టు ప్రదర్శనపై కేవలం ఆటగాళ్లు లేదా కెప్టెన్‌ను మాత్రమే నిందించడం సరైంది కాదు. గత మూడు సంవత్సరాలుగా తీసుకున్న నిర్ణయాలకు యాజమాన్యం కూడా బాధ్యత వహించాలి' అని పేర్కొన్నాడు.