IPL Girlfriend Culture: ఐపీఎల్‌లో ‘గర్ల్‌ఫ్రెండ్ కల్చర్’.. కఠిన చర్యలకు సిద్దమైన బీసీసీఐ!

BCCI plans strict rules against girlfriend culture in IPL 2026. ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా ఆటగాళ్ల వ్యక్తిగత వ్యవహారాలపై కఠినంగా వ్యవహరించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.

Update: 2026-05-04 10:20 GMT

IPL Girlfriend Culture

IPL Girlfriend Culture: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ సందర్భంగా ఆటగాళ్ల వ్యక్తిగత వ్యవహారాలపై కఠినంగా వ్యవహరించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమవుతోంది. ఐపీఎల్ 2026 సందర్భంగా ఆటగాళ్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి పబ్లిక్‌గా కనిపించడం, టీమ్ బస్సుల్లో ప్రయాణించడం, జట్టు హోటళ్లలో ఉండడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మ్యాచుల సమయంలో హార్దిక్ పాండ్య, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్‌ సింగ్‌ సహా మరికొందరు తమ స్నేహితురాళ్లతో చక్కర్లు కొట్టడంపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఐపీఎల్ కొనసాగుతున్న సమయంలో ఆటగాళ్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో తరచూ కనిపించడం బీసీసీఐ బోర్డుకు ఆందోళన కలిగిస్తోంది. ఈ ట్రెండ్ కొనసాగితే భవిష్యత్తులో పెద్ద సమస్యలు తలెత్తే అవకాశముందని భావిస్తున్న బీసీసీఐ.. ‘గర్ల్‌ఫ్రెండ్ కల్చర్’పై కఠిన నిబంధనలు తీసుకురావాలని నిర్ణయించింది. బీసీసీఐకి చెందిన ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ.. 'ఇప్పుడే నియంత్రించకపోతే పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది. కొన్ని సందర్భాల్లో టీమ్ బస్సులు గర్ల్‌ఫ్రెండ్స్ కోసం వేచి ఉండాల్సి వస్తోంది. వారు ఆటగాళ్లతో ఒకే హోటళ్లలో ఉంటున్నారు' అని తెలిపారు.

ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. కొంతమంది ప్లేయర్స్ గర్ల్‌ఫ్రెండ్స్‌ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లుగా ఉన్నారు. గతంలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు సమాచారం. దీంతో ఆటకు సంబంధించిన సున్నితమైన సమాచారం బయటకు వెళ్లే ప్రమాదం ఉందని బోర్డు భావిస్తోంది. అంతేకాకుండా గతంలో కొన్ని ఆటగాళ్లు-గర్ల్‌ఫ్రెండ్స్‌ మధ్య వివాదాలు పోలీస్ ఫిర్యాదుల వరకు వెళ్లడం కూడా బీసీసీఐ ప్రతిష్టపై ప్రభావం చూపింది. మరో విషయం ఏంటంటే.. కొన్ని యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయూ) అధికారులు ఆఫిషియల్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతో పార్ట్‌నర్లను అనుమతించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే బీసీసీఐ విధానాల్లో అలాంటి నిబంధన లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం భార్యలు, కుటుంబ సభ్యులకు మాత్రమే నిర్దిష్ట మార్గదర్శకాల ప్రకారం అనుమతి ఉందని తెలిపారు.

ఈ అంశంపై త్వరలో జరిగే సమావేశంలో బీసీసీఐ అధికారులు మాట్లాడనున్నారు. ఆపై కఠిన మార్గదర్శకాలు బీసీసీఐ జారీ చేస్తుందని సమాచారం. కేవలం ఐపీఎల్‌కే కాకుండా భారత జట్టు అంతర్జాతీయ టూర్లకు కూడా వర్తించే అవకాశం ఉంది. ఐపీఎల్ జట్లు ప్రైవేట్ అయినప్పటికీ.. అన్ని ఫ్రాంచైజీలకు ఒకే విధమైన నిబంధనలు అమలు చేయాలని బోర్డు భావిస్తోంది. మొత్తం మీద గేమ్ సమగ్రతను కాపాడేందుకు, అనవసర వివాదాలను నివారించేందుకు బీసీసీఐ తీసుకునే ఈ నిర్ణయం భవిష్యత్తులో కీలకంగా మారనుంది.

Tags:    

Similar News