IPL 2026-PBKS: టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ టోర్నీకి స్టార్ ప్లేయర్ దూరం!
IPL 2026-PBKS: టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్‌కు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా యువ సంచలనం కూపర్ కొన్నోలీ ఐపీఎల్ మధ్యలోనే స్వదేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది.
IPL 2026-PBKS: టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ టోర్నీకి స్టార్ ప్లేయర్ దూరం!
IPL 2026-PBKS: ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో జట్టు అద్భుత విజయాలు సాధిస్తూ.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ పీబీకేఎస్ గెలిచింది. వర్షం ప్రభావంతో ఒక మ్యాచ్ రద్దు కాగా.. మిగతా ఐదు మ్యాచ్‌ల్లో పంజాబ్ జట్టుకు ఎదురులేకుండా పోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సత్తాచాటుతూ.. ప్లేఆఫ్స్ దిశగా దూసుకుపోతోంది. అయితే టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది.
ఆస్ట్రేలియా యువ సంచలనం కూపర్ కొన్నోలీ ఐపీఎల్ మధ్యలోనే స్వదేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది. తన బౌలింగ్ ఫిట్‌నెస్‌ను పరీక్షించుకోవడానికి ఆస్ట్రేలియా వెళ్లినట్లు సమాచారం. కొన్నోలీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆస్ట్రేలియాలోని పర్థ్‌లో ఉన్న నార్త్ బీచ్ ఫోటోను షేర్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. దీంతో ఐపీఎల్ మధ్యలోనే భారత్ విడిచి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు అని స్పష్టం అవుతోంది. ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఐపీఎల్‌కు ముందు కొన్నోలీ వెన్నునొప్పితో బాధపడ్డాడు. అందుకే ఈ సీజన్‌లో అతను కేవలం బ్యాట్స్‌మన్‌గా మాత్రమే ఆడుతున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా సూచనల మేరకు బౌలింగ్ చేయడం లేదు. అతను మళ్లీ బౌలింగ్ చేయాలంటే ఫిట్‌నెస్ క్లియరెన్స్ అవసరం. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్ పరీక్షల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లి వెళ్లాడని తెలుస్తోంది.
కూపర్ కొన్నోలీ కేవలం ఫిట్‌నెస్ క్లియరెన్స్ కోసమే ఆస్ట్రేలియా వెళ్లడంతో.. త్వరలోనే తిరిగి పంజాబ్ కింగ్స్ జట్టుతో చేరుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు కొన్నోలీ అందుబాటులో ఉంటాడో లేదో చూడాలి. సీజన్‌లో కొన్నోలీ పంజాబ్ తరఫున మెరిశాడు. గుజరాత్ టైటాన్స్‌పై 72, లక్నో సూపర్ జెయింట్స్‌పై 87 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ వేగంగా పరుగులు చేస్తున్నాడు. మధ్య ఓవర్లలో కీలక భాగస్వామ్యాలు నిర్మిస్తున్నాడు. అతని నిలకడైన ప్రదర్శన పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సీజన్‌లో జట్టుకు ప్రధాన బలంగా మారాడు.
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ ఏ ఒక ఆటగాడిపై ఆధారపడడం లేదు. ఒక్కో మ్యాచులో ఒకరు మెరుస్తున్నారు. బౌలింగ్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ కీలక పాత్ర పోషిస్తుండగా.. బ్యాటింగ్‌లో ఓపెనర్లు ప్రభసిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య మంచి ఆరంభాలు అందిస్తున్నారు. కొత్తగా జట్టులో చేరిన ఆస్ట్రేలియా యువ ఆటగాడు కూపర్ కొన్నోలీ తన బ్యాటింగ్‌తో ఔరా అనిపిస్తున్నాడు. ఇక సర్పంచ్ సాబ్ శ్రేయాస్ అయ్యర్ అటు బ్యాటర్, ఇటు సారథిగా సక్సెస్ అవుతున్నాడు. మరో మూడు విజయాలు సాధిస్తే పంజాబ్ ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది.