IPL 2026: స‌న్‌రైజ‌ర్స్ గెలుపుతో మారిన ముఖ‌చిత్రం.. ప్లేఆఫ్ రేసులో ముందున్న జ‌ట్లు ఏవంటే.?

IPL 2026: ఐపీఎల్ 2026లో 31వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 47 పరుగుల తేడాతో గెలిచింది.

Update: 2026-04-22 07:18 GMT

IPL 2026

IPL 2026: ఐపీఎల్ 2026లో 31వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 47 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో హైదరాబాద్ జట్టు పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి చేరుకుంది. ఇది ఈ సీజన్‌లో వారి నాలుగో విజయం కాగా, వరుసగా మూడో గెలుపు కావడం విశేషం. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ తమ మూడో ఓటమిని చవిచూసి ఐదో స్థానంలో కొనసాగుతోంది.

టాప్-4 జట్ల పరిస్థితి

ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆరు మ్యాచ్‌లలో ఐదు గెలిచింది, ఒకటి రద్దు అయింది. మొత్తం 11 పాయింట్లు, మంచి నెట్ రన్‌రేట్‌తో టాప్‌లో నిలిచింది. రెండో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది. ఆరు మ్యాచ్‌లలో నాలుగు గెలిచి, రెండు ఓడిపోయి 8 పాయింట్లతో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా 7 మ్యాచ్‌లలో నాలుగు గెలిచి మూడో స్థానంలో నిలిచింది. నాలుగో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉంది. ఆరు మ్యాచ్‌లలో నాలుగు గెలిచి 8 పాయింట్లు సాధించింది. అయితే నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండటంతో నాలుగో స్థానంలో ఉంది.

5 నుంచి 10 స్థానాల వరకు పరిస్థితి

ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు సమానంగా 6 పాయింట్లు సాధించాయి. కానీ నెట్ రన్‌రేట్ ఆధారంగా ఢిల్లీ ఐదో స్థానంలో, గుజరాత్ ఆరో స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు వరుసగా ఏడో, ఎనిమిదో, తొమ్మిదో స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు జట్లు కూడా ఆరు మ్యాచ్‌లలో రెండేసి గెలిచి నాలుగు ఓడిపోయాయి.

కోల్‌క‌తా నైట్ రైడర్స్ మాత్రం పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానంలో ఉంది. ఏడు మ్యాచ్‌లలో ఐదు ఓడిపోయి, ఒకటి గెలిచి, ఒకటి రద్దు కావడంతో కేవలం 3 పాయింట్లతో కొనసాగుతోంది.

ప్లేఆఫ్ రేసులో ఎవరు ముందున్నారు?

పంజాబ్ కింగ్స్ పరిస్థితి ప్రస్తుతం చాలా బలంగా ఉంది. ఇప్పటికే 11 పాయింట్లు ఉండడంతో, మిగిలిన మ్యాచ్‌లలో మూడు గెలిస్తే ప్లేఆఫ్‌కు చేరడం దాదాపు ఖాయం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు 8 పాయింట్లు ఉన్నాయి. ఈ జట్లు కనీసం మరో నాలుగు మ్యాచ్‌లు గెలిస్తే ప్లేఆఫ్ అవకాశాలు బలంగా ఉంటాయి.

ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ప్లేఆఫ్‌లోకి రావాలంటే కనీసం ఐదు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. ముంబై, చెన్నై, లక్నో జట్లకు పరిస్థితి కాస్త కష్టంగా ఉంది. వీటికి దాదాపు మిగిలిన మ్యాచ్‌లన్నీ గెలవాల్సిన అవసరం ఉంది. కోల్‌కతా జట్టుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, మిగిలిన మ్యాచ్‌లన్నీ గెలిస్తే మాత్రమే ఆశలు నిలుస్తాయి.

Tags:    

Similar News