నేను చాలా భయపడ్డాను.. మెరుగైన ప్రదర్శన చేయలేదు.. రజత పతక విజేత నీరజ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!

Neeraj Chopra: Neeraj Chopra revealed he was scared during every throw. గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్ 2026 జావెలిన్ త్రో ఫైనల్లో రజత పతకం సాధించిన అనంతరం నీరజ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Update: 2026-08-01 09:56 GMT

నేను చాలా భయపడ్డాను.. మెరుగైన ప్రదర్శన చేయలేదు.. రజత పతక విజేత నీరజ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!

Neeraj Chopra: భారత స్టార్ జావెలిన్ త్రోయర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా మరో మెడల్ సాధించాడు. గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్ 2026 జావెలిన్ త్రో ఫైనల్లో రజత పతకం గెలిచాడు. స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన నీరజ్.. ఆఖరి దాకా గట్టిగా పోరాడినా గోల్డ్ మెడల్ దక్కలేదు. అత్యుత్తమంగా 85.83 మీటర్ల త్రో రజతం ఖాతాలో వేసుకున్నాడు. కామన్వెల్త్‌ క్రీడల్లో నీరజ్‌కు ఇది రెండో మెడల్. 2018 గోల్డ్‌కోస్ట్‌ క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచాడు. శ్రీలంక అథ్లెట్ రమేశ్‌ పతిరగె 89.75 మీటర్ల త్రోతో స్వర్ణం ఎగరేసుకుపోయాడు. భారత్‌కే చెందిన యశ్వీర్‌ సింగ్‌ (85.41) కాంస్యం దక్కించుకున్నాడు.

రజత పతకం సాధించిన అనంతరం నీరజ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దాదాపు ఏడాది పాటు గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత మళ్లీ అంతర్జాతీయ వేదికపై పతకం గెలవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు. అయితే పోటీ సమయంలో ప్రతి ప్రయత్నం చేసే ముందు తనలో భయం ఉండేదని వెల్లడించాడు. 'నా కమ్‌బ్యాక్ (పునరాగమనం) సరైన దిశలో సాగుతోంది. చల్లటి వాతావరణంలో నేను అద్భుత ప్రదర్శన చేయలేను. ఎందుకంటే నేను భారతీయుడిని కదా. అయినప్పటికీ మళ్లీ పోడియంపై నిలవడం చాలా సంతోషంగా ఉంది. గత కొన్ని నెలలుగా చేసిన కృషికి ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయి. తదుపరి పోటీల్లో ఇంకా మెరుగైన ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాను' అని నీరజ్ పేర్కొన్నాడు.

గాయాల ప్రభావం ఇప్పటికీ తనపై ఉందని నీరజ్ చోప్రా అంగీకరించాడు. '100 శాతం ఫిట్‌గా ఉంటే ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగలమనే ఆత్మవిశ్వాసం ఉంటుంది. కానీ గాయం ఉన్నప్పుడు ప్రతి ప్రయత్నం ముందు ఓ ఆలోచన వస్తుంది. నేను బాగా అడగలనా అని మనసులో మెదులుతుంటుంది. నిజం చెప్పాలంటే ఈరోజు కూడా నేను చాలా భయపడ్డాను. ఎక్కువ వేగంగా పరుగెత్తకుండా శరీరాన్ని నియంత్రణలో ఉంచాలనుకున్నాను. అయినప్పటికీ నా త్రో బాగానే వచ్చింది. కానీ ఇంకా మెరుగ్గా ఈటెను వేయాల్సింది' అని నీరజ్ చెప్పుకొచ్చాడు.

గ్లాస్గోలోని చల్లటి వాతావరణం అందరు అథ్లెట్లకూ సవాలుగా మారిందని నీరజ్ చోప్రా తెలిపాడు. 'ఈరోజు నేను కూడా ఒక్క మంచి త్రో మాత్రమే వేశాను. మిగతా ప్రయత్నాల్లో ఈటెను ఇంకా మెరుగ్గా వేయాల్సింది. కానీ ఈటె ఆశించినంత దూరం వెళ్లలేదు. విజేత రుమేశ్ తరంగ పతిరాగే కూడా ఒక్క అద్భుతమైన త్రోతోనే స్వర్ణ పతకం గెలిచాడు. ఇలాంటి పోటీల్లో ఒక్క మంచి ప్రయత్నం చాలు. ఈరోజు నేను అది చేయలేకపోయాను, స్వర్ణం మిస్ అయినందుకు బాధగా ఉన్నా.. చాలా రోజుల తర్వాత పతకం గెలవడం సంతోషమే' అని నీరజ్ చెప్పాడు.

తన లక్ష్యం కేవలం పతకాలు గెలవడమే కాదని, ప్రతి పోటీలో తన ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకోవడమేనని నీరజ్ చోప్రా స్పష్టం చేశాడు. 'ఈ సీజన్‌లో ఇంకా చాలా మెరుగుపడే అవకాశం ఉంది. రాబోయే పోటీల్లో మరింత మంచి త్రోలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను' అని తెలిపాడు. భారత్‌కు పతకాలు అందించిన అథ్లెట్లకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. నీరజ్‌, యశ్వీర్‌ను ఆయన అభినందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

Tags:    

Similar News