రూల్స్ బ్రేక్ చేసిన టీమిండియా ప్లేయర్ ..పాక్ ప్లేయర్‌కు హగ్‌తోపాటు షేక్‌హ్యాండ్..!

Jemimah Rodrigues: 'ది హండ్రెడ్ 2026' లీగ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాను భారత క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ఆప్యాయంగా కౌగిలించుకోవడం సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది.

Update: 2026-08-01 03:44 GMT

రూల్స్ బ్రేక్ చేసిన టీమిండియా ప్లేయర్ ..పాక్ ప్లేయర్‌కు హగ్‌తోపాటు షేక్‌హ్యాండ్..!

Jemimah Rodrigues: మైదానంలో ఎంతటి ప్రత్యర్థులైనా ఆట పూర్తయ్యాక పలకరించుకోవడం క్రీడాస్ఫూర్తి. కానీ, భారత్-పాకిస్తాన్ సంబంధాల విషయానికి వస్తే పరిస్థితి కేవలం క్రీడలకే పరిమితం కాదు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, దేశభక్తి సెంటిమెంట్ల మధ్య క్రీడాకారుల ప్రతి చిన్న ప్రవర్తన కూడా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. తాజాగా ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ 2026 లీగ్‌లో భారత స్టార్ మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ప్రవర్తన ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.

సౌతాంప్టన్ వేదికగా సదరన్ బ్రేవ్స్, బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా మ్యాచ్ ముగిసింది. మ్యాచ్ పూర్తయిన తర్వాత బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ తరఫున ఆడుతున్న భారత స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్, ప్రత్యర్థి జట్టులోని పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాను ఆప్యాయంగా పలకరించడమే కాకుండా, కరచాలనం చేస్తూ హగ్ చేసుకుంది. ఈ దృశ్యాలు క్యామెరాలో రికార్డై క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానుల నుంచి, నెటిజన్ల నుంచి భిన్నమైన రీతిలో తీవ్ర ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి.

2025 ఏప్రిల్‌లో జరిగిన దారుణమైన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలు మరింత క్షీణించాయి. భారత సైనికుల త్యాగాలకు గౌరవంగా, దేశ రక్షణ దళాలకు మద్దతుగా భారత జట్లు పాక్ ఆటగాళ్లతో కరచాలనం కూడా చేయకూడదనే ఒక అప్రకటిత నియమాన్ని పాటిస్తూ వస్తున్నారు. నాటి భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టాస్ సమయంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగాకు షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించి తన నిరసన తెలపడం సంచలనం సృష్టించింది.

భారత మహిళల కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా పాక్ కెప్టెన్ ఫాతిమా సనాతో కరచాలనం చేయకుండా దూరంగా ఉంది. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత జట్టు యాజమాన్యం ఈ విధానాన్ని స్పష్టంగా పాటిస్తోంది. అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ ముగిశాక షేక్‌హ్యాండ్ ఇవ్వడం లేదా పలకరించుకోవడం మాండేటరీ ఏమీ కాదు.

జెమీమా ప్రవర్తనపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి వాదనలు వినిపిస్తున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, సైనికుల త్యాగాలను మర్చిపోయి ఇలా ప్రవర్తించడం ఏంటి? ఇది విదేశీ లీగ్ అయినప్పటికీ దేశ సెంటిమెంట్ అందరికంటే ముఖ్యం. ఏ లీగ్ కూడా దేశం కంటే ఎక్కువ కాదు అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది బీసీసీఐ లేదా భారత జాతీయ జట్టు ఆడుతున్న మ్యాచ్ కాదు. విదేశీ ఫ్రాంచైజ్ లీగ్‌లలో క్రీడాకారులు వ్యక్తిగత సామర్థ్యంతో ఆడుతుంటారు. క్రీడల్లో ద్వేషాన్ని, రాజకీయాన్ని జొప్పించడం సరికాదు" అని క్రీడాస్ఫూర్తిని సమర్థిస్తున్నారు.

క్రీడలు దేశాల మధ్య మైత్రిని పెంచే మాధ్యమమే అయినప్పటికీ, జాతీయ భావాలు, సరిహద్దు పరిస్థితులు అత్యంత సున్నితమైనవి. ఐసీసీ నియమాలను అతిక్రమించకపోయినా, విదేశీ లీగ్స్ ఆడుతున్న సమయంలో కూడా ప్రజా సెంటిమెంట్‌ను గౌరవించడం క్రీడాకారుల బాధ్యత అని మెజారిటీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.



Tags:    

Similar News