క్రికెట్‌లో సంచలన నిర్ణయం.. ఆస్ట్రేలియాకు స్టార్ ఆల్‌రౌండర్ గుడ్‌బై.. ఇకపై అనామక జట్టుకు!
Moises Henriques: Moises Henriques switched his international allegiance to Portugal. మొయిసెస్ హెన్రిక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
క్రికెట్‌లో సంచలన నిర్ణయం.. ఆస్ట్రేలియాకు స్టార్ ఆల్‌రౌండర్ గుడ్‌బై.. ఇకపై అనామక జట్టుకు!
Moises Henriques: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మొయిసెస్ హెన్రిక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై ఆస్ట్రేలియా తరఫున కాకుండా.. పోర్చుగల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు ప్రకటించాడు. ఆస్ట్రేలియా తరఫున టెస్టులు, వన్డేలు, టీ20ల్లో ఆడిన హెన్రిక్స్.. ఇప్పుడు తన జన్మదేశమైన పోర్చుగల్‌కు ఆడనున్నాడు. అంతేకాదు 2028 టీ20 ప్రపంచకప్ అర్హత సాధించే లక్ష్యంతో అతడు బరిలోకి దిగనున్నాడు.
మొయిసెస్ హెన్రిక్స్ పోర్చుగల్‌లోని ఫుంచాల్‌లో జన్మించాడు. అయితే చిన్న వయసులోనే తన కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే పెరిగాడు. అద్భుత ప్రదర్శనలతో ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఆసీస్ తరఫున నాలుగు టెస్టులు, 16 వన్డేలు, 24 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 648 పరుగులు చేయడంతో పాటు 17 వికెట్లు కూడా పడగొట్టాడు. అంతేకాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్‌ను గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
ప్రస్తుత ఐసీసీ నిబంధనల ప్రకారం... ఒక ఆటగాడు తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన మూడు సంవత్సరాల తర్వాత అసోసియేట్ దేశానికి ప్రాతినిధ్యం వహించే అర్హత పొందుతాడు. హెన్రిక్స్ చివరిసారిగా 2021లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున ఆడాడు. దీంతో ఇప్పుడు పోర్చుగల్ జట్టుకు ఆడేందుకు అర్హత సాధించాడు. 2028 టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు పోర్చుగల్ యూరోపియన్ క్వాలిఫయర్స్‌లో చెక్ రిపబ్లిక్, ఇజ్రాయెల్, గ్రీస్ జట్లతో తలపడనుంది. ఇప్పటికే ఇంగ్లండ్, ఐర్లాండ్ జట్లు టోర్నీకి అర్హత సాధించగా.. యూరప్ నుంచి మరో రెండు స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో హెన్రిక్స్ అనుభవం పోర్చుగల్‌కు ఎంతో ఉపయోగపడనుంది.
తన అనూహ్య నిర్ణయంపై స్పందించిన మొయిసెస్ హెన్రిక్స్.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ విస్తరణకు ఇది మంచి అవకాశమని అభిప్రాయపడ్డాడు. 'ఇది కేవలం నా పోర్చుగీస్ వారసత్వం వల్ల తీసుకున్న నిర్ణయం మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధి చెందాలనే ఆలోచన కూడా ఉంది. మరో 10 నుంచి 20 దేశాల్లో క్రికెట్ నాణ్యత పెరిగితే ప్రపంచకప్ నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన టోర్నీగా మారుతుంది' అని పేర్కొన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ జో బర్న్స్ కూడా ఇటలీ తరఫున ఆడాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హెన్రిక్స్ కూడా అదే బాటలో నడుస్తూ.. పోర్చుగల్ జట్టుకు సేవలందించేందుకు సిద్ధమవడం అంతర్జాతీయ క్రికెట్‌లో ఆసక్తికర పరిణామంగా మారింది.