IND vs ENG 1st T20: ఐర్లాండ్ హ్యాంగోవర్ ఎఫెక్ట్.. షాక్‌కు గురిచేసిన శ్రేయస్ అయ్యర్ నిర్ణయం!

IND vs ENG 1st T20: Shreyas Iyer's Toss Decision Shocks. తొలి టీ20లో శ్రేయస్ అయ్యర్ తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Update: 2026-07-02 12:33 GMT

IND vs ENG 1st T20: ఐర్లాండ్ హ్యాంగోవర్ ఎఫెక్ట్.. షాక్‌కు గురిచేసిన శ్రేయస్ అయ్యర్ నిర్ణయం!

IND vs ENG 1st T20: బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చెస్టర్-లీ-స్ట్రీట్‌లోని రివర్‌సైడ్ మైదానంలో మేఘావృత వాతావరణం, వర్షం ముప్పు, పిచ్‌పై పచ్చిక ఎక్కువగా ఉండటంతో టాస్ గెలిచిన ఏ కెప్టెన్ అయినా ముందుగా బౌలింగ్ ఎంచుకుంటాడని అందరూ భావించారు. కానీ శ్రేయస్ మాత్రం బ్యాటింగ్‌ను ఎంచుకోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. సర్పంచ్ సాబ్ నిర్ణయంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. భారత మాజీ వికెట్‌కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఈ నిర్ణయానికి ఆసక్తికర కారణాన్ని వెల్లడించాడు.

ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 0-2తో వైట్‌వాష్‌కు గురికావడమే శ్రేయస్ అయ్యర్ తీసుకున్న నిర్ణయానికి కారణమై ఉండొచ్చని దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. ఆ సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లోనూ లక్ష్య ఛేదనలో విఫలమైన భారత్.. తొలి మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో, రెండో మ్యాచ్‌లో ఒకే ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ డీకే.. 'సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో జట్లు లక్ష్య ఛేదనకే మొగ్గు చూపుతాయి. అయితే ఐర్లాండ్ సిరీస్‌లో జరిగిన అనుభవం ఇంకా భారత జట్టుపై ప్రభావం చూపినట్లుంది. అందుకే ఈసారి ఛేదనకు వెళ్లకుండా ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుని ఉండొచ్చు' అని వ్యాఖ్యానించాడు.

టాస్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్ కూడా ఐర్లాండ్ సిరీస్ గురించి స్పందించాడు. 'ఐర్లాండ్ సిరీస్ ఇప్పుడు గతం. ఇది కొత్త సిరీస్. ఐదు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. మా ముందు మంచి అవకాశం ఉంది. కెప్టెన్‌గా ఇది నా రెండో సిరీస్ మాత్రమే. అందుకే చాలా ఉత్సాహంగా ఉన్నాను. మాకు కావాల్సింది దక్కింది. నిన్న ఇక్కడ మంచి ప్రాక్టీస్ సెషన్ నిర్వహించాం. ఇక్కడి పరిస్థితులకు కూడా అలవాటు పడ్డాం. ఇప్పుడు మంచి సిరీస్ ఆడాలని ఎదురుచూస్తున్నాం' అని తెలిపాడు. అలాగే ఐర్లాండ్ సిరీస్ నుంచి పలు పాఠాలు నేర్చుకున్నామని శ్రేయస్ వెల్లడించాడు. 'ఇంగ్లండ్ ఎలా క్రికెట్ ఆడుతుందో మాకు తెలుసు. వారి బలాలు, బలహీనతలపై స్పష్టమైన అవగాహన ఉంది. ఆ అనుభవంతో ఈ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తున్నాం' అని చెప్పాడు.

పిచ్ గురించి కూడా శ్రేయస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'వికెట్‌పై పచ్చిక బాగానే ఉంది. నిన్న ఇదే పిచ్‌పై ప్రాక్టీస్ చేశాం. అయినప్పటికీ ఇది ఎలా ప్రవర్తిస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టం. అయితే మా ఆటలో దూకుడు మాత్రం ఎక్కడా తగ్గదు' అని స్పష్టం చేశాడు. మొదటి టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అయితే ఇన్నింగ్స్ విరామ సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్ కొనసాగడం సాధ్యపడలేదు. వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు చివరకు మ్యాచ్‌ను రద్దు చేశారు.

Tags:    

Similar News