హాకీ ప్లేయర్లతో పోల్చితే క్రికెటర్ల ఫిట్‌నెస్ జుజుబి.. కోహ్లీ చెప్పింది నిజమే!
Manpreet Singh: భారత హాకీ దిగ్గజం మన్‌ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
హాకీ ప్లేయర్లతో పోల్చితే క్రికెటర్ల ఫిట్‌నెస్ జుజుబి.. కోహ్లీ చెప్పింది నిజమే!
Manpreet Singh: భారత హాకీ దిగ్గజం, దేశం తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లలో ఒకడైన మన్‌ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ తనకు ఆదర్శమని చెబుతూనే.. ఫిట్‌నెస్ విషయంలో హాకీ ఆటగాళ్లతో పోలిస్తే క్రికెటర్లు చాలా వెనుకబడి ఉంటారన్నాడు. కోహ్లీ ఫిట్‌నెస్‌పై చూపించే అంకితభావం తనను ఎంతో ప్రేరేపించిందని కూడా వెల్లడించాడు. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో జరుగుతున్న ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్ యూరోపియన్ లెగ్ సందర్భంగా మన్‌ప్రీత్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించాడు.
కోహ్లీ ఫిట్‌నెస్ ఫ్రీక్:
ఇటీవల భారత హాకీ మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ రికార్డును అధిగమించి 413 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఘనతను మన్‌ప్రీత్ సింగ్ సాధించాడు. ఈ సందర్భంగా తన సుదీర్ఘ కెరీర్ వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించాడు. 'విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ ఫ్రీక్ అని అందరికీ తెలుసు. కేవలం నాకు మాత్రమే కాదు.. ప్రతి క్రీడాకారుడికి అతడు ఆదర్శం. 36 ఏళ్ల వయసులో కూడా కింగ్ తన ఫిట్‌నెస్‌ను అద్భుతంగా కాపాడుకుంటున్నాడు. విరాట్ నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మైదానంలో అతని దూకుడు, ఏకాగ్రత, వంద శాతం కృషి నన్ను బాగా ఆకట్టుకుంటాయి. మైదానంలో మ్యాచ్ గెలవాలనే తపన అద్భుతం' అని మన్‌ప్రీత్ చెప్పాడు.
రొనాల్డో అంటే చాలా ఇష్టం:
'విరాట్‌కు క్రిస్టియానో రొనాల్డో అంటే ఇష్టం. నాకు కూడా రొనాల్డో అంటే చాలా ఇష్టం. అందుకే అతని జీవనశైలి, ఫిట్‌నెస్‌పై మాకు ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అతను తీసుకునే ఆహారం, వ్యాయామ పద్ధతులను ప్రపంచవ్యాప్తంగా చాలా మంది క్రీడాకారులు అనుసరిస్తుంటారు' అని మన్‌ప్రీత్ పేర్కొన్నాడు. ఇటీవల విరాట్ చేసిన వ్యాఖ్యలను కూడా మన్‌ప్రీత్ ప్రస్తావించాడు. భారత క్రీడా సమ్మిట్‌లో మాట్లాడిన కోహ్లీ.. 'భారత హాకీ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌తో పోలిస్తే మేము 15 శాతం కూడా ఉండము. వారు మా ట్రైనింగ్ సెషన్లు చూస్తే నవ్వుతారు. హాకీ ఆట మరింత ఎక్కువ శారీరక శ్రమతో కూడుకున్నది' అని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు అప్పట్లో క్రీడా ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి.
హాకీలో ఫిట్‌గా లేకపోతే నిలబడలేం:
తన సుదీర్ఘ కెరీర్ వెనుక ఫిట్‌నెస్‌నే ప్రధాన కారణమని మన్‌ప్రీత్ వెల్లడించాడు. 'భారత్ తరఫున ఎక్కువ కాలం ఆడాలనే తపన నన్ను ఫిట్‌నెస్ వైపు నడిపించింది. ప్రపంచ స్థాయి హాకీలో ఫిట్‌గా లేకపోతే నిలబడలేం. వయసు పెరిగే కొద్దీ మరింత కష్టపడాల్సి ఉంటుంది. అందుకే సెలవుల్లో ఉన్నా, శిక్షణ శిబిరాల్లో ఉన్నా నా ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటాను' అని వివరించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్‌కు కాంస్య పతకం అందించడం తన కెరీర్‌లో అత్యుత్తమ ఘట్టమని మన్‌ప్రీత్ పేర్కొన్నాడు. అయితే 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక చివరి స్థానంలో నిలవడం తన కెరీర్‌లో అత్యంత నిరాశ కలిగించిన సంఘటనగా చెప్పుకొచ్చాడు.
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ టార్గెట్:
ఇక భవిష్యత్ లక్ష్యాల గురించి మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. ప్రపంచకప్‌లో పతకం గెలవడం, లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028లో స్వర్ణ పతకం సాధించడం తన ప్రధాన లక్ష్యాలని వెల్లడించాడు. 'లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ వరకు ఆడాలనేది నా లక్ష్యం. అయితే అందుకు ఫిట్‌నెస్‌ను అదే స్థాయిలో కొనసాగించాలి. ఒకవేళ నేను పూర్తి స్థాయిలో ఫిట్‌గా లేనని భావిస్తే, యువ ఆటగాడి అవకాశాన్ని దూరం చేయకుండా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాను' అని మన్‌ప్రీత్ సింగ్ స్పష్టం చేశాడు.