Tilak Varma: మేము చాలా టెన్షన్ పడ్డాం.. కానీ మా కుర్రాళ్లు అద్భుతం చేశారు.. ఇక కప్ కొట్టాలి!

India A captain Tilak Varma Comments: శ్రీలంకలో జరుగుతున్న ట్రై నేషన్ ‘ఎ’ సిరీస్‌లో ఇండియా-ఎ జట్టు ఫైనల్‌కు అర్హత సాధించింది.

Update: 2026-06-17 13:50 GMT

Tilak Varma: మేము చాలా టెన్షన్ పడ్డాం.. కానీ మా కుర్రాళ్లు అద్భుతం చేశారు.. ఇక కప్ కొట్టాలి!

Tilak Varma: శ్రీలంకలో జరుగుతున్న ట్రై నేషన్ ‘ఎ’ సిరీస్‌లో ఇండియా-ఎ జట్టు ఫైనల్‌కు అర్హత సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించిన భారత్.. అఫ్గానిస్థాన్-ఎపై 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఇండియా-ఎ కెప్టెన్ తిలక్ వర్మ జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. వరుసగా రెండు మ్యాచులు ఓడడంతో ఫైనల్ ముందు కాస్త టెన్షన్ పడ్డామని, యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారని చెప్పాడు. ఈ టోర్నీ తమ జట్టులోని ప్రతి ఆటగాడికి గొప్ప అనుభవాన్ని అందించిందని, ఇక కప్ గెలవడానికి ప్రయత్నిస్తాం అని తిలక్ చెప్పుకొచ్చాడు.

మొదట బౌలింగ్ చేయాలనుకున్నాం:

టాస్ సమయంలో తమ తొలి ఎంపిక బౌలింగ్ అని తిలక్ వర్మ వెల్లడించాడు. 'నిజం చెప్పాలంటే మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. కానీ పిచ్‌లో పెద్దగా మార్పు కనిపించలేదు. మా బౌలర్లు బాధ్యతగా బౌలింగ్ చేసి అద్భుత ఫలితం సాధించారు. అఫ్గాన్ ఫాస్ట్ బౌలర్లు మంచి లెంగ్త్‌లో బంతులు వేస్తూ మమ్మల్ని ఒత్తిడిలోకే నెట్టారు. అయితే నేను నా బేసిక్స్‌ను నమ్ముకున్నాను. ఆ సమయంలో జట్టుకు మంచి భాగస్వామ్యం అవసరం కావడంతో అదే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాను' అని తిలక్ తెలిపాడు.

ఈ సిరీస్ పెద్ద పాఠం నేర్పింది:

తమ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు తొలిసారి ఇలాంటి టోర్నమెంట్‌లో ఆడుతున్నారని తిలక్ వర్మ చెప్పాడు. ప్రతి మ్యాచ్‌తో ఆటగాళ్లు ఎంతో నేర్చుకుంటున్నారని, ఈ మ్యాచ్‌లో వారి ఆటతీరు అందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. 'ఈ సిరీస్ మాకు చాలా నేర్పింది. మా స్క్వాడ్‌లో ఉన్న చాలా మంది ఆటగాళ్లు తొలిసారి ఇలాంటి వేదికపై ఆడుతున్నారు. ఇది వారికి గొప్ప అనుభవం. ప్రతి మ్యాచ్‌తో వారు మెరుగవుతున్నారు. మొదటి రెండు మ్యాచ్‌లతో పోలిస్తే ఈరోజు వారు మెరుగైన ప్రదర్శన చేశారు. ఇది ప్రతి ఒక్కరికీ గొప్ప లెర్నింగ్ ప్రాసెస్. ఫైనల్ చేరడం సంతోషంగా ఉంది. ఇక కప్ కొట్టాలని చూస్తున్నాం' అని తెలుగు ఆటగాడు తిలక్ వివరించాడు.

101 పరుగుల తేడాతో ఘన విజయం:

డంబుల్లాలోని రంగిరి డంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా-ఎ 50 ఓవర్లలో 319/9 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గానిస్థాన్-ఎ జట్టు 36.5 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇండియా-ఎ 101 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. అఫ్గానిస్థాన్-ఎ, శ్రీలంక-ఎ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో ఇండియా-ఎను ఎదుర్కొననుంది. యువ ఆటగాళ్లతో కూడిన తిలక్ సేన టైటిల్ పోరుకు పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది.

Tags:    

Similar News