IPL 2026 LSG vs KKR : నరాలు తెగే ఉత్కంఠ..సూపర్ ఓవర్‌లో లక్నోను చిత్తు చేసిన కోల్‌కతా

IPL 2026 LSG vs KKR :ఐపీఎల్ 2026లో కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్‌జీ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు చేరింది. రింకూ సింగ్ విధ్వంసం, సునీల్ నరైన్ మ్యాజిక్ బౌలింగ్‌తో కోల్‌కతా ఘనవిజయం సాధించింది. లక్నోకు వరుసగా 5వ ఓటమి.

Update: 2026-04-27 00:46 GMT

IPL 2026 LSG vs KKR 

IPL 2026 LSG vs KKR : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా జరిగిన 38వ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు అసలైన మజాను అందించింది. లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తలపడ్డాయి. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్ చివరకు సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్‌లో కోల్‌కతా పంజా విసరడంతో లక్నోకు వరుసగా ఐదో ఓటమి తప్పలేదు. రింకూ సింగ్ అద్భుత ఇన్నింగ్స్, సునీల్ నరైన్ మ్యాజిక్ స్పెల్ ఈ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాయి.

టాస్ గెలిచిన లక్నో జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. లక్నో బౌలర్ మొహ్సిన్ ఖాన్ నిప్పులు చెరిగే బంతులతో కోల్‌కతా టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. కేవలం 23 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి కేకేఆర్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. అయితే, కష్టాల్లో ఉన్న జట్టును రింకూ సింగ్ ఆదుకున్నాడు. 51 బంతుల్లో 83 పరుగులు (7 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచాడు. సునీల్ నరైన్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగులు చేయగలిగింది. ఇది రింకూ సింగ్ ఐపీఎల్ కెరీర్‌లో అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు కెప్టెన్ రిషబ్ పంత్ (42) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఎయిడెన్ మార్‌క్రామ్ (31), ఆయుష్ బదోని (24) పోరాడి మ్యాచ్‌ను దగ్గరకు తెచ్చారు. చివరి ఓవర్‌లో లక్నోకు 17 పరుగులు అవసరం కాగా, మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి బంతికి 7 పరుగులు కావాల్సిన దశలో మహమ్మద్ షమీ క్రీజులోకి వచ్చి భారీ సిక్సర్ బాదడంతో స్కోర్లు సమమయ్యాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది.

సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నోకు సునీల్ నరైన్ చుక్కలు చూపించాడు. తన స్పిన్ మ్యాజిక్‌తో కేవలం 3 బంతుల్లోనే 2 వికెట్లు తీసి లక్నోను కేవలం 1 పరుగుకే కట్టడి చేశాడు. రిషబ్ పంత్ 1 పరుగు వద్ద నాటౌట్‌గా నిలిచాడు. కేవలం 2 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ తరపున రింకూ సింగ్ మొదటి బంతికే ఫోర్ కొట్టి విజయాన్ని ఖాయం చేశాడు.

ఈ ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్‌లో వరుసగా ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఆరు ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఇది రెండో విజయం మాత్రమే. మొహ్సిన్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, బ్యాటర్ల వైఫల్యం, సూపర్ ఓవర్‌లో నరైన్ ధాటికి లక్నో తలవంచక తప్పలేదు.

Tags:    

Similar News