KKR vs MI : 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఉతికేసిన కేకేఆర్.. ప్లేఆఫ్స్ రేసులోకి నైట్ రైడర్స్

KKR vs MI : ఐపీఎల్ 2026 లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మనీష్ పాండే, పావెల్ బ్యాటింగ్‌తో కేకేఆర్ ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది.

Update: 2026-05-21 01:10 GMT

KKR vs MI 

KKR vs MI : ఐపీఎల్ 2026 సీజన్‎లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన లీగ్ 65వ హోరాహోరీ పోరులో ముంబై ఇండియన్స్‌ను 4 వికెట్ల తేడాతో కోల్‌కతా మట్టికరిపించింది. ప్లేఆఫ్స్ రేసు దృష్ట్యా కేకేఆర్‌కు ఈ మ్యాచ్ గెలవడం అత్యంత కీలకం కాగా, అనుకున్నట్లే బ్యాటింగ్, బౌలింగ్ లలో సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో కోల్‌కతా టాప్-4 రేసులో తన ఆశలను సజీవంగా ఉంచుకోగా.. ముంబై ఇండియన్స్ ఘోర పరాజయాల పరంపరను కొనసాగిస్తూ అభిమానులను మరోసారి నిరాశపరిచింది.

కుప్పకూలిన టాప్ ఆర్డర్

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఆదిలోనే గట్టి షాక్‌లు తగిలాయి. కోల్‌కతా బౌలర్ల ధాటికి ముంబై టాప్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓపెనర్ రయాన్ రికెల్టన్ 7 బంతుల్లో కేవలం 6 పరుగులు చేసి అవుట్ అవ్వగా.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 13 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలు కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. యువ ప్లేయర్ నమన్ ధీర్ అయితే కనీసం ఖాతా కూడా తెరవకుండానే డకౌట్ అయ్యాడు. దీంతో ముంబై తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది.

క్యాప్టెన్ హార్దిక్ పోరాటం.. కాపాడిన కార్బిన్ బాష్

ఘోరమైన స్థితిలో ఉన్న ముంబై ఇన్నింగ్స్‌ను కెప్టెన్ హార్దిక్ పాండ్యా చక్కబెట్టే ప్రయత్నం చేశాడు. కాస్త ఓపికగా ఆడుతూ 26 పరుగులు జోడించాడు. అయితే కోల్‌కతా బౌలర్లు నిరంతరం వికెట్లు తీస్తూ ముంబైపై ఒత్తిడిని కొనసాగించారు. ఆఖర్లో లోయర్ ఆర్డర్ బ్యాటర్ కార్బిన్ బాష్ మెరుపులు మెరిపించాడు. కేకేఆర్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగుల ఓ మోస్తరు స్కోరునైనా చేయగలిగింది.

సునీల్ నరైన్ స్పిన్ మ్యాజిక్

ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ విభాగం అద్భుతంగా పనిచేసింది. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ తన 4 ఓవర్ల కోటాలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. ముంబై బ్యాటర్లను పరుగులు చేయకుండా కట్టడి చేయడంలో నరైన్ కీలక పాత్ర పోషించాడు. ఇకపోతే యువ బౌలర్ సౌరభ్ దూబే, స్టార్ ఆల్‌రౌండర్ కెమెరాన్ గ్రీన్ లు చెరో 2 వికెట్లతో ముంబై వెన్ను విరిచారు. వీరికి తోడుగా కార్తీక్ త్యాగి కూడా 2 వికెట్లు తీసి ముంబైని భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.

మనీష్ పాండే మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్

సాధారణమైన 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టుకు కెప్టెన్ అజింక్య రహానే (21 పరుగులు) మంచి స్టార్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత సీనియర్ బ్యాటర్ మనీష్ పాండే బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 33 బంతుల్లో 45 పరుగులు చేసి మ్యాచ్‌ను కేకేఆర్ వైపు తిప్పేసాడు. అనంతరం కరీబియన్ హిట్టర్ రోవ్‌మన్ పావెల్ 30 బంతుల్లో 40 పరుగులతో మెరుపులు మెరిపించడంతో కేకేఆర్ విజయం ఖాయమైంది. ఆఖర్లో రింకూ సింగ్, అనుకుల్ రాయ్‌లు కలిసి మ్యాచ్‌ను ముగించారు. కేకేఆర్ 18.5 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఈజీగా ఛేజ్ చేసింది.

Tags:    

Similar News