India Playing XI: ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లు.. తొలి టెస్టుకు భారత్ తుది జట్టు ఇదే!
India Playing XI: భారత్, శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి గాలె వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.
India Playing XI: ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లు.. తొలి టెస్టుకు భారత్ తుది జట్టు ఇదే!
India Playing XI: భారత్, శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి గాలె వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 ఫైనల్ రేసులో నిలవాలంటే.. ఈ మ్యాచ్ భారత్ గెలవాల్సి ఉంది. గిల్ సేన పటిష్ట జట్టుతో బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా గాలె పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో.. భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి.
భారత జట్టులో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ రూపంలో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉన్నారు. ఈ ముగ్గురి బౌలింగ్ శైలి భిన్నంగా ఉండటం టీమిండియాకు అదనపు బలంగా మారనుంది. కుల్దీప్ తన లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్‌తో వికెట్లు తీయగలడు. జడేజా కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. మరోవైపు మానవ్ సంప్రదాయ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌తో ఎక్కువ టర్న్ రాబట్టే సామర్థ్యం కలిగి ఉన్నాడు. 'ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను ఒకేసారి ఆడించడం టీమిండియాకు పెద్ద సమస్య కాదు. వీరి బౌలింగ్‌లో వైవిధ్యం ఉంది. పరిస్థితులను బట్టి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వారిని ఎలా ఉపయోగిస్తాడనేదే ముఖ్యం. ముగ్గురికీ 20 వికెట్లు తీసే సామర్థ్యం ఉంది. గాలె పరిస్థితులను పరిశీలిస్తే ముగ్గురు స్పిన్నర్ల వ్యూహం సరైనదిగానే కనిపిస్తోంది' అని మోర్నీ మోర్కెల్ తెలిపాడు.
'గాలె పిచ్ తొలి రోజుల్లో బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపించినప్పటికీ.. టెస్టు మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్నర్లకు సహకారం లభిస్తుంది. అప్పుడు భారత స్పిన్నర్లు లంక బ్యాటర్లపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ చేయడం, సరైన ప్రాంతాల్లో బంతులు వేయడం, ఎక్కువసేపు ఓపికగా బౌలింగ్ చేయడం కీలకం. పేస్ బౌలింగ్ విభాగంలో మహ్మద్ సిరాజ్‌కు తోడుగా గుర్నూర్ బ్రార్ లేదా ప్రసిద్ధ్ కృష్ణలో ఒకరిని తుది జట్టులో చోటు ఉంటుంది. ఇద్దరికీ టెస్టు అనుభవం పెద్దగా లేనప్పటికీ.. శ్రీలంక పరిస్థితుల్లో తమను తాము నిరూపించుకునే సామర్థ్యం ఉంది. తుది జట్టులో ఎవరికి అవకాశం లభించినా తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తారు' అని మోర్కెల్ చెప్పాడు.
శ్రీలంకలోని వేడి, తేమతో కూడిన వాతావరణం పేసర్లకు సవాల్‌గా మారే అవకాశం ఉందని మోర్కెల్ తెలిపాడు. కూకాబుర్రా బంతి 20 నుంచి 35 ఓవర్ల తర్వాత మెత్తబడినప్పుడు పేసర్లు తమ వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుందని వివరించాడు. బంతి పాతబడిన తర్వాత క్రీజ్‌ను ఎలా ఉపయోగించాలి, షార్ట్ బాల్స్‌ను ఎప్పుడు ప్రయోగించాలి, బ్యాటర్లపై ఒత్తిడిని ఎలా కొనసాగించాలి వంటి అంశాల్లో పేసర్లు తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుందని మోర్కెల్ సూచించాడు. గాలె టెస్టులో టీమిండియా స్పిన్ బలాన్నే ప్రధాన ఆయుధంగా మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుల్దీప్, జడేజా, సుతార్ ముగ్గురినీ ఆడిస్తే భారత బౌలింగ్ దాడి మరింత వైవిధ్యంగా మారనుంది. అయితే తుది నిర్ణయం కెప్టెన్ శుభ్‌మన్ గిల్, టీమ్ మేనేజ్‌మెంట్ చేతుల్లోనే ఉంది.
భారత్ జట్టు (అంచనా):
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్/ప్రసిద్ధ్ కృష్ణ.