IND vs SL: గిల్, పంత్ కాదు.. ఆ భారత బ్యాటర్ అంటేనే భయం.. శ్రీలంక కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!

IND vs SL: శ్రీలంకకు అసలు ప్రమాదం కేఎల్ రాహుల్ నుంచే ఉందని శ్రీలంక కెప్టెన్ డిసిల్వా అభిప్రాయపడ్డాడు.

Update: 2026-08-13 13:02 GMT

IND vs SL: గిల్, పంత్ కాదు.. ఆ భారత బ్యాటర్ అంటేనే భయం.. శ్రీలంక కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!

IND vs SL: భారత్, శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి రెండు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత శ్రీలంకలో టీమిండియా టెస్టు సిరీస్‌ ఆడబోతోంది. ప్రస్తుతం టెస్ట్ జట్టు మార్పుల దశలో ఉంది. దీంతో భారత జట్టులోని పలువురు ఆటగాళ్లకు శ్రీలంక గడ్డపై టెస్టు క్రికెట్ ఆడిన అనుభవం లేదు. ఈ నేపథ్యంలో శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా భారత జట్టులోని ఓ సీనియర్ బ్యాటర్‌ను తమ జట్టుకు అతిపెద్ద ముప్పుగా పేర్కొన్నాడు. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లు భారత బ్యాటింగ్‌లో కీలకంగా ఉన్నప్పటికీ.. శ్రీలంకకు అసలు ప్రమాదం కేఎల్ రాహుల్ నుంచే ఉందని డిసిల్వా అభిప్రాయపడ్డాడు.

'అనుభవం పరంగా కేఎల్ రాహుల్ మా జట్టుకు అతిపెద్ద సవాల్ విసురుతాడు. ప్రపంచంలోని వివిధ పరిస్థితుల్లో రాహుల్ అద్భుతంగా ఆడాడు.శ్రీలంక పరిస్థితుల్లోనూ అతడికి మంచి అవగాహన ఉంది. రాహుల్ గతంలో శ్రీలంకలో టెస్టు క్రికెట్ ఆడిన అనుభవం ఉండటమే అతడిని ప్రత్యేకంగా నిలబెడుతోంది. 2017లో భారత జట్టు శ్రీలంకలో పర్యటించిన సమయంలో రాహుల్ రెండో, మూడో టెస్టుల్లో ఆడాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి రెండు మ్యాచ్‌ల్లోనూ అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. శ్రీలంక పరిస్థితులను రాహుల్ బాగా అర్థం చేసుకుని బ్యాటింగ్ చేశాడు' అని శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా చెప్పాడు.

తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి శ్రీలంకలో టెస్టు ఆడబోతున్న కేఎల్ రాహుల్.. ఈసారి కూడా భారత ఇన్నింగ్స్‌ను ఓపెనర్‌గా ప్రారంభించనున్నాడు. మరోవైపు అతడికి జోడీగా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ బరిలోకి దిగనున్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా భారత బ్యాటింగ్‌లో కీలకంగా మారనున్నారు. ఈ నలుగురిలో ఇద్దరు చెలరేగినా భారత్ భారీ స్కోర్ చేస్తుంది. అయితే శ్రీలంకలోని పిచ్‌లు స్పిన్‌కు అనుకూలం కాబట్టి భారత బ్యాటర్లకు పెద్ద పరీక్ష ఎదురుకానుంది. ముఖ్యంగా రాహుల్, జైస్వాల్, గిల్, పంత్‌లు లంక స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. గాలె టెస్టులో పరిస్థితులను త్వరగా అర్థం చేసుకుని ఆడటం భారత విజయానికి కీలకంగా మారనుంది.

ఇక శ్రీలంకతో జరుగుతున్న ఈ సిరీస్‌ టీమిండియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 ఫైనల్ రేసు పరంగా కూడా ఎంతో కీలకం. భారత్‌ తప్పనిసరిగా విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు సొంతగడ్డపై భారత్‌ను ఓడించి తమ అవకాశాలను బలోపేతం చేసుకోవాలని శ్రీలంక కూడా భావిస్తోంది. దాంతో రెండు టెస్టులు రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తే.. మ్యాచ్ ఐదు రోజులు సాగడం కష్టమే. మూడు రోజుల్లో కూడా ముగిసే అవకాశాలు లేకపోలేదు. భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలెలో జరగనుంది. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలో జరుగుతుంది.

Tags:    

Similar News