IND Playing 11: ఇంగ్లండ్‌తో మూడో టీ20.. భారత్ జట్టులో భారీ మార్పులు.. ప్లేయింగ్ 11 ఇదే!

IND Playing XI vs ENG For 3rd T20. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగే మూడో టీ20 కోసం భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.

Update: 2026-07-06 12:28 GMT

IND Playing 11: ఇంగ్లండ్‌తో మూడో టీ20.. భారత్ జట్టులో భారీ మార్పులు.. ప్లేయింగ్ 11 ఇదే! 

IND Playing XI vs ENG For 3rd T20: ఇంగ్లండ్ పర్యటనలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన భారత జట్టు.. ఇప్పుడు మూడో టీ20లో తప్పక విజయం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడిపోయింది. ముఖ్యంగా ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌ను 0-2తో కోల్పోవడం తీవ్ర నిరాశ కలిగించింది. ఈ నేపథ్యంలో మంగళవారం నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగే మూడో టీ20 కోసం భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.

రెండో టీ20లో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తీవ్రంగా నిరాశపరిచాడు. నాలుగు ఓవర్లలో ఒక వికెట్ తీయకుండా 60 పరుగులు ఇచ్చాడు. అతడు మూడు బ్యాక్‌ఫుట్ నోబాల్స్ వేయడం భారత జట్టుకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా ఒకే ఓవర్లో 29 పరుగులు సమర్పించుకోవడం మ్యాచ్ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి జట్టులో ఉండగా.. ఓల్డ్ ట్రాఫోర్డ్ పరిస్థితుల్లో మూడో స్పెషలిస్ట్ స్పిన్నర్ అవసరమా? అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. దీంతో ట్రెంట్ బ్రిడ్జ్ మ్యాచ్‌కు బిష్ణోయ్‌ను తుది జట్టు నుంచి తప్పించడం ఖాయమైంది. అతని స్థానంలో అదనపు పేసర్‌ను తీసుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.

పేసర్ రేసులో ప్రసిద్ధ్ కృష్ణ కంటే.. బంతిని గాల్లోనూ పిచ్‌పై కూడా స్వింగ్ చేయగల ప్రిన్స్ యాదవ్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌లో ప్రసిద్ధ్ బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బంతులను బ్యాటర్లు సులభంగా బౌండరీలకు తరలిస్తున్న నేపథ్యంలో ప్రిన్స్ ఎంపికదాదాపుగా ఖాయం అయినట్లే. ఐర్లాండ్‌పై ప్రసిద్ధ్ తేలిపోగా.. ప్రిన్స్‌ కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడు. దీంతో మేనేజ్‌మెంట్ ప్రిన్స్‌ను తీసుకునేందుకు మొగ్గుచూపుతోంది. గత మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నప్పటికీ.. ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ 27 పరుగులు రాబట్టడం భారత్‌కు భారీ దెబ్బగా మారింది. అర్ష్‌దీప్ మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సిన అసవరం ఉంది.

మూడో టీ20 జరిగే ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. దీంతో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. తొలి మ్యాచ్ ఒత్తిడిని అధిగమించిన వైభవ్.. ఈసారి ఇంగ్లండ్ బౌలర్లపై దూకుడుగా ఆడాలని చూస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే అద్భుత ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మతో కలిసి బుడ్డోడు భారత ఇన్నింగ్స్‌కు బలమైన ఆరంభం ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ గాడిన పడాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ శ్రేయాస్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు.

అయితే భారత బ్యాటింగ్ యూనిట్‌కు ఇంగ్లండ్ పరిస్థితులు ఇంకా సవాలుగానే మారాయి. గత ఆరు నెలలుగా ఎక్కువగా ఫ్లాట్ వికెట్లపై ఆడారు. ముఖ్యంగా ఐపీఎల్‌లో ఆడిన భారత బ్యాటర్లు ఇంగ్లండ్‌లో అదనపు బౌన్స్, స్వింగ్, సీమ్ మూవ్‌మెంట్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. శామ్ కరన్ వంటి బౌలర్లు వేస్తున్న వైవిధ్యమైన బంతులను సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నారు. శ్రేయస్, ఇషాన్ ఇంగ్లండ్ బౌలింగ్‌పై పూర్తిగా ఆధిపత్యం చెలాయించలేకపోయారు. తిలక్ వర్మ గత మ్యాచ్‌లో వేగంగా పరుగులు చేసినా.. జోఫ్రా ఆర్చర్ పేస్‌ను ఉపయోగించుకోవడం వల్లే అది సాధ్యమైంది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు, శామ్ కరన్ బౌలింగ్ ముందు తిలక్ కూడా ఇబ్బంది పడుతున్నాడు.

భారత్ గత రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 189, 190 పరుగులు చేసినప్పటికీ.. ఆ స్కోర్లు సరిపోలేదు. కనీసం మరో 25 నుంచి 30 పరుగులు ఎక్కువ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో అభిషేక్ శర్మ మాత్రమే తన సహజ దూకుడు ఆటను కొనసాగిస్తూ వరుసగా 59, 43 పరుగులు చేసి నిలకడను ప్రదర్శించాడు. వరుణ్ చక్రవర్తి తన సాధారణ శైలికి భిన్నంగా వేగంగా బంతులు వేస్తుండటంతో అతని ప్రభావం కూడా తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హర్షిత్ రాణా కూడా భారీగా రన్స్ ఇస్తుండడంతో.. ప్రసిద్ధ్ తుది జట్టులోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వరుసగా విఫలమవుతున్న శివమ్ దూబే స్థానంలో సూర్యాంశ్ షెడ్జేని పరిగణనలోకి తీసుకునే అవకాశాలను కొట్టిపారేయలేం.

భారత్ తుది జట్టు (అంచనా):

అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్‌ దూబే/సూర్యాంశ్ షెడ్జే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా/ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్‌ చక్రవర్తి, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రిన్స్ యాదవ్.

Tags:    

Similar News