IND vs ENG 2nd ODI: రెండో వన్డేకు ముందు.. రోహిత్‌ శర్మకు గంభీర్ స్పెషల్ మెసేజ్!

Gautam Gambhir's Special Message to Rohit Sharma. రెండో వన్డేకు ముందు సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మకు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక సందేశం ఇచ్చాడు.

Update: 2026-07-15 14:36 GMT

IND vs ENG 2nd ODI: రెండో వన్డేకు ముందు.. రోహిత్‌ శర్మకు గంభీర్ స్పెషల్ మెసేజ్!

IND vs ENG 2nd ODI: గురువారం (జులై 16) ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో వన్డేకు ముందు సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మకు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక సందేశం ఇచ్చాడు. రోహిత్ తన సహజ ఆటను కొనసాగించాలని గంభీర్ అతడికి సూచించినట్లు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. ప్రస్తుతం హిట్‌మ్యాన్ మానసికంగా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఉండేలా టీమ్ మేనేజ్‌మెంట్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వన్డే ప్రపంచ కప్ 2027ను దృష్టిలో ఉంచుకుని రోహిత్ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలు, విమర్శల నేపథ్యంలో గౌతీ ఈ సలహా ఇచ్చాడట.

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ 21 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేశాడు. సామ్ కరన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔటయ్యాడు. దీంతో మరోసారి హిట్‌మ్యాన్ ఫామ్‌పై చర్చ మొదలైంది. ఈ పరిస్థితుల్లో రోహిత్‌పై అదనపు ఒత్తిడి పెంచకుండా పూర్తి స్వేచ్ఛతో ఆడే అవకాశం కల్పించాలని కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయించినట్లు సమాచారం. 'పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ దేశానికి, జట్టుకు ఎంతో సేవ చేశాడు. హిట్‌మ్యాన్ తన కెరీర్ మొత్తం ఎలా ఆడాడో అలాగే స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలని కోచ్ కోరుకుంటున్నారు' అని జట్టు వర్గాల సమాచారం.

ప్రస్తుతం రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సమయంలో అతడికి విమర్శల కంటే మానసిక ప్రశాంతత, నమ్మకం అవసరమని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందట. ప్రపంచ స్థాయి ఆటగాళ్లు తమ సహజ శైలిలో ఆడే స్వేచ్ఛ లభించినప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేస్తారని, ప్రతి ఇన్నింగ్స్‌ను అతిగా విశ్లేషించడం కంటే అతడిపై విశ్వాసం ఉంచడం ముఖ్యమని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగితే.. హిట్‌మ్యాన్ ఒంటిచేత్తోనే మ్యాచ్ ఫలితాన్ని మార్చగల సత్తా ఉన్న ఆటగాడని వారు విశ్వసిస్తున్నారు.

ఇటీవల రోహిత్ శర్మ భవిష్యత్తుపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2027 వన్డే ప్రపంచ కప్ సమయానికి రోహిత్ వయసు 41 సంవత్సరాలు. యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందనే వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేవని, భవిష్యత్తు గురించి కాకుండా ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌పైనే పూర్తి దృష్టి పెట్టామని జట్టు వర్గాలు స్పష్టం చేశాయి. రోహిత్ ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ప్రతి మ్యాచ్‌లో తన అత్యుత్తమ ఆటను కనబర్చేలా వాతావరణం కల్పించడమే టీమ్ మేనేజ్‌మెంట్ లక్ష్యం. రెండో వన్డేలో రోహిత్ తన సహజ శైలిలో ఆడి భారీ ఇన్నింగ్స్ ఆడతాడని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారత్ 1-0 ఆధిక్యంలో ఉండగా.. కార్డిఫ్‌లో జరిగే రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా చూస్తోంది.

Tags:    

Similar News