వరల్డ్ కప్ ఫార్మాట్‌లో భారీ మార్పులు.. 2027 వన్డే, 2028 టీ20 టోర్నీలకు కొత్త నిబంధనలు ఇవే!

ODI World Cup: Super 7 and Super 10 ODI World Cup and 2028 T20 World Cup. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రపంచ క్రికెట్‌లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.

Update: 2026-07-15 12:27 GMT

వరల్డ్ కప్ ఫార్మాట్‌లో భారీ మార్పులు.. 2027 వన్డే, 2028 టీ20 టోర్నీలకు కొత్త నిబంధనలు ఇవే!

ODI World Cup: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రపంచ క్రికెట్‌లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. 2027 వన్డే వరల్డ్ కప్, 2028 టీ20 వరల్డ్ కప్ టోర్నీల ఫార్మాట్‌లో భారీ మార్పులను బుధవారం ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. మెగా టోర్నీలను మరింత పోటీగా, ప్రతి మ్యాచ్‌కు ప్రాధాన్యం పెరిగేలా కొత్త విధానాలను తీసుకువచ్చింది.

ముఖ్యంగా 2027 వన్డే వరల్డ్ కప్‌లో తొలిసారిగా 'సూపర్ సిరీస్', 'సూపర్ సెవెన్' దశలను ఐసీసీ ప్రవేశపెట్టింది. దాంతో వరల్డ్ కప్‌లోని మ్యాచ్‌లు మరింత ఆసక్తికరంగా సాగనున్నాయి. స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ నిర్ణయాలకు బోర్డు ఆమోదం తెలిపింది.

2027 వన్డే వరల్డ్ కప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల్లో సంయుక్తంగా జరగనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 14 జట్లు పాల్గొన్నప్పటికీ.. టోర్నీని మూడు దశల్లో నిర్వహించనున్నారు. ప్రధాన టోర్నీకి ముందు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో చివరి మూడు స్థానాల్లో ఉన్న జట్లు సూపర్ సిరీస్'లో పోటీ పడతాయి. ఆ మూడు జట్లలో ఒక జట్టు మాత్రమే ప్రధాన టోర్నీలోకి అర్హత సాధిస్తుంది. దీంతో ప్రధాన గ్రూప్ దశలో మొత్తం 12 జట్లు మాత్రమే బరిలోకి దిగుతాయి.

ఈ 12 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూపులో ఆరు జట్లు ఉంటాయి. ప్రతి గ్రూపులో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లతో పాటుగా ఈ రెండు గ్రూపుల్లోనే అత్యుత్తమంగా రాణించిన మరో జట్టు.. కొత్తగా ప్రవేశపెట్టిన ‘సూపర్ 7’ దశకు చేరుకుంటాయి. ఈ దశలో ఏడు జట్లు రౌండ్ రాబిన్ పద్ధతిలో పోటీ పడతాయి. అక్కడి నుంచి తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

చివరగా రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ కొత్త ఫార్మాట్‌ను ఎందుకు తీసుకొచ్చారనే విషయాన్ని కూడా ఐసీసీ వెల్లడించింది. టోర్నీలో ప్రతి మ్యాచ్‌కు ప్రాధాన్యం పెరగడం, ఆరంభ దశ నుంచే తీవ్ర పోటీ నెలకొనడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. గత ప్రపంచ కప్‌లలో కొన్ని మ్యాచ్‌లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వివరించింది.

ఇక 2028 టీ20 ప్రపంచ కప్‌లో కూడా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పొట్టి టోర్నీలో 20 జట్లు పాల్గొంటాయి. తొలి దశలో ఐదు గ్రూపుల్లో నాలుగేసి జట్లు పోటీ పడతాయి. ప్రతి గ్రూపు నుంచి అగ్ర స్థానంలో నిలిచిన రెండు జట్లు కలిసి కొత్తగా ప్రవేశపెట్టిన ‘సూపర్ 10’ దశకు అర్హత సాధిస్తాయి.

ఈ దశలో 10 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు నేరుగా సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి. రెండు గ్రూపుల్లో రెండో, మూడో స్థానాల్లో నిలిచిన జట్లు క్రాస్-ఓవర్ ఎలిమినేటర్ మ్యాచ్‌లు ఆడి.. మిగిలిన రెండు సెమీఫైనల్ బెర్త్‌లను దక్కించుకుంటాయి. దీంతో సూపర్-10 చివరి మ్యాచ్‌ల వరకు ఉత్కంఠ కొనసాగనుంది.

2028 టీ20 ప్రపంచ కప్ అర్హత ప్రక్రియకు కూడా ఐసీసీ మార్గదర్శకాలను ప్రకటించింది. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా స్కాట్లాండ్‌కు యూరప్ రీజినల్ ఫైనల్‌కు నేరుగా ప్రవేశం కల్పించింది. 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఆటోమేటిక్ అర్హత కోల్పోయిన జట్లు నేరుగా గ్లోబల్ క్వాలిఫయర్‌లో పాల్గొంటాయి. ప్రాంతీయ క్వాలిఫయర్ల నుంచి ఎంపికైన ఎనిమిది జట్లతో కలిసి పోటీ పడతాయి.

గ్లోబల్ క్వాలిఫయర్‌లో ప్రతి ప్రాంతం నుంచి అగ్రస్థానంలో నిలిచిన జట్టుతో పాటు మొత్తం అత్యుత్తమ ప్రదర్శన చేసిన మరో మూడు జట్లు 2028 టీ20 ప్రపంచ కప్‌కు అర్హత సాధిస్తాయి. ఈ మార్పులకు ఐసీసీ బోర్డు ఆమోదం తెలిపినప్పటికీ.. నవంబర్‌లో జరిగే ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీ సమావేశం అనంతరం తుది ఆమోదం లభించనుంది.

Tags:    

Similar News