IND vs ENG 1st ODI  : నేటి నుంచే ఇండియా-ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ఫైట్.. మ్యాచ్‌కు వర్షం గండం ఉందా?

IND vs ENG 1st ODI  : భారత్, ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.. బర్మింగ్‌హామ్‌లో వర్షం పడే అవకాశం ఉందా? లేదా అనేది తెలుసుకుందాం.

Update: 2026-07-14 01:21 GMT

IND vs ENG 1st ODI

IND vs ENG 1st ODI  : ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ముగిసిన తర్వాత, ఇప్పుడు భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కాబోతోంది. నేడు (జులై 14, మంగళవారం) ఈ 50 ఓవర్ల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. బర్మింగ్‌హామ్‌లోని ప్రసిద్ధ ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఇరు జట్లు తలపడనున్నాయి. అంతకుముందు జరిగిన టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వన్డే మ్యాచ్ కూడా వర్షం పాలవుతుందా? లేదా పూర్తి ఆటను చూసే అవకాశం దక్కుతుందా? అని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

రోహిత్, విరాట్ రీఎంట్రీ

ఈ వన్డే సిరీస్‌కు ఒక ప్రత్యేకత ఉంది. టీమిండియా సీనియర్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ వన్డే సిరీస్‌లో ఆడుతున్నారు. వీరిద్దరినీ మళ్లీ మైదానంలో బ్యాటింగ్ చేస్తూ చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ మ్యాచ్‌కు వాతావరణం ఎలా ఉంటుందనే ప్రశ్న మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒకవేళ ఇంగ్లాండ్‌లో సాధారణంగా పడే వర్షం కనుక పడితే, రోహిత్, విరాట్‌ల ఆటను చూసే అదృష్టం అభిమానులకు దక్కకుండా పోతుంది. అయితే ప్రస్తుతానికి అందుతున్న వాతావరణ సమాచారం క్రికెట్ ప్రేమికులకు పెద్ద ఉపశమనం కలిగిస్తోంది.

ఎడ్జ్‌బాస్టన్ వెదర్ రిపోర్ట్.. వర్షం ముప్పు ఉందా?

ప్రముఖ వాతావరణ సంస్థ అక్యువెదర్ నివేదిక ప్రకారం.. భారత్, ఇంగ్లాండ్ మొదటి వన్డే మ్యాచ్ జరిగే సమయంలో బర్మింగ్‌హామ్‌లో వాతావరణం చాలా వరకు అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ లోకల్ టైమ్ ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 11:00 గంటలకు ప్రారంభం అవుతుంది. మన భారత కాలమానం (IST) ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి మ్యాచ్ లైవ్ ప్రసారం కానుంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం కేవలం 1 శాతం మాత్రమే ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి మ్యాచ్‌కు వర్షం వల్ల ఎలాంటి అంతరాయం కలగకపోవచ్చు.

మబ్బులతో కూడిన ఆకాశం.. ఫాస్ట్ బౌలర్లకు పండగే

వర్షం ముప్పు లేనప్పటికీ, మ్యాచ్ సమయంలో బర్మింగ్‌హామ్‌లో సగటు ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉంది. ఆకాశం చాలా వరకు మబ్బులతో నిండి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనితో పాటు గంటకు 22 కిలోమీటర్ల వేగంతో చల్లటి గాలులు వీచే అవకాశం ఉంది. ఆకాశంలో మబ్బులు ఉండటం వల్ల ఇక్కడి పిచ్ ఫాస్ట్ బౌలర్లకు బాగా అనుకూలిస్తుంది. బంతి ఎక్కువగా స్వింగ్ అయ్యే అవకాశం ఉన్నందున టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ వంటి భారత పేసర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లను ఎలా ముప్పుతిప్పలు పెడతారో చూడాలి.

ఇరు జట్ల పటిష్టమైన స్క్వాడ్స్ ఇవే

ఈ వన్డే సిరీస్‌లో భారత జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, రోహిత్, విరాట్ వంటి సీనియర్లు జట్టుకు కొండంత అండగా నిలిచారు. భారత జట్టులో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, శివమ్ దూబే, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు.

మరోవైపు హ్యారీ బ్రూక్ కెప్టెన్సీలోని ఇంగ్లాండ్ జట్టులో బెన్ డకెట్, విల్ జాక్స్, జో రూట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, సామ్ కర్రన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, టామ్ బాంటన్, జోష్ టంగ్, గస్ అట్కిన్సన్, జేమ్స్ కోల్స్, రెహాన్ అహ్మద్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు.

Tags:    

Similar News