Vastu Tips: ఇల్లు నిర్మించే సమయంలో ఈ తప్పులు చేస్తే...జీవితంలో పైకి రాలేరు

ఇల్లు నిర్మించే సమయంలో వాస్తు నియమాలు తప్పనిసరిగా చూసుకోవాలి. ప్రధాన ద్వారం, వంటగది, బాత్రూమ్, స్థలం ఎంపిక వంటి అంశాల్లో నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు.

Update: 2026-06-29 03:25 GMT

Vastu Tips: సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితకాల స్వప్నం. రాత్రింబవళ్లు కష్టపడి, రూపాయి రూపాయి వెనకేసి గూడు కట్టుకుంటారు. అయితే, సరైన అవగాహన లేకనో, నిర్లక్ష్యంతోనో ఇల్లు నిర్మించే సమయంలో కొన్ని వాస్తు తప్పులు చేస్తే... ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు సదా కష్టాలే ఎదురవుతాయి. వాస్తు పురుషుడి అనుగ్రహం లేని ఇల్లు నరకప్రాయంగా మారుతుందని పండితులు హెచ్చరిస్తున్నారు. మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే గృహ నిర్మాణంలో ఈ ఐదు ముఖ్యమైన నియమాలను తప్పక పాటించాలి.

భూమి ఎంపిక...పునాదిలోనే విజయం

ఇంటి నిర్మాణానికి ముందు స్థలాన్ని ఎంచుకోవడం అత్యంత కీలకం. భూమి ఎప్పుడూ త్రిభుజాకారంలో లేదా ఒకవైపు కోతకు గురై ఉండకూడదు. ఈశాన్య దిశ వెడల్పుగా ఉండి, నైరుతి దిశ ఇరుగ్గా ఉండే 'గోముఖాకృతి' స్థలం అత్యంత శుభప్రదం. ఇలాంటి స్థలంలో ఇల్లు కడితే సిరిసంపదలు వెల్లివిరుస్తాయి.

ప్రధాన ద్వారం... లక్ష్మీదేవి వచ్చే దారి

ఇంటి సింహద్వారం అనేది కేవలం రాకపోకలకే కాదు, ఇంట్లోకి ప్రాణశక్తి, సంపద వచ్చే మార్గం. ప్రధాన ద్వారం ఎప్పుడూ ఉత్తరం, ఈశాన్య లేదా తూర్పు దిశల్లోనే ఉండాలి. పొరపాటున కూడా నైరుతి దిశలో సింహద్వారం పెట్టకూడదు. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులు, అప్పుల పాలు అయ్యే ప్రమాదం ఉంది.

వంటగది స్థానం

వంటగది అనేది అన్నపూర్ణా దేవి నివాసం. ఇది ఇంట్లోని వారి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని శాసిస్తుంది. అగ్ని దేవుడికి ప్రీతిపాత్రమైన ఆగ్నేయ దిశలో మాత్రమే వంటగది ఉండాలి. ఒకవేళ ఈశాన్యంలో వంటగది పెడితే, ఆ ఇంట్లో నిరంతరం మానసిక ఒత్తిడి, భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర విభేదాలు వస్తాయి.

టాయిలెట్‌...బాత్‌రూమ్‌ నిర్మాణం

నేటి ఆధునిక కాలంలో అటాచ్డ్‌ బాత్రూమ్స్ కల్చర్ పెరిగింది. కానీ వాస్తు ప్రకారం ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. బాత్రూమ్‌లను ఎల్లప్పుడూ దక్షిణం లేదా పడమర దిశల్లో నిర్మించుకోవాలి. ఇంటి పూజగది అయిన ఈశాన్యంలో టాయిలెట్ నిర్మిస్తే ఆ ఇంటి వంశాభివృద్ధి ఆగిపోతుంది. ప్రతికూల శక్తులు పెరిగిపోయి, సంపాదించిన సొమ్మంతా హాస్పిటల్ పాలవుతుంది.

ఇల్లు కట్టి చూడు... పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. ఇల్లు కట్టడం అనేది జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే అద్భుత అవకాశం. కాబట్టి, నూతన గృహ నిర్మాణానికి పూనుకునే ముందు అనుభవజ్ఞులైన వాస్తు సిద్ధాంతిని సంప్రదించి, దిశలను సరిచూసుకొని అడుగు ముందుకు వేయడం శ్రేయస్కరం.  

Tags:    

Similar News