Ugadi Panchangam: ఉగాది పంచాంగ శ్రవణం..ఈ ఐదు అంగాల వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా?

2026 ఉగాది నాడు పంచాంగ శ్రవణం మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? పూర్తి ఆధ్యాత్మిక వివరణ ఇప్పుడు చూద్దాం.

Update: 2026-03-19 04:00 GMT

Ugadi Panchangam: ఉగాది పంచాంగ శ్రవణం..ఈ ఐదు అంగాల వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా?

Ugadi Panchanga Sravanam 2026: తెలుగువారి లోగిళ్ళలోకి నూతన సంవత్సరం అడుగుపెట్టే వేళ.. ప్రకృతి పులకించే 'ఉగాది' పండుగ మనకు అందించే అతిపెద్ద కానుక పంచాంగ శ్రవణం. కేవలం తిథి, వారాలను తెలుసుకోవడమే కాదు, రాబోయే ఏడాది మన జీవన గమ్యం ఎలా ఉండబోతుందో ముందే ఊహించి, దానికి అనుగుణంగా మనల్ని మనం సిద్ధం చేసుకోవడమే ఈ సంప్రదాయం వెనుక ఉన్న అసలు రహస్యం.

ఏమిటీ పంచాంగం? ఎందుకీ శ్రవణం?

సూర్యచంద్రుల గమనాన్ని, ఖగోళ స్థితిగతులను శాస్త్రీయంగా విశ్లేషించి మన పూర్వీకులు అందించిన అద్భుత పరిజ్ఞానమే పంచాంగం. ఉగాది రోజున ఆలయాల్లో లేదా పండితుల సమక్షంలో పంచాంగం వినడం వల్ల గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని మన పెద్దల నమ్మకం. ఈ శ్రవణం ద్వారా మన రాశిఫలాలు, గ్రహగతులు, ఆదాయ వ్యయాలు మరియు శుభ ముహూర్తాలను తెలుసుకోవచ్చు. ఒకవేళ ఏవైనా దోషాలు ఉంటే, వాటి నివారణకు తగిన పూజలు ఆచరించి ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి ఇది ఒక చక్కని మార్గదర్శిగా పనిచేస్తుంది.

పంచాంగం వింటే కలిగే అద్భుత ఫలితాలు ,పంచాంగం ఎందుకు వినాలో ఈ క్రింది శ్లోకం చాలా స్పష్టంగా వివరిస్తుంది.

తిథేస్తు శ్రీకరం ప్రోక్తం వారమ్‌ ఆయుష్య వర్ధనమ్‌

నక్షత్రం హరతే పాపం యోగో రోగ నివారణమ్‌

కరణం కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమమ్‌.‌

ఈ శ్లోకంలోని అంతరార్థాన్ని గమనిస్తే పంచాంగంలోని ఐదు అంగాల ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది.

తిథి (ఐశ్వర్యం): చంద్రుడి కళలపై ఆధారపడి ఉండే తిథిని తెలుసుకోవడం వల్ల సంపద (శ్రీకరం) సిద్ధిస్తుంది. మన పూజలు, వ్రతాలు అన్నీ తిథి ఆధారంగానే జరుగుతాయి.

వారం (ఆయుష్షు): ఏడు గ్రహాల ప్రభావం మన శరీరంపై ఉంటుంది. వారాన్ని పాటించడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని శాస్త్రం చెబుతోంది.

నక్షత్రం (పాప హరణం): మన జన్మ నక్షత్రాన్ని స్మరించుకోవడం వల్ల మనం తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి. ఇది మన వ్యక్తిత్వ వికాసానికి కూడా తోడ్పడుతుంది.

యోగం (ఆరోగ్యం): సూర్యచంద్రుల స్థితిని తెలిపే యోగం.. మనలోని రోగాలను నివారించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.

కరణం (కార్యసిద్ధి): ఏ పనైనా సరైన కరణంలో ప్రారంభిస్తే విఘ్నాలు తొలగి విజయం (కార్యసిద్ధి) వరిస్తుంది.

నవగ్రహాల ఆశీస్సులు

పురాణాల ప్రకారం, ఉగాది రోజున భక్తితో పంచాంగ శ్రవణం చేసే వారికి..సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు వైభవాన్ని ఇస్తారు.శని అష్టైశ్వర్యాలను, కుజుడు శుభాలను ప్రసాదిస్తారు.రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను అనుగ్రహిస్తారు. కాలం ఎవరి కోసం ఆగదు, కానీ కాలాన్ని గౌరవించి, దాని గమనాన్ని అర్థం చేసుకునే వారికి విజయం ఎప్పుడూ తోడుంటుంది. అందుకే ఈ ఉగాది రోజున షడ్రుచుల పచ్చడితో పాటు, పంచాంగ శ్రవణం అనే అమృతాన్ని కూడా స్వీకరిద్దాం.

Tags:    

Similar News