Rashiphalalu 2026: ఉగాది పంచాంగంలో రాశిఫలితాలు.. సింపుల్ గా ఇలా!
Rashiphalalu 2026: పరాభవ నామ సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉంది? పండితులు చెప్పిన మాటల్ని మన స్టైల్ లో సింపుల్ గా ఇక్కడ తెలుసుకోవచ్చు.
Rashiphalalu 2026
Rashiphalalu 2026: ఉగాది అనగానే తెలుగు ప్రజలకు బాగా గుర్తుకు వచ్చేవి రెండే రెండు. ఒకటి ఉగాది పచ్చడి. రెండు పంచాంగ శ్రవణం. ఆధ్యాత్మికంగా ఉండే విశేషం కన్నా.. ఉగాది పచ్చడి తినేసి పండితులు పంచాంగ పఠనం చేస్తుంటే జాగ్రత్తగా మన రాశి ఎప్పుడు వస్తుందా బుద్ధిగా ఎదురుచూసే తెలుగు వారు చాలామందే ఉంటారు. ఎవరికైనా నిన్న ఏమి జరిగిందో గుర్తు ఉంచుకోవాలని అనిపించదు. ఈరోజు ఎదో అయిపోయిందిలే అనుకుంటారు. కానీ, రేపు ఏమవుతుందో ఇప్పుడే తెలుసుకోవాలనే ఆరాటం ఉంటుంది. కొంతమంది బయటపడి చెబుతారు కొందరు చెప్పరు అదే తేడా. అయితే, బయటపడేవారంతా ప్రతి రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో కచ్చితంగా ఫాలో అయిపోతారు. ఇక రాబోయే సంవత్సరం అంతా ఏమి జరుగుతుంది.. ఎలా ఉంటుంది? మన ఆదాయం ఎలా ఉండొచ్చు.. ఏమైనా వెనకేస్తామా? జీవితంలో కష్టాలు మాయం అయిపోతాయా? ఇలా ఎన్నో సందేహాలు ఉంటాయి. పంచాగం పండితులు చెబుతుంటే ఉగాది రోజు విని తమ రాశికి ఏరకంగా మంచీ చెడూ ఉన్నాయో తెలుసుకోవడం తెలుగువారికి ఇష్టమైన పని. అదే సంప్రదాయంగా వస్తున్న విధానం. అందుకే, తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం తరఫున పంచాంగ శ్రవణం ఏర్పాటు చేస్తారు. అయితే, ఈ మధ్య ప్రతిపక్షంలో ఉన్న నేతలు కూడా పంచాంగ శ్రవణం ఏర్పాటు చేస్తున్నారనుకోండి అది వేరే కథ.
సరే ఇదంతా ఎందుకు గానీ, ఉదయం నుంచి చాలామంది పండితులు పంచాంగ పఠనం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం.. దానికి ప్రజలు కూడా హాజరవడం జరిగింది. ఇక సోషల్ మీడియాలో కూడా పండితులు పంచాంగ వివరాలను పంచుకున్నారు. అలా పండితులు చెప్పిన ఈ సంవత్సరం రాశిఫలాలను ఒక్క చోట చేర్చి దాని భావాన్ని టూకీగా అందిస్తున్నాం ఇక్కడ. లోతైన విశ్లేషణలు.. రెమెడీలు ఏమీ చెప్పడం లేదు. కేవలం ఆయా రాశుల వారికి పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది రెండే రెండు ముక్కల్లో వివరిస్తున్నాం. మరి మీ రాశి గురించి చటుక్కున తెలుసుకోండి.
మేష రాశి..
ఈ రాశిలో అశ్వని, భరణి, కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారు వస్తారు. వీరికి ఆదాయం 11 గాను వ్యయం 5 గాను ఉందని పండితులు చెబుతున్నారు. అంటే, వీరికి ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఖర్చు తక్కువ ఉంటుంది. ఇక వీరిని మెచ్చుకునే వారు ఇద్దరు ఉంటే అవమానం చేసేవారు నలుగురు ఉంటారట. అంటే మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని వారు ఎక్కువ ఉంటారు. అందుకే జాగ్రత్తగా ఉండడం మంచిది. మొత్తంగా చూస్తే ఈ రాశి వారికి పరాభవ నామ సంవత్సరం బాగానే ఉంటుందనేది సారాంశం.
వృషభ రాశి
ఈ రాశిలో కృత్తిక 2,3,4 పాదాల వారు, రోహిణి, మృగశిర 1,2 పాదాల వారు వస్తారు. వీరికి ఆదాయం 5 అయితే, వ్యయం 14 అంట. ఆమ్మో జాగ్రత్త సుమా.. అనుకోని ఖర్చులు మీదపడి అప్పులపాలు అయ్యే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తోంది. మీ సేవింగ్స్ ఉంటే వాటిని పొదుపుగా ఖర్చు చేసుకోండి. ఆడంబరాలకు పోకండి. ఇక రాజపూజ్యం 5 అయితే అవమానం 4 ఫర్వాలేదు. గౌరవంగానే నడిచిపోతుందని ఈ లెక్క చెబుతోంది.
మిథున రాశి
మృగశిర 3,4 పదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాల వారికీ ఈ రాశి వర్తిస్తుంది. వీరికీ ఆదాయం కంటే వ్యయం ఎక్కువ కనిపిస్తోంది. 8 ఆదాయం అయితే, వ్యయం 11 అని చెబుతున్నారు. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. పక్కోళ్లని చూసి పరుగులు తీయకండి అని దీని అర్ధం. బాబోయ్ మిమ్మల్ని ఇష్టపడే వారు ఒక్కరు ఉంటే.. మిమ్మల్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు ఏడుగురు ఉంటారట. ఎవరితోనైనా వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండమనేది ఈ సూచన. అడుసు తొక్కనేల కాళ్ళు కడగనేల అన్నట్టు చెత్త వ్యక్తులకు దగ్గరగా పోయి చిక్కుల్లో పడకండి అంతా బావుంటుంది.
కర్కాటక రాశి
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు కర్కాటకంలో ఉంటాయి. వీరికి కూడా ఆదాయం తక్కువే జస్ట్ 2 అంతే. ఖర్చు మాత్రం 11. మీరు కూడా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. రూపాయి ఖర్చు చేసే పని ఉంటే పది పైసల్లో పూర్తయ్యే విధానాలు ఆలోచించండి. ఇక మిమ్మల్ని పొగిడే వారు నలుగురు ఉంటె తెగిడే వారు ఏడుగురు ఉంటారు. ఇదీ ఇబ్బందే. ఎదుట ఉన్న వ్యక్తిని బట్టి మీరు ఎలా ఉండాలనేది చూసుకోండి. అనవసరంగా ఎవరికీ ఛాన్స్ ఇవ్వకండి.
సింహ రాశి
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఈ రాశిలోకి వస్తాయి. వీరికి అంతా బ్యాలెన్స్ గా ఉంది. ఆదాయం 5.. వ్యయం 5 బారాబర్. అంతకంటే ఏమి కావాలండీ.. టెన్షన్ లేకుండా బండి నడిచిపోద్ది. ఇక మిమ్మల్ని మెచ్చుకునేవారు ఏడుగురు ఉంటే మిమ్మల్ని నొచ్చుకునేలా చేసేవారు ఏడుగురు ఉంటారని చెబుతున్నారు. ఒకే కదా.. లెవెల్ అయిపొయింది కాబట్టి ఇబ్బంది ఉండదు.
కన్యా రాశి
ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు కన్యా రాశిలో ఉంటాయి. వీరికి కూడా వచ్చేది తక్కువ పోయేది ఎక్కువ. 8 ఆదాయం అయితే ఖర్చు 11 అందువల్ల ఆచి తూచి ఖర్చులు చేయండి. ఇక మిమ్మల్ని పొగిడే వారు ముగ్గురు.. ఆడిపోసుకునే వారు ముగ్గురు ఉంటారు. కాబట్టి ఫర్వాలేదు.
తులా రాశి
చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు ఈ రాశిలోకి వస్తాయి. వీరికి ఖర్చులు 14 ఉంటే రాబడి మాత్రం ఐదే. కొంచెం కష్టమే మేనేజ్ చేయడం. కానీ, తప్పదుగా. ఖర్చులు అదుపులో పెట్టుకుని..వ్యవహరించండి. అంతా సెట్ అయిపోతుంది. మీకు గొప్ప రిలీఫ్ ఏమిటో తెలుసా మిమ్మల్ని నెత్తిన పెట్టుకునేవారు ఆరుగురు ఉంటే ముఖం ముడుచుకుని వారు ముగ్గురు ఉంటారని పండితులు చెప్పారు. కాబట్టి డబ్బు లేకపోయినా దర్జాగా గౌరవంగా ఉండొచ్చు.
వృశ్చిక రాశి
విశాఖ 4వ పదం, అనురాధ, జేష్ఠ నక్షత్రాలు ఇందులో ఉన్నాయి. మీకు మాత్రం ఈ ఏడాది అదిరిపోద్దట. డబ్బు వచ్చి పడిపోతుంది. ఖర్చులు పెద్దగా ఉండవు. బాగానే మిగులు ఉంటుంది. ఆదాయం 11-వ్యయం 5 ఉంటుందట ఈ రాశివారికి. సూపర్. ఇక మిమ్మల్ని అవమానించడానికే ఆరుగురు ఎప్పుడూ రెడీగా ఉంటారు. కానీ మిమ్మల్ని మెచ్చుకోవడానికి ఇద్దరే ముందుకు వస్తారట. అందువల్ల జనాలతో జాగ్రత్త.
ధనుస్సు రాశి
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుస్సు రాశిలోకి వస్తాయి. వీరికి కూడా ఆదాయం బాగానే ఉంది. 14 వస్తే ఖర్చు 11 ఫర్వాలేదు. ఇక రాజపూజయం 5, అవమానం 6 ఇదీ ఫర్వాలేదు మేనేజబుల్. అలా అని లెక్కలేకుండా ఖర్చు పెట్టె ప్లాన్స్ వేయకండి సుమా.
మకర రాశి
ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు మకరంలో ఉంటాయి. వీరికి ఖర్చులు బాగానే అంటే 8 ఉంటే .. ఆదాయం మాత్రం 2 గానే ఉంది. మేనేజ్ చేయడం కష్టమే. కానీ, తప్పదుగా. ఖర్చులను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఇక మిమ్మల్ని తిట్టేవారు ఇద్దరుంటే.. అయ్యో అనేవారు ఒక్కరే ఉంటారట. మాట వదిలే ముందు ఆలోచించి వదలండి. అన్నీ సర్దుకుపోతాయి.
కుంభ రాశి
ధనిష్ఠ 3,4 పదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2 పదాలు కుంభ రాశి కిందికి వస్తాయి. వీరికి కూడా మకర రాశివారిలానే ఖర్చులు 8 వచ్చేది 2 కాబట్టి జాగ్రత్త పడాల్సిందే. వీరికి ఊరట ఏమిటంటే ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత అన్నట్టు మీరు గొప్పోరూ సామీ అనేటోళ్లు నలుగురు ఉంటే, ఎహె ఆడేం మనిషి అనేటోళ్లు ఇద్దరు ఉంటారు. కాబట్టి ఫర్వాలేదు డబ్బులేకపోయినా గౌరవంగా ఈ ఏడాది లాగించేస్తారు.
మీన రాశి
పూర్వాభాద్ర నాలుగో పాదం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు మీన రాశిలో ఉంటాయి. వీరికి ఆదాయం 14 ఉంటుందట. వ్యయమేమో 11 అంట.. డబ్బు విషయంలో వీరిపని బాగానే ఉంటుంది. ఇక రాజపూజ్యం 7 ఉంటే , అవమానం 2 గా ఉంది. కాబట్టి గౌరవానికి తక్కువేం లేదు. ఈ రాశివారికి ఈ ఏడాది బావున్నట్టే.
అదండీ విషయం.. ఈ ఏడాది ఎదో రెండు రాశుల వారికి తప్ప అందరికీ డబ్బు గండం గట్టిగానే కనిపిస్తోంది. వచ్చేది తక్కువ.. ఖర్చు ఎక్కువ.. మరి ప్రపంచ పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి కదా. ధరలు పెరిగిపోతున్నాయి. ఇంకా పెరిగిపోతాయనే సంకేతాలు కూడా ఉన్నాయి. అంటే మన దేశ ఆర్ధిక పరిస్థితిలానే మన జాతకాలు కూడా ఉన్నాయని అర్ధం అవుతోంది కదా. ఈ ఏడాది దాదాపుగా అందరూ ఆర్ధికంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల నలుగురితో నారాయణ అనుకుంటూ టెన్షన్ తీసుకోకుండా.. ఉన్న డబ్బును పొదుపుగా ఎలా ఖర్చు చేయాలో అలోచించి ముందడుగు వేయండి.
ఇక రాజపూజ్యం.. అవమానం అంటారా? ఎవరైనా మనల్ని ఎమన్నా దులిపేసుకుంటే అది పెద్ద సమస్య కాదు. కాదని ఎవరో ఏదో అన్నారని మనసులో పెట్టేసుకుని కయ్యానికి వెళదామని అనుకుంటే మాత్రం అసలే డబ్బులు ఉండని పరిస్థితి.. గొడవల్లో ఇరుక్కుంటే బయటకు రాలేరు. లేదా ఎవరో ఏదో అన్నారని కుమిలిపోతే అనవసర ఆరోగ్య సమస్యలు. ఇవన్నీ అవసరమా చెప్పండి. అనే వాళ్ళు అంటారు. ఓడలు బళ్ళు.. బళ్ళు ఓడలు అవుతాయని కదా చెబుతారు. వచ్చే ఏడాది మన జాతకం తిరగబడుద్దేమో.. అప్పుడు మనల్ని అన్నవారే నెత్తిన పెట్టుకుంటారేమో ఎవరికీ తెలుసు. అందుకని కూల్ గా ఈ పరాభవ నామ సంవత్సరాన్ని ఈదేయడానికి ప్రిపేర్ అయిపోండి. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అనుకుంటూ పోతే జీవితంలో కచ్చితంగా విజేతలు అవుతారు. అన్నట్టు పరాభవం తరువాత వచ్చేది ప్లవంగమే. అంటే ప్లవంగ నామ సంవత్సరమే. దీని అర్ధం తెలుసా? దాటించేది అని. ఈ ఏడాది వచ్చే అన్ని కష్టాలు.. పరాభవాలను వచ్చే ఏడాది దాటిపోతాం. అందుకే పాజిటివ్ గా పరుగులు తీయండి.