Nishkalank Mahadev Temple: సముద్రంలో మహాశివక్షేత్రం... పాండవుల కోసం దిగొచ్చిన మహాశివుడు
కురుక్షేత్ర యుద్ధం కారణంగా మూటగట్టుకున్న పాండవుల బ్రహ్మహత్య దోషాలు గుజరాత్‌లోని నిష్కలంక మహాదేవ్ తీరంలో తొలగిపోతాయి.
Nishkalank Mahadev Temple: ప్రకృతి ఒడిలో దైవలీలలు ఎన్నో దాగున్నాయి. అందులోనూ సముద్రపు పోటుపాట్లను తట్టుకుంటూ, నిత్యం సముద్ర జలాలతోనే అభిషేకం చేయించుకునే పరమ పవిత్రమైన ఆలయం గుజరాత్‌లో ఉంది. అదే "నిష్కలంక్ మహాదేవ్" క్షేత్రం. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత, బ్రహ్మహత్య దోషం పోగొట్టుకోవడానికి పాండవులు ఇక్కడే తపస్సు చేశారు. వారి భక్తికి మెచ్చి సాక్షాత్తు పరమశివుడు సముద్ర గర్భం నుండి ఐదు స్వయంభూ లింగాల రూపంలో ఇక్కడ ఆవిర్భవించాడు. రోజులో ఎక్కువ సమయం సముద్ర నీటిలోనే మునిగి ఉంటూ, భక్తుల కోసం కొన్ని గంటలు మాత్రమే బయటకు కనిపించే ఈ ఆలయ రహస్యాలు అద్భుతమనే చెప్పాలి.
నల్లని ఆవు, నల్లని జెండా తెల్లగా మారిన చోటు!
కురుక్షేత్ర యుద్ధం ముగిశాక పాండవులను 'గోత్రహత్య', 'బ్రహ్మహత్య' దోషాలు వెంటాడుతాయి. మనశ్శాంతి కోల్పోయిన పాండవులు శ్రీకృష్ణుడిని ఆశ్రయిస్తారు. అప్పుడు కృష్ణ పరమాత్మ వారికి ఓ నల్లటి ఆవును, నల్లటి జెండాను ఇస్తాడు. నల్ల జెండాను చేతబూని, నల్లని ఆవును అనుసరించాలని, అది ఏ పుణ్యభూమికి చేరుకోగానే తెల్లగా మారిపోతాయో అక్కడే పాపాలు తొలగిపోతాయని చెబుతాడు. అక్కడే శివుడి కోసం తపస్సు చేయమని చెబుతాడు. శ్రీకృష్ణుడు చెప్పిన విధంగానే పాండవులు నల్ల ఆవును అనుసరిస్తూ మైళ్లకొలది దూరం నడుస్తారు. ఇలా వీరు గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా, కోలియాక్ తీరానికి చేరుకున్నారు. ఆశ్చర్యంగా ఆ తీరంలో అడుగు పెట్టగానే ఆవు, జెండా రెండూ తెల్లగా మారిపోయాయి. తమ పాపాలు నిష్కళంకం అయ్యాయని గ్రహించిన ఐదుగురు అన్నదమ్ములు అక్కడ శివుని కోసం తపస్సు చేస్తారు. వారి ప్రార్థన ఆలకించి ఈశ్వరుడు ఒకే వేదికపై ఐదు వేర్వేరు శివలింగాల రూపంలో ప్రత్యక్షమవుతాడు. ప్రతి లింగానికి ఎదురుగా ఒక నంది విగ్రహం కూడా ఉంటుంది.
ప్రకృతి సృష్టించే మహా అద్భుతం - రోజుకు రెండుసార్లు అదృశ్యం!
ఈ ఆలయం సముద్ర తీరానికి దాదాపు 1.5 కిలోమీటర్ల లోపల, అలల మధ్య కొలువై ఉంది. ఇక్కడి ప్రకృతి వింత ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ప్రతిరోజూ అర్థరాత్రి నుండి మధ్యాహ్నం వరకు ఈ ఆలయం పూర్తిగా సముద్రపు నీటిలో మునిగిపోతుంది. ఆ సమయంలో కేవలం 20 అడుగుల ఎత్తున్న ధ్వజస్తంభం మాత్రమే పైకి కనిపిస్తుంది. మధ్యాహ్నం ఒంటి గంట దాటిన తర్వాత సముద్రపు అలలు ఒక్కసారిగా వెనక్కి తగ్గిపోతాయి. అప్పుడు భక్తులు నడుచుకుంటూ వెళ్ళి ఆ ఐదు శివలింగాలను పూజిస్తారు. తిరిగి రాత్రి పది గంటల నుండి నీటిమట్టం క్రమంగా పెరిగి ఆలయాన్ని కమ్మేస్తుంది.
గుజరాత్‌లో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపాలకు సైతం ఈ శివలింగాలు చెక్కుచెదరలేదు. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో వచ్చే పెద్ద అలలు కూడా ఈ ఆలయాన్ని ఏమీ చేయలేవు. ఈ పవిత్ర జలాల్లో పూర్వీకుల అస్థికలను కలిపితే వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. పాండవుల ఇష్టదైవమైన ఈ నిష్కలంక నాథుడిని దర్శించుకుంటే ఎలాంటి పాపాలైనా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. గుజరాత్ వెళ్లినవారు తప్పకుండా భావ్‌నగర్ సమీపంలో ఉన్న ఈ నిష్కలంక మహాదేవుడిని దర్శించుకోండి.