Ghost Temple in Leh: విచిత్రమైన దేవాలయంః ఇక్కడ స్వామికి నీళ్లబాటిల్‌తో పాటు సిగరేట్లు సమర్పిస్తారు

పర్వత ప్రాంతంలో మాత్రం ప్రయాణికులు ఒక ఆత్మను శాంతింపజేయడానికి ఏకంగా సిగరేట్లు, మినరల్ వాటర్ బాటిళ్లను మొక్కుబడిగా సమర్పిస్తారు. అలా చేయకపోతే ప్రమాదాలు జరుగుతాయని అక్కడి వారి నమ్మకం.

Update: 2026-05-22 03:54 GMT

Ghost Temple in Leh: ఈ ప్రపంచంలో దైవ శక్తులను ఎంతగా నమ్ముతారో, అంతే స్థాయిలో దుష్ట శక్తులను, ఆత్మలను నమ్మే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. సాధారణంగా మనం దేవుడి గుడికి వెళ్లి కొబ్బరికాయలు, పూలు, పండ్లు సమర్పించడం చూస్తుంటాం. కానీ, ఒక పర్వత ప్రాంతంలో మాత్రం ప్రయాణికులు ఒక ఆత్మను శాంతింపజేయడానికి ఏకంగా సిగరేట్లు, మినరల్ వాటర్ బాటిళ్లను మొక్కుబడిగా సమర్పిస్తారు. అలా చేయకపోతే ప్రమాదాలు జరుగుతాయని అక్కడి వారి నమ్మకం. వినడానికి విచిత్రంగా ఉన్నా, నేటికీ ఈ ఆచారం కొనసాగుతున్న ఆ ప్రదేశం ఎక్కడుందో, దాని వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ - లేహ్ హైవేపై ప్రయాణించే వారికి ఈ వింత అనుభవం ఎదురవుతుంది.

17,000 అడుగుల ఎత్తులో వెలిసిన ఆలయం

సముద్ర మట్టానికి సుమారు 17,000 అడుగుల అత్యంత ప్రమాదకరమైన ఎత్తులో, పర్వతాల మధ్య గల ‘గాటా లూప్స్’ అనే ఘాట్ రోడ్డు వద్ద ఈ విచిత్రమైన ఆలయం ఉంది. ఈ మార్గంలో ప్రయాణించే లారీ డ్రైవర్లు, పర్యాటకులు ఇక్కడ ఖచ్చితంగా ఆగి, ఆ ఆత్మ కోసం సిగరేట్లు, నీళ్ల బాటిళ్లు అక్కడ వదిలి వెళ్తారు. దీని వెనుక కారణం తెలిస్తే కన్నీళ్లు పెట్టక తప్పదు. కూటి కోసం కోటి విద్యలు అన్న నానుడిని అనుసరించి ఎందురో తమ ప్రాణాలను పణంగా పెట్టి లారీలు నడుపుతుంటారు. కుటుంబ బాధ్యతల కోసం కొందరు క్లీనర్లుగా జీవనం సాగిస్తుంటారు. ఇలాంటి వారు పొరపాటున ప్రాణాలు కోల్పోతే పట్టించుకునే నాథుడు ఉండడు.

30 ఏళ్ల క్రితం జరిగిన ఆ చేదు సంఘటన

ఈ ఆచారం వెనుక దాదాపు 30 సంవత్సరాల క్రితం జరిగిన ఒక విషాదకరమైన కథ ప్రచారంలో ఉంది. 1999వ సంవత్సరంలో ఒక లారీ మనాలీ నుంచి లేహ్ వెళ్తుండగా, ఇక్కడి 22వ మలుపు వద్ద భారీ హిమపాతం కారణంగా చెడిపోయింది. ఆ సమయంలో లారీలో డ్రైవర్, క్లీనర్ ఇద్దరే ఉన్నారు. లారీని అక్కడే వదిలేసి, సహాయం కోసం, తాగునీటి కోసం డ్రైవర్ కాలినడకన సమీపంలోని గ్రామానికి వెళ్లాడు. కానీ, దారి పొడవునా మంచు కురవడం వల్ల డ్రైవర్ తిరిగి రావడానికి చాలా రోజులు పట్టింది. కానీ, ఈలోగా ఆ నిర్జన ప్రదేశంలో, తీవ్రమైన చలికి, తాగడానికి చుక్క నీరు కూడా దొరక్క ఆ క్లీనర్ లారీలోనే తల్లడిల్లుతూ ప్రాణాలు విడిచాడు.

ఆకలి, దాహంతో అల్లాడిన ఆత్మ

ఆ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత, ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు రాత్రి వేళల్లో ఒక యువకుడు కనిపిస్తూ "దాహం.. దాహం.. తాగడానికి కొంచెం నీరివ్వండి" అని అడగడం ప్రారంభించాడట. దాంతో భయపడిన స్థానికులు, ఆ చనిపోయిన క్లీనర్ ఆత్మ శాంతించడం కోసమే అక్కడ ఒక చిన్న మందిరాన్ని నిర్మించారు. ఆ క్లీనర్‌ దాహంతో చనిపోయాడు కాబట్టి నీళ్ల బాటిళ్లను, అలాగే బ్రతికున్నప్పుడు అతనికి అలవాటు ఉన్న సిగరేట్లను భక్తులు అక్కడ సమర్పించడం మొదలుపెట్టారు. అలా సమర్పిస్తేనే తమ ప్రయాణం ఎలాంటి అడ్డంకులు లేకుండా, సురక్షితంగా సాగుతుందని నేటికీ నమ్ముతారు. మనుషుల నమ్మకాలకు, ప్రకృతి సృష్టించే వింతలకు ఈ 'గాటా లూప్స్' ఆలయం ఒక సజీవ ఉదాహరణ. మనాలి- లేహ్‌ మధ్య ప్రయాణం చేసేవారికి ఈ ఆలయం తప్పకుండా పరిచయం ఉంటుంది. ఈ ప్రాంతంలో మొదటిసారి ప్రయాణం చేసేవారు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించి మంచినీళ్లు, సిగరేట్లు సమర్పించండి. ప్రయాణంలో ఆటంకాలు లేకుండా చూసుకోండి. 

Tags:    

Similar News