Hampi: వందల యేళ్లనాటి రహస్యం... హంపీలో తలక్రిందులుగా గోపురం
హంపిలోని విరూపాక్ష దేవాలయంలో రాజగోపురం నీడ తలకిందులుగా కనిపించడం వెనుక ఉన్న శాస్త్రీయ, ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? పిన్‌హోల్ కెమెరా సూత్రంతో అనుబంధమైన అద్భుతమైన విశేషాలు తెలుసుకుందాం.
Hampi: విజయ నగర సామ్రాజ్య వైభవానికి, ప్రాచీన భారతీయ నిర్మాణ రంగానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది కర్ణాటకలోని హంపి క్షేత్రం. ఇక్కడ కొలువైన "విరూపాక్ష దేవాలయం" కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాక, ఆధునిక సైన్స్‌కు సవాలు విసురుతున్న ఒక అద్భుత శిల్ప కళాఖండంగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని ఒక ప్రత్యేకమైన గదిలో, బయట ఉండే భారీ రాజగోపురం నీడ తలకిందులుగా పడటం ఇక్కడి ప్రధాన రహస్యం. శతాబ్దాలు గడుస్తున్నా, అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినా ఈ నీడ వెనుక ఉన్న నిగూఢ రహస్యాన్ని సైంటిస్టులు కూడా పూర్తిగా విశ్లేషించలేకపోతున్నారు.
చారిత్రక రహస్యం
చరిత్రకారుల కథనం ప్రకారం 7వ శతాబ్దంలో చాళుక్యుల కాలంలో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. ఆ తర్వాత హోయసల రాజులు, ఆపై విజయనగర పాలకులు ఆలయాన్ని విస్తరించారు. ముఖ్యంగా విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఈ క్షేత్రం అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దబడింది. ఇక్కడ పరమశివుడు ఉగ్ర రూపంలో 'విరూపాక్షుడిగా' పూజలందుకుంటున్నాడు. స్వామివారి ఉగ్రరూపం కారణంగానే ముఖమండపం మీదుగా కాకుండా, పక్క మార్గం ద్వారా గర్భగుడిలోకి వెళ్లేలా నిర్మాణం చేశారు.
విరూపాక్ష ఆలయ విశేషాలు
ఈ ఆలయంలో తూర్పువైపున ఉన్న ప్రధాన రాజగోపురం సుమారు 160 అడుగుల ఎత్తుతో 9 అంతస్తులుగా ఉంటుంది. అయితే, ఆలయం లోపలి గోడపై ఉన్న చిన్న రంధ్రం ద్వారా కాంతి ప్రసరించి, దాదాపు 15 అడుగుల ఎత్తులో గోపురం నీడ తలకిందులుగా పడుతుంది. ఈ గోపురం నీడ ప్రతిరోజు సూర్యోదయం నుంచి ఉదయం 9 గంటల వరకు అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది.
ఎలా జరుగుతుంది
ఆధునిక భౌతికశాస్త్రంలో పిన్‌హోల్ కెమెరా అని పిలిచే సూత్రాన్ని, వందల ఏళ్ల క్రితమే విజయనగర కాలం నాటి వాస్తు శిల్పులు ఎలాంటి పరికరాలు లేకుండా ఆలయ నిర్మాణంలో ఉపయోగించడం వారి మేధస్సుకు తార్కాణం. చీకటి గదిలోని చిన్న రంధ్రం గుండా సూర్యకాంతి ప్రసరించినప్పుడు బయట ఉన్న భారీ రాజగోపురం ప్రతిబింబం లోపలి గోడపై తలకిందులుగా పడుతుంది. అయితే, భక్తులు మాత్రం దీనిని కేవలం విజ్ఞానంగా మాత్రమే కాకుండా విరూపాక్ష స్వామివారి దివ్య మహిమగా భావిస్తారు. నేటికీ వేలాది మంది పర్యాటకులు, ఆధ్యాత్మిక వేత్తలు ఈ అద్భుతాన్ని స్వయంగా వీక్షించడానికి హంపికి తరలివస్తుంటారు. మన పురాతన ఆలయాల నిర్మాణ చాతుర్యానికి, దైవిక శక్తికి విరూపాక్ష క్షేత్రం ఒక శాశ్వత ఉదాహరణ.