Shangchul Mahadev Temple: ప్రేమికులను కాపాడే ఆలయం...మహాభారత కాలం నుంచే రక్షణ

ప్రేమికులను రక్షించి వారికి ఆశ్రయం కల్పించే ఆలయం దేశంలో ఒకటి ఉందని మీకు తెలుసా? ఈ ఆలయం మహాభారత కాలం నుంచి రక్షణకు పేరుగాంచింది. ఈ ఆలయం విశేషాలను తెలుసుకుందాం.

Update: 2026-08-24 03:51 GMT

Shangchul Mahadev Temple: ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే జంటలకు, పెద్దల నుంచి ఎదురయ్యే బెదిరింపులు, రక్షణ లేకపోవడం నేటి సమాజంలో పెద్ద సమస్యగా మారింది. అయితే భయంతో ఇళ్లను వదిలి వచ్చిన ప్రేమికులకు ఆశ్రయం కల్పించి, వారిని కంటికి రెప్పలా కాపాడే ఒక అరుదైన దివ్యక్షేత్రం మన దేశంలో ఉంది. అదే హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లు జిల్లా, షాంగాడ్ గ్రామంలో ఉన్న షాంగ్చుల్ మహాదేవ్ ఆలయం. ఈ పురాతన శివాలయంలోకి అడుగుపెట్టిన ప్రేమికులను తాకడానికి పోలీసులు గానీ, కక్ష సాధింపులకు దిగే కుటుంబ సభ్యులు గానీ సాహసించలేరు.

మహాభారత కాలంనాటి ఆలయం

ఈ పుణ్యక్షేత్రానికి ద్వాపర యుగం నాటి మహాభారతంతో ప్రత్యక్ష సంబంధం ఉంది. అజ్ఞాతవాస సమయంలో పాండవులు ఈ షాంగాడ్ ప్రాంతంలో ఆశ్రయం పొందుతారు. వారిని వెతుక్కుంటూ, దాడి చేసేందుకు వచ్చిన కౌరవులను ఈ గ్రామ సరిహద్దుల్లోనే పరమశివుడు అడ్డుకుని, పాండవులకు రక్షణ కల్పిస్తాడు. తన సరిహద్దుల్లోకి శరణు కోరి వచ్చిన వారికి ఎల్లప్పుడూ రక్షణ ఉంటుందని ఆ శివుడు అభయమిచ్చాడు. నాటి నుంచి నేటి వరకు ఈ ఆలయ సరిహద్దుల్లోకి వచ్చిన ప్రేమికులకు గ్రామాధికారులు, పూజారులు పూర్తి రక్షణ ఇస్తున్నారు.

ఆలయం ప్రత్యేకతలు

ఇంట్లోంచి పారిపోయి వచ్చిన ప్రేమికులకు ఈ ఆలయంలో ఉచితంగా దాదాపు 6 నెలల పాటు సురక్షిత ఆశ్రయం, ఆహారం లభిస్తాయి. అంతేకాదు, ఆలయ సంప్రదాయాల ప్రకారం, ఆలయ పరిధిలోకి నోటీసులు లేకుండా ప్రవేశించడానికి పోలీసులకు కూడా అనుమతి ఉండదు. కేవలం ఆశ్రయం మాత్రమే కల్పించకుండా, వారి వివాదాలను పరిష్కరించేందుకు కూడా ప్రయత్నిస్తారు. ఆలయ పెద్దలు ఇరువైపులా ఉన్న కుటుంబ సభ్యులను పిలిపించి సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తారు. ఒంటరిగా భయంతో వచ్చినవారిని జంటగా పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదంతో పంపడమే తమ ధర్మమని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఆలయ సరిహద్దుల్లోకి అడుగుపెట్టిన తర్వాత కులమతాల పట్టింపులు ఉండవు. అలాగే ఇక్కడ మద్యం తాగడం, పొగతాగడం, ఆయుధాలు ధరించడం, గట్టిగా మాట్లాడటంపై కఠినమైన నిషేధం ఉంటుంది.  

Tags:    

Similar News