Viral Video: సముద్రం ఒడ్డున అజాగ్రత్తగా ఉంటే ఏమవుతుందో చూడండి.. ఒళ్లు గగుర్పొడిచే వైరల్ వీడియో!
Viral Video: సోషల్ మీడియాలో ఒక భయంకరమైన వీడియో తెగ వైరల్ అవుతోంది. సముద్రపు భారీ అలల మధ్య ఈత కొట్టబోయి ఓ పర్యాటకుడు నీటిలో కొట్టుకుపోయిన దృశ్యాలు నెటిజన్లను వణకిస్తున్నాయి.
Viral Video: సముద్రం ఒడ్డున అజాగ్రత్తగా ఉంటే ఏమవుతుందో చూడండి.. ఒళ్లు గగుర్పొడిచే వైరల్ వీడియో!
Viral Video: సముద్రం పైకి ఎంత అందంగా, ప్రశాంతంగా కనిపిస్తుందో.. లోపల అంతకంటే ఎక్కువ ప్రమాదకరమైన నీటి ప్రవాహాలను దాచుకుంటుంది. బీచ్‌లకు వెళ్లినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో హెచ్చరించేలా ఉన్న ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. భారీగా ఎగసిపడుతున్న అలలను లైట్ తీసుకుని నీటిలోకి దూకిన ఓ యువకుడు.. చూస్తుండగానే సముద్రపు అలల ఉధృతికి కొట్టుకుపోయాడు.
మెక్సికోలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన 'కాబో శాన్ లూకాస్' (Cabo San Lucas) సముద్ర తీరంలో ఈ భయంకర ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో అలల ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. ఒడ్డుకు భారీ అలలు వచ్చి పడుతున్నా.. ఒక పర్యాటకుడు భద్రతా నియమాలను పట్టించుకోకుండా ఈత కొట్టేందుకు నీటిలోకి దూకాడు. ఆ యువకుడు నీటిలోకి వెళ్లిన మరుక్షణమే.. ఒక్కసారిగా ఒక భారీ రాకాసి అల ఎగిసిపడింది. ఆ అలలో చిక్కుకున్న యువకుడు క్షణాల్లో సముద్రం లోపలికి కొట్టుకుపోయాడు.
యువకుడు నీటిలోకి కొట్టుకుపోవడాన్ని గమనించిన అక్కడి స్థానికులు, ఇతర పర్యాటకులు తక్షణమే అప్రమత్తమయ్యారు. ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్లి ఆ యువకుడిని క్షేమంగా బయటకు తీసుకురావడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడ ఉన్న కొందరు పర్యాటకులు ఈ దృశ్యాలను తమ మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
"సముద్రపు అలల శక్తి ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ఘటనే నిదర్శనం" అని కొందరు కామెంట్స్ పెడుతుండగా.. "ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో తాము ఎప్పటికీ నీటిలోకి దిగే సాహసం చేయలేమని" మరికొందరు చెబుతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో, ముఖ్యంగా సముద్ర తీరాలలో అధికారులు పెట్టే భద్రతా హెచ్చరికలను పాటించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన అందరికీ మరోసారి గుర్తుచేస్తోంది.