Railways: సమోసాల కోసం రైలు ఆపిన లోకో పైలట్ .. తర్వాత ఏం జరిగిందంటే..?
Railways: రాజస్థాన్ అల్వార్‌లో సమోసాల కోసం లోకో పైలట్ రైలు ఆపాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై భారతీయ రైల్వే స్పందించింది.
Railways: సమోసాల కోసం రైలు ఆపిన లోకో పైలట్ .. తర్వాత ఏం జరిగిందంటే..?
Railways: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థలలో ఒకటి. లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే రైళ్లకు సమయపాలన, భద్రత ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఇటీవల రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన ఒక విచిత్రమైన ఘటన సోషల్ మీడియాను ఊపేస్తోంది. కేవలం వేడి వేడి సమోసాల కోసం ఒక లోకో పైలట్ ఏకంగా రైలునే నడిరోడ్డుపై ఉన్న రైల్వే క్రాసింగ్ వద్ద ఆపేశాడంటూ ఒక వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసి నెటిజన్లు రైల్వే శాఖపై, డ్రైవర్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే, ఈ వైరల్ కథనం వెనుక ఉన్న అసలు నిజం వేరే ఉంది! భారతీయ రైల్వే స్వయంగా రంగంలోకి దిగి ఈ వ్యవహారంపై అసలు నిజాలను బయటపెట్టింది.
అల్వార్‌లోని దాద్ కరౌలి రైల్వే క్రాసింగ్ వద్ద ఒక రైలు వచ్చి ఆగిపోయింది. రైలు వస్తోందని గేట్‌మెన్ అప్పటికే గేట్లు మూసివేయడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. అయితే స్టేషన్ రాకముందే, క్రాసింగ్ గేటుకు అతి సమీపంలో డ్రైవర్ రైలును ఆపేశాడు. వెంటనే ట్రాక్ పక్కన నిలబడిన ఒక వ్యక్తి చేతిలో ఉన్న వేడి వేడి సమోసాల ప్యాకెట్‌ను లోకో పైలట్ క్యాబిన్ వైపు అందించాడు. డ్రైవర్ దానిని అందుకోగానే, రైలు హారన్ మోగిస్తూ ముందుకు సాగింది. ఈ దృశ్యాన్ని అక్కడ ట్రాఫిక్‌లో ఆగిన ఒక వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. సమోసాల కోసం రైలు ఆపిన డ్రైవర్ అంటూ వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అంతేకాదు, ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారని, ఇద్దరు లోకో పైలట్లతో పాటు ముగ్గురు గేట్‌మెన్లను సస్పెండ్ చేశారంటూ మరికొన్ని తప్పుడు వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి.
ఈ వ్యవహారంపై భారతీయ రైల్వే ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అసలు నిజాలను అల్వార్ రైల్వే వర్గాల సమాచారంతో స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు అది ప్రయాణికులు ఉన్న ప్యాసింజర్ రైలు కాదు. అది 27237, 27600 నంబర్లు గల రెండు ఇంజన్లతో నడుస్తున్న జీసీపీటీ గూడ్స్ రైలు. అసలు లోకో పైలట్ సమోసాలు కొనడానికి రైలును ఆపనే లేదు. రావు రైల్వే యార్డు పరిధిలోని ట్రాక్‌లపై ఆ సమయంలో అత్యవసర ఇంజనీరింగ్ మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఈ సాంకేతిక కారణం వల్ల గూడ్స్ రైలు ముందుకు వెళ్లడానికి సిగ్నల్ దొరకలేదు. దీంతో నిబంధనల ప్రకారం దానిని 'రావు హోమ్ సిగ్నల్' వద్ద నిలిపివేయాల్సి వచ్చింది.
రైలు ఎలాగో సిగ్నల్ లేక అక్కడ ఆగి ఉండటంతో.. ఆ ఖాళీ సమయంలో అసిస్టెంట్ లోకో పైలట్ కిందికి దిగి, ట్రాక్ సమీపంలో ఉన్న షాప్ నుండి సమోసా, కచోరీలను కొనుగోలు చేశాడని రైల్వే శాఖ స్పష్టం చేసింది. సిగ్నల్ పడటంతోనే రైలు ముందుకు కదిలింది తప్ప, సమోసాల కోసం రైలును ఆపలేదని తేలిపోయింది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కనిపించే ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మేయకూడదనడానికి ఈ ఘటనే పెద్ద ఉదాహరణ. సిగ్నల్ లేక ఆగిన రైలును, సమోసాల కోసం ఆపారంటూ తప్పుడు ప్రచారం చేశారు. కాబట్టి రైల్వే శాఖ చెప్పిన అసలు నిజాన్ని గ్రహించి, ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మకండి.